మెలకువగా ఉండండి!

ఈ లోకంలో ప్రతి మనిషీ ఏదో ఒక విషయానికి భయపడతాడు. కొంతమందికి జబ్బులంటే భయం. కొందరికి ఏదైనా హాని వాటిల్లుతుందేమో అనే భయం. వీటన్నింటికీ మించింది చావు భయం. అది ఏదో ఒకనాడు ప్రతి జీవికీ తప్పనిసరి! దాని గురించి భయం లేకుండా ప్రశాంతంగా గడిపే వీలుందా?

Published : 01 Jul 2021 01:12 IST

క్రీస్తు వాణి

లోకంలో ప్రతి మనిషీ ఏదో ఒక విషయానికి భయపడతాడు. కొంతమందికి జబ్బులంటే భయం. కొందరికి ఏదైనా హాని వాటిల్లుతుందేమో అనే భయం. వీటన్నింటికీ మించింది చావు భయం. అది ఏదో ఒకనాడు ప్రతి జీవికీ తప్పనిసరి! దాని గురించి భయం లేకుండా ప్రశాంతంగా గడిపే వీలుందా? అంటే ‘ఉంది’ అంటారు క్రీస్తు ప్రభువు. పరలోక రాజ్యం దీపాలను పట్టుకొని పెళ్లి విందు కోసం బయలుదేరిన పది మంది కన్యలను పోలి ఉందని ఓ సందర్భంలో చెబుతారు క్రీస్తు. వారిలో అయిదుగురు తెలివైనవారు, మరో అయిదు మంది తెలివి లేనివారు. తెలివైన కన్యలు కళ్లల్లో వత్తులు వేసుకొని నిద్రపోకుండా పెళ్లి కుమారుని పిలుపు విని విందుకు హాజరయ్యారు. తెలివిలేని కన్యలు నూనె లేని దీపాలతో నిద్రపోయారు. మనుషులు ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉండాలనే హెచ్చరికను క్రీస్తు ఈ ఉపమానం ద్వారా చెప్పారు. ‘ఆ రోజు అయినా, ఘడియ అయినా మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండండి’ అంటున్నారు ప్రభువు. అడవిలో జంతువులు తమను వేటాడే శత్రువు పట్ల నిత్యం అప్రమత్తతతో ఉంటాయి. మరి మానసికంగా, శారీరకంగా వికసించిన బుద్ధిజీవి అయిన మనిషి తనను వెంటాడే జంతువుల పట్ల మెలకువగా ఉంటున్నాడా అనేదే ప్రశ్న? వెంటాడే జంతువులంటే క్రోధం, ద్వేషం, పగ, అసూయ లాంటివి. ఇవన్నీ క్షణక్షణం మనల్ని మింగటానికి సిద్ధంగా ఉంటాయి. వీటి పట్ల మెలకువగా ఉండాలి. ప్రేమ కరుణ, సేవ అనే దివిటీలు వెలిగించి సిద్ధంగా ఉండాలి. ఇలా మెలకువగా ఉండే మనిషికి భయం లేదు. బెదురు లేదు. అనాయాసంగా తన జీవన పయనాన్ని సాగిస్తాడు అన్నది క్రీస్తు సందేశం.             

- ఎం.సుగుణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని