తొలకరి వాలంగ పుడమి మురవంగ!

అశ్విని నుంచి రేవతి వరకు ఆయా నక్షత్రాల్లో సూర్యుడు ప్రవేశించి ఉండే కాలాన్ని కార్తె అంటారు.

Updated : 03 Jun 2021 05:53 IST

శ్విని నుంచి రేవతి వరకు ఆయా నక్షత్రాల్లో సూర్యుడు ప్రవేశించి ఉండే కాలాన్ని కార్తె అంటారు. ఒక్కొక్క కార్తె పదమూడున్నర రోజులుంటుంది. సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించిన నాటి (జూన్‌ 8) నుంచి మృగశిర కార్తె మొదలవుతుంది. మృగం అంటే లేడి, శిరం అంటే తల. లేడి తలలాగ ఉండే నక్షత్రం కాబట్టి మృగశిర. మృగశీర్ష, ఇల్వల అనే నామాంతరాలున్నాయి. మృగశిర వెనుక పురాణ గాథ ఒకటుంది. ‘మృగ వ్యాధుడు’ అనే రాక్షసుడు దైవ వరంతో మరణం లేకుండా లోకంలో బీభత్సాలు సృష్టిస్తూ, వర్షాలు పడకుండా అడ్డుపడుతూ ఉండేవాడట. అతను పొందిన వరాల్లో లేని సముద్ర అలల నురుగు ఆయుధంగా ఇంద్రుడు అతణ్ని సంహరించాడట. ఆ రోజు నుంచి చినుకులు పడటం మొదలైందట. మృగశిరతో ముగుస్తుంది తాపం అనే నానుడి ఉంది. ఈ కార్తె ప్రారంభం నుంచి తొలకరి చినుకులు పుడమిని పలకరిస్తాయి. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి. ఈ కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అంటారు. మృగశిర కార్తె మొదటి రోజును వివిధ ప్రాంతాల్లో మిరుగు, మృగం, మిర్గం తదితర పేర్లతో వ్యవహరిస్తారు. మౌనవ్రతం పట్టిన పండితుల్లాగ, అప్పటిదాకా విశ్రాంతి తీసుకున్న కప్పలు, మేఘ గర్జనలకు గొంతు విప్పాయి అనే చమత్కార శ్లోకం మృగశిరకు సంబంధించి ఉంది. వీటితో పాటు తూనీగలు, రెక్కలున్న కీటకాలు ఆకాశంలో ఎగురుతాయి. మృగశిరకు ముల్లోకాలు చల్లబడతాయి, మృగశిర కురిస్తే ముసలెద్దు కూడా రంకె వేస్తుంది లాంటి ఎన్నో జాతీయాలు ఈ కార్తె విశిష్టతను తెలియజేస్తాయి.

- రమా శ్రీనివాస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని