తప్పిపోవద్దు!

ఓ ధనికుడికి ఇద్దరు కొడుకులు. ఒకరోజు చిన్నవాడు ‘నాన్నా! నాకు రావాల్సిన ఆస్తి పంచెయ్యి’ అన్నాడు. తండ్రి అతని మాట ప్రకారం చేశాడు. తర్వాత చిన్నకొడుకు వేరే దేశం వెళ్లి డబ్బంతా వ్యసనాలకు

Published : 17 Jun 2021 00:37 IST

క్రీస్తువాణి

ఓ ధనికుడికి ఇద్దరు కొడుకులు. ఒకరోజు చిన్నవాడు ‘నాన్నా! నాకు రావాల్సిన ఆస్తి పంచెయ్యి’ అన్నాడు. తండ్రి అతని మాట ప్రకారం చేశాడు. తర్వాత చిన్నకొడుకు వేరే దేశం వెళ్లి డబ్బంతా వ్యసనాలకు ఖర్చు చేశాడు. చేతిలో చిల్లి గవ్వ లేక ఒక రైతు దగ్గర పందుల్ని మేపే పనికి కుదిరాడు. ఆకలికి తాళలేక పందులకు పెట్టే పొట్టు తిని కడుపు నింపుకునేవాడు. ఆ దీనావస్థలో అతనికి అసలు విషయం తెలిసొచ్చింది. ‘నా తండ్రి దగ్గర ఎంతోమంది సేవకులు రెండు పూటలా కడుపు నిండా రుచికరమైన ఆహారం తింటున్నారు. నేను తండ్రి ప్రేమ తెలుసుకోలేక, ఆయన్ని కష్టపెట్టి కొడుకు అనిపించుకునే అర్హత కోల్పోయాను. నా తండ్రి ఇంట్లో పనివాడిగా అయినా చేరతాను’ అనుకుని తిరిగి వెళ్లాడు.
చిన్నకొడుకుని చూసిన వెంటనే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్లి హత్తుకున్నాడు. సేవకులను పిలిచి ‘నా బిడ్డ స్నానానికి ఏర్పాట్లు చేయండి. కొత్త దుస్తులు, ఉంగరం, పాదరక్షలు అందించండి. ఈ రోజు మనింట్లో గొప్ప విందు’ అన్నాడు. ఆ మాటలకి పెద్దకొడుకు, ‘నాన్నా! పాపం చేసినవాణ్ని స్వాగతిస్తూ పండగ చేస్తున్నావా?’ అని అడిగాడు. దానికి తండ్రి, ‘నీ తమ్ముడు తప్పిపోయి మళ్లీ దొరికాడు. అందుకే ఈ వేడుక’ అని అన్నాడు. ఈ కథని క్రీస్తు ప్రభువు తన శిష్యులకు చెప్పారు. ఇక్కడ తప్పిపోవటం అంటే ప్రభువు దృష్టిలో దారితప్పటం. ప్రేమ రాహిత్యం. ‘నువ్వు దీర్ఘాయుష్మంతుడివి అయినంత కాలం నీ తల్లిని, తండ్రిని సన్మానించు’ అంటుంది పరిశుద్ధ గ్రంథం బైబిల్‌. అయితే, తల్లిదండ్రుల విలువ తెలియని పిల్లలు అప్పుడప్పుడూ తప్పిపోతుంటారు. కన్నవాళ్లని అలక్ష్యం చేస్తుంటారు. వృద్ధాప్యంలో నిరాదరిస్తుంటారు. అలాంటి వారికి కనువిప్పు కలిగిస్తూ, తల్లిదండ్రుల నిస్వార్థ ప్రేమను తెలియజెప్పే కథ ఇది.

- ఎం.సుగుణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని