మర్రి మాలక్ష్మికి కోటి దండాలు

ప్రాణవాయువు, ఆహారం, ఔషధాలు అందించే వృక్షాలను పూజించటం దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. మానవుణ్ని నరకం నుంచి

Published : 24 Jun 2021 01:22 IST

ప్రాణవాయువు, ఆహారం, ఔషధాలు అందించే వృక్షాలను పూజించటం దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. మానవుణ్ని నరకం నుంచి తప్పించేవి చెట్లేనని వరాహపురాణం చెబుతుంది. రావి, నిమ్మ, దానిమ్మ, మర్రి మొక్కలను ఒక్కొక్కటి చొప్పున, అయిదు మామిడి, పది పూల మొక్కలు నాటి సంరక్షిస్తే నరక బాధ ఉండదని పెద్దలు పేర్కొంటారు. ప్రళయంలో సృష్టి మొత్తం జలమయమైనా మర్రిచెట్టు (వటవృక్షం) నిలిచి ఉంటుందని ప్రతీతి. మర్రి త్రిమూర్తుల స్వరూపమని వేదవాక్కు. మర్రి వేళ్లు బ్రహ్మకు, కాండం విష్ణువుకి, కొమ్మలు శివుడికి, ఊడలు శక్తి తత్వానికి ప్రతీక. మర్రి ఆకుల్లో ఔషధ గుణాలున్నాయి. మర్రి కింద కూర్చొని దక్షిణామూర్తి తన శిష్యులకు జ్ఞానబోధ చేశాడు. అందుకే మహిళలు తమ సౌభాగ్యానికి, కుటుంబ క్షేమానికి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు (జూన్‌ 24) వట సావిత్రి వ్రతం ఆచరిస్తారు. సత్యవంతుడికి ఏడాది ఆయుష్షే ఉందని తెలిసినా, సావిత్రి అతణ్ని కోరి వరించింది. భర్త మరో మూడు రోజుల్లో మరణిస్తాడనగా మర్రిచెట్టు కింద వ్రతం ప్రారంభించింది. యమధర్మరాజును దర్శించి ‘దీర్ఘ సుమంగళీభవ’ ఆశీర్వాదం అందుకుంది. అందుకే ‘వట సావిత్రీ వ్రతం’గా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ రోజు మర్రి కాండానికి నూలు దారం చుట్టి, చెట్టు చుట్టూ కనిష్ఠం 11, గరిష్ఠంగా 108 ప్రదక్షిణలు చేస్తారు. సావిత్రి కథ చెప్పుకుంటారు. మర్రి చెట్టులా ఉన్నతంగా ఎదిగి భర్త కుటుంబానికి గొప్ప ఆదరువు కావాలన్న ఆకాంక్ష ఇందులో కనిపిస్తుంది.

- డా।। మాధవపెద్ది విజయలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని