ఎక్కడి ప్రఖ్యాతి?

ఒక మహారాజు తన రాజ్యంలోని కపట సాధువు దగ్గరికి వెళతాడు. రాజు నుంచి ఎన్నో బహుమానాలు అందుకున్న

Updated : 03 Jun 2021 06:01 IST

బోధివృక్షం

క మహారాజు తన రాజ్యంలోని కపట సాధువు దగ్గరికి వెళతాడు. రాజు నుంచి ఎన్నో బహుమానాలు అందుకున్న ఆ సాధువు ‘నువ్వు ఈ భూమండలాన్ని జయించి అపరిమిత పేరు ప్రఖ్యాతులు సాధిస్తే నీ పేరు స్వర్గంలో బంగారు కొండ మీద లిఖిస్తారు’ అని చెబుతాడు. అప్పటి నుంచి రాజు నిద్రాహారాలు మాని, కుటుంబ సభ్యుల్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ రాజ్యాలన్నింటినీ జయిస్తాడు. చివరికి చక్రవర్తిగా తుదిశ్వాస విడుస్తాడు. స్వర్గం దగ్గర తనకు జయజయధ్వానాలు పలుకుతారని అనుకుంటాడు. తీరా వెళ్లాక అక్కడి ద్వారపాలకులు అతణ్ని పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా లోపలికి నెడతారు. లోపల ఉన్న భటుడికి తన గొప్పదనమంతా చెప్పి ‘నా పేరుని బంగారు కొండ మీద ఎవరు రాస్తారు?’ అని అడుగుతాడు చక్రవర్తి. ‘ఇక్కడ రాసేవాళ్లు ఎవరూ ఉండరు. ఎవరి పేరు వాళ్లే రాసుకోవాలి’ అని నిర్లక్ష్యంగా సమాధానమిస్తాడు. తీరా చక్రవర్తి చూస్తే ఆ కొండ నిండా లక్షలాది పేర్లు రాసుంటాయి. కొంచెం కూడా ఖాళీ ఉండదు. ఆ విషయాన్ని మళ్లీ ఆ భటుడికి చెబుతాడు. ‘ఏదో ఒక పేరు చెరిపేసి నీ పేరు రాసుకో’ విసుక్కుంటూ అంటాడా భటుడు. ‘ఈమాత్రం గుర్తింపు కోసమా నా జీవిత సర్వస్వాన్ని పణంగా పెట్టింది’ అనుకుంటూ కూలబడతాడు చక్రవర్తి.

- సైదులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని