మరి నీ సంగతో!

‘స్వామీ, నువ్వు లేవు. నిజంగా నువ్వుంటే ఏంటి ఇదంతా?’ ఆవేదనగా అన్నాడు భక్తుడు.

Published : 27 May 2021 00:12 IST

బోధివృక్షం

‘స్వామీ, నువ్వు లేవు. నిజంగా నువ్వుంటే ఏంటి ఇదంతా?’ ఆవేదనగా అన్నాడు భక్తుడు.
‘ఏమైంది భక్తా! దేని గురించి చింత?’ మందహాసంతో పలికాడు భగవంతుడు.
నిశ్చేష్టుడయ్యాడు భక్తుడు. వెంటనే తేరుకుని, ‘స్వామీ లోకంలో ఎక్కడ చూసినా అన్యాయాలు, దోపిడీలు, ఎదుటివాడు ఏమైపోతే మనకేంలే అన్న నిర్లక్ష్యం. మనుషులు ఇన్ని తప్పులు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు. అందరినీ వెంటనే ఎందుకు శిక్షించట్లేదు’ చెప్పుకుపోయాడు భక్తుడు.
‘అందరి విషయం సరే, మరి నీ సంగతో?’ ప్రసన్నంగా అడిగాడు భగవంతుడు.
ఖిన్నుడయ్యాడు భక్తుడు. ‘నా విషయమా! నేనెప్పుడూ పరులకు హాని చెయ్యలేదే’ దీర్ఘంగా ఆలోచిస్తూ చెప్పాడు.
‘అవునా! నీ ఎదుట తప్పు జరుగుతుంటే ప్రశ్నించక పోవటం, ఎవరూ చూడట్లేదని రోడ్డు మీదకి చెత్త విసిరేయటం, అర్ధరాత్రిళ్లు పెద్ద శబ్దంతో టీవీ చూడటం... ఇవన్నీ మరచిపోయావా?’
‘దేశాన్ని, ప్రజల్ని దోచేసే వాళ్లతో పోల్చితే అవన్నీ చిన్న తప్పులు కదా స్వామీ!?’ గంభీరంగా ప్రశ్నించాడు భక్తుడు.
‘తప్పు ఏదైనా తప్పే. కొన్నిటికి పశ్చాత్తాపం శిక్ష. కొన్నిటికి జరిమానా శిక్ష. మరికొన్నిటికి కారాగార శిక్ష. ఇంకొన్ని జీవితాన్నే పణంగా తీసుకుంటాయి. దేనికైనా సమయం రావాలి. కానీ, ప్రతి తప్పునకీ ప్రతిఫలం తప్పనిసరి. తప్పు తెలుసుకుని వెంటనే మారినవాడు మనిషి. మళ్లీ మళ్లీ అవే చేసేవాడికి తప్పదు దుర్గతి. మనిషిలో ఆ పరివర్తన కోసమే నేనూ చూస్తుంటాను’ అన్నాడు భగవంతుడు.

‘నిజమే స్వామీ. లోకం మార్పు గురించి ఆలోచించే ముందు నాలో పరివర్తన మొదలవ్వాలి’ అనుకుంటూ కళ్లు తెరిచాడు భక్తుడు. ఉదయ భానుడి లేత కిరణాలు సరికొత్తగా అతనిలో మేల్కొన్న మనిషిని ఆత్మీయంగా తడిమాయి.

- దివ్యాన్షశ్రీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని