కూర్మావతారం ఓ శక్తి సందేశం!

శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల్లో రెండోది కూర్మావతారం. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఎన్నో లోతైన విషయాలను వెల్లడిస్తుంది. క్షీరసాగర మథనంలో వాసుకి, మందరం, సముద్రం అనే పదాలు అసాధారణ అర్థాలు కలిగి ఉన్నాయి. వాసుకి అంటే మూలాధారంలోని కుండలినీ సర్పం.

Published : 01 Jul 2021 01:16 IST

జులై 6 శ్రీకూర్మ జయంతి

శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల్లో రెండోది కూర్మావతారం. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఎన్నో లోతైన విషయాలను వెల్లడిస్తుంది. క్షీరసాగర మథనంలో వాసుకి, మందరం, సముద్రం అనే పదాలు అసాధారణ అర్థాలు కలిగి ఉన్నాయి. వాసుకి అంటే మూలాధారంలోని కుండలినీ సర్పం. ఇది యోగశక్తి, శ్వాసకు సంకేతం. మందరం అంటే నిలువుగా-అడ్డంగా కిందకి-పైకి కదిలేది. ఇది మనం ధ్యానంలో ఉన్నప్పుడు కిందకు-పైకి కదిలే కుండలినీ శక్తికి (ఉచ్ఛ్వాస - నిశ్వాసాలు) ప్రతీక. సముద్రం అంటే భగవత్‌ చింతనం. ఊగిసలాడే మందరానికి కింద ఆధారం లేకపోవడంతో అది సముద్రంలో మునిగి పోతున్నప్పుడు శ్రీహరి కూర్మావతారాన్ని ఎత్తి మునగకుండా ఉంచాడు. ఇందులో రహస్యార్థం ఏమంటే- ధ్యాన ప్రక్రియలో శ్వాసను ఎప్పుడూ ఊర్ధ్వంలోనే (పై మార్గంలో) ఉంచాలని, శ్వాస అవరోధం జరిగితే ఉపాసన-సాధనాలు దెబ్బతిని అనుకున్నది సాధించలేమని కూర్మావతారం తెలియజేస్తుంది. అలాగే నిరుక్త నిఘంటువులో కూర్మం అనే పదానికి ‘భూ సంబంధమైన ఆశ, శోకం, శ్వాస, ఆకలి, దప్పిక, మరణం అనే ఆరు లక్షణాలను కలిగిన షడూర్ముల జీవం’ అనే నిర్వచనం ఉంది. అంటే తాబేలు జీవ ధర్మాలు కలిగిన జీవి అని అర్థం. దీన్నిబట్టి వంశ వృద్ధి జరగాలన్నా, సంస్కారాలను సక్రమంగా నిర్వర్తించాలన్నా ఆరోగ్యంగా ఉండాలని కూర్మం బోధిస్తుంది. మరో కోణంలో చూస్తే సాధన చేసేటప్పుడు దాన్ని సాధించే వరకూ పట్టు విడవకూడదని, ఎంత కష్టమైనా భరించి తీరాలని, అందుకోసం సాధకుడు బలమైన ఆహారంతో శక్తిమంతుడై ఉండాలనే సందేశం కూర్మావతారంలో ఇమిడి ఉంది.

- చల్లా జయదేవ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని