వ్యత్యాసం అదే

‘స్వర్గనరకాలు అంటే ఏంటి? అవి నిజంగా ఉన్నాయా? వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు చెబుతారా?’ ప్రసిద్ధ జెన్‌ గురువు హకుయిన్‌ని ఆసక్తిగా అడిగాడు ఒక పోరాటయోధుడు.

Published : 01 Jul 2021 01:10 IST

జెన్‌ కథ

‘స్వర్గనరకాలు అంటే ఏంటి? అవి నిజంగా ఉన్నాయా? వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు చెబుతారా?’ ప్రసిద్ధ జెన్‌ గురువు హకుయిన్‌ని ఆసక్తిగా అడిగాడు ఒక పోరాటయోధుడు.

హకుయిన్‌ అతణ్ని పరికించి చూసి ‘ఎవరు నువ్వు?’ అని ప్రశ్నించాడు. ‘నేనొక యోధుణ్ని’ గర్వంగా చెప్పాడతను. ‘అలాగా! అయినా, అలాంటి లోతైన విషయాల్ని అర్థంచేసుకోగలవని ఎలా అనుకుంటున్నావు? నువ్వో క్రూరమైన, పాషాణ హృదయం ఉన్న సైనికుడివి. నీకవన్నీ బుర్రకెక్కవు. పిచ్చి ప్రశ్నలతో నా సమయం వృథా చెయ్యకుండా వెంటనే ఇక్కణ్నుంచి వెళ్లు’ చేతులు విసురుగా ఊపుతూ కటువుగా అన్నాడు హకుయిన్‌.

అంతే, ఆ యోధుడిలో కోపం కట్టలు తెంచుకుంది. హకుయిన్‌ మాటల్ని ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోయాడు. ఆయన్ని అంతం చేసేందుకు ఒరలోంచి వేగంగా కత్తి బయటికి లాగి ఒకడుగు ముందుకేశాడు.

‘ఇదే నరకం’ ప్రశాంతంగా బదులిచ్చాడు హకుయిన్‌.

ఆ పోరాటయోధుడు అకస్మాత్తుగా ఆగిపోయాడు. ఆవేశంలో తాను ఎంతటి దారుణమైన పనికి పూనుకున్నాడో గ్రహించాడు. అతనిలో అణువణువునా అపరాధ భావం నిండింది. కత్తి పక్కకి విసిరేసి హకుయిన్‌ ముందు మోకరిల్లాడు ఆ పోరాట యోధుడు.

‘ఇదే స్వర్గం’ అంతే శాంతంగా పలికాడు ఆ గురువు.

- ఎం.అక్షర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని