క్షేమ సౌభాగ్యాల బోనం

ఊరూవాడా సందడిగా ఉత్సాహం అంబరాన్నంటగా సాగే పండగ బోనాలు. ఎన్నో రూపాల్లో ప్రజల కడగండ్లను తీర్చే అమ్మవారికి భక్తితో నైవేద్యం సమర్పించే ఈ వేడుక విశిష్టతల్లోకి వెళితే...

Published : 08 Jul 2021 01:21 IST

జులై 11 గోల్కొండ బోనాలు

ఊరూవాడా సందడిగా ఉత్సాహం అంబరాన్నంటగా సాగే పండగ బోనాలు. ఎన్నో రూపాల్లో ప్రజల కడగండ్లను తీర్చే అమ్మవారికి భక్తితో నైవేద్యం సమర్పించే ఈ వేడుక విశిష్టతల్లోకి వెళితే...

* చెడును దూరం చేసి మంచిని కాపాడిన దేవతలకు, ముఖ్యంగా ఎన్నో అవతారాల్లో దుష్ట సంహారం చేసిన దేవిని భక్తి భావంతో పూజించటమే బోనాలు ఉత్సవాలు.

* తనకు తెలియని, తన కళ్లముందు జరుగుతున్న అద్భుత సంఘటనలను చూస్తూ వాటన్నింటికీ ఊహాశక్తిని మిళితం చేసి మనిషి ఎన్నో శక్తులను ప్రతిపాదించుకున్నాడు. తనను మించిన, తనను నడిపిస్తున్న ప్రతిదీ భగవత్‌ రూపంగా భక్తితో ఆరాధిస్తున్నాడు. ఈ క్రమంలో సృష్టి ఉద్భవాన్ని ఒక్కొక్కరు ఒక్కో రీతిగా ఊహించారు. తెలుగు జానపద గాథల్లో సృష్టికర్తగా అమ్మవారు దర్శనమిస్తుంది.

* ‘దేవో దానాద్‌వా, దీపనాద్‌వా, ద్యుస్థానో భవతీతివా’ అనే వ్యాక్యాన్ని బట్టి, ‘ఇచ్చేది, ప్రకాశించేది, ప్రకాశింపజేసేది, ఉత్తమ ద్యుస్థానంలో ఉండేది ‘దేవత’. అంటే, జ్ఞానం, ప్రకాశం, శాంతి, ఆనందం, సుఖం లాంటివి ఇచ్చే సకల జడచేతనాలు, పదార్థాలను దేవతలు అని పేర్కొంటున్నారు. 

* తరతరాలుగా జనసమూహంలో నిలిచి ఉన్న నమ్మకాలు, సంప్రదాయాలు, ఆచార రూపంగా నిలిచినవే పండగలు, జాతరలు. మొదట ప్రకృతి ఆరాధనతో ప్రారంభమై, వ్యవసాయ సంస్కృతితో సమ్మేళనం చెంది, తర్వాతి కాలంలో ప్రాచీన జీవితాన్ని సూచిస్తూ ఉల్లాసాన్ని కలిగించేవిగా ఇవి నిలిచాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పల్లె మనసున్న అందరూ భక్తిభావంతో జరుపుకునే ఉత్సాహభరిత పండగగా బోనాలని చెప్పుకోవచ్చు. వీటిలో ‘దేవి’ గ్రామ దేవత రూపంలో పూజలందుకుంటుంది.

* హైదరాబాదులో బోనాల పండగ ఆషాఢంలో గోల్కొండ జగదాంబిక అమ్మవారితో మొదలై, జులై 25న సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి, ఆగస్టు 1న లాల్‌ దర్వాజా, అలాగే ఆయా ప్రాంతాల్లో గండి మైసమ్మ, ముత్యాలమ్మ, డొక్కలమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ ఇలా అమ్మ ఎన్నో రూపాలుగా ఉన్న ఆలయాల్లో బోనాలు దివ్యంగా జరుగుతాయి. కొన్నిచోట్ల వైశాఖ, జ్యేష్ఠ, శ్రావణ మాసాల్లో ఈ వేడుకలు నిర్వహిస్తారు. వేయి నామాలు కలిగిన శ్రీలలితా రూపాల్లో ఉగ్రమూర్తులైన దుర్గ, చండిక, కాళిక ఆలయాల్లో బోనాలు ఘనంగా జరుపుతారు.

* బోనం అంటే భోజనం. అమ్మవారికి నైవేద్యాన్ని (భోజనాన్ని) కృతజ్ఞతతో సమర్పించే పండగ బోనాలు. నిత్యం ప్రకృతి రూపంలో, ప్రతి కదలికలో మనల్ని కాపాడే అమ్మవారు ఎన్నో రూపాల్లో దర్శనమిస్తుంది. ఆ దేవతలను ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ బోనంతో పాటు, రకరకాల ఉయ్యాల తొట్టెలను సమర్పిస్తారు.

* మనిషి జీవితానికి ప్రతీకగా చాలా మంది మట్టి కుండలో బోనాన్ని సమర్పిస్తారు. బెల్లం, పాలు, పెరుగు లాంటి వాటితో కలిపి చేసిన అన్నాన్ని బోనం కుండలో పెట్టి వేపాకులతో అలంకరించి, దాని పైన మూతలో దీపాన్ని ఉంచుతారు. మొదటగా దాన్ని ఇంట్లో దేవుడి దగ్గర ఉంచి ఇంటిల్లిపాదీ భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. తర్వాత బోనం తలకెత్తుకుని వెళ్లి సాక పోస్తారు. బోనాలని ఆషాఢ మాసంలో ఆది, సోమవారాల్లో జరపడం విశేషం.

దుష్టశక్తులను పారదోలడానికి, అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి జరిగే బోనాల ఉత్సవం కొంత రౌద్రం, కొంత శాంతం మేళవింపుగా ఉంటుంది. బోనాల్లో పోతరాజుల విన్యాసాలు, రంగం లాంటివి ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. బోనం ఎత్తుకున్న మహిళను అమ్మవారి అంశగా భావిస్తారు. తల్లిగారింటికి కుమార్తె వచ్చినట్లుగా అమ్మవారికి నైవేద్యంతో పాటు పట్టుచీరలు, రకరకాల కానుకలు సమర్పించి వడి బియ్యం పోస్తారు. ప్రకృతిని, అమ్మవారిని... వెరసి సమాజాన్ని గౌరవించడంగా బోనం ఆంతర్యాన్ని చెప్పుకోవచ్చు.

- డా।। బండారు సుజాత శేఖర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని