అందుకే ఆనందం!

బుద్ధుడి తండ్రి శుద్ధోదనుడి సోదరుడి కుమారుడు భద్దియుడు కూడా తథాగతుని బోధనలకు ఆకర్షితుడై బౌద్ధ దీక్ష తీసుకున్నాడు. ఒకసారి భద్దియుడు ఒంటరిగా వనంలో కూర్చుని ‘ఆహా ఎంత ఆనందం! ఎంత సుఖం!’ అని

Published : 08 Jul 2021 01:21 IST

బుద్ధం శరణం...

బుద్ధుడి తండ్రి శుద్ధోదనుడి సోదరుడి కుమారుడు భద్దియుడు కూడా తథాగతుని బోధనలకు ఆకర్షితుడై బౌద్ధ దీక్ష తీసుకున్నాడు. ఒకసారి భద్దియుడు ఒంటరిగా వనంలో కూర్చుని ‘ఆహా ఎంత ఆనందం! ఎంత సుఖం!’ అని మైమరచి తనలో తాను అనుకోవటం బౌద్ధభిక్షువుల చెవినపడింది. వెంటనే వారు బుద్ధుడితో ఆ విషయం చెప్పి, ‘భద్దియుడి మనసు నిశ్చలంగా లేదేమో అనిపిస్తోంది. అతను బ్రహ్మచర్యం సరిగా పాటిస్తున్నట్లు లేదు’ అని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే బుద్ధుడు భద్దియుణ్ని పిలిచి విషయం అడిగాడు. అలా అనటం నిజమే అన్నాడతను. ‘ఏ ఉద్దేశంతో అలా అన్నావు?’ ప్రశ్నించాడు బుద్ధుడు.

‘దేవా! ఇంతకాలం శాక్యవంశ రాకుమారుడిగా ఎన్నో భోగాలు అనుభవించాను. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా నా చుట్టూ ఎంతో మంది అంగరక్షకులు ఉండేవారు. కానీ, ఎప్పుడూ ఏదో బతుకు భయం. ఏం జరుగుతుందో అన్న ఆందోళన. ఇప్పుడు అవేమీ లేవు. భిక్షాన్నం తింటూ, చెట్ల కింద నిద్రిస్తూ, నిశ్చింతగా, హాయిగా, ఆనందంగా ఉన్నాను. ఆ ఉద్దేశంతోనే అలా అన్నాను’ అన్నాడు భద్దియుడు. ఆ మాటలు విన్న బుద్ధుడు ఇలా చెప్పాడు... ‘నిర్భయుడు, ఆనందంగా ఉన్న వ్యక్తి మనసు తెలుసుకోవడం కష్టం! భిక్షువు అయిన వాడు మోహాలను జయిస్తాడు. తల నరికిన తాటిచెట్టు మళ్లీ పెరగదు అన్నట్లు- ఒకసారి రాగద్వేషాలు నశించాక తిరిగి పుట్టవు’

- శాలిని


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని