అబద్ధాలు వద్దు

ప్రవక్త బోధనల గ్రంథంలో అసత్యం వల్ల కలిగే అనర్థాలు, పర్యవసానాల గురించి విపులంగా రాశారు. అబద్ధం అనైతికం అన్నారు ఉలమాలు. అబద్ధం చెబుతున్నారంటే నిజాలను దాస్తున్నారన్నమాట.

Updated : 29 Jul 2021 01:30 IST

ఇస్లాం సందేశం

ప్రవక్త బోధనల గ్రంథంలో అసత్యం వల్ల కలిగే అనర్థాలు, పర్యవసానాల గురించి విపులంగా రాశారు. అబద్ధం అనైతికం అన్నారు ఉలమాలు. అబద్ధం చెబుతున్నారంటే నిజాలను దాస్తున్నారన్నమాట. హాస్యానికి కూడా అబద్ధం వద్దని, పిల్లలకు ఏదైనా ఇస్తానని, ఇవ్వకున్నా అబద్ధమే అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స). ‘నిజాలతో అబద్ధాలు అంతరిస్తాయి. అసత్యం నశించాల్సిందే’ అని ఖురాన్‌ ప్రకటించింది. ముహమ్మద్‌ (స) ప్రవక్త పదవికి ముందు కూడా సత్యానికి ప్రతిరూపమే. అప్పుడు మక్కా ప్రజలు ఆయనను సాదిక్‌ (సత్యసంధుడు) అని పిలుచుకున్నారు. ఖురాన్‌ అబద్ధాలాడేవారిని మునాఫిక్‌ (అవిశ్వాసి)గా ప్రకటించింది. అబద్ధాలకోరులు నాలుకను కూడా నియంత్రించుకోలేరు. పరిస్థితి చేయి దాటినప్పుడు దుర్భాషలకు దిగుతారు. హద్దులను అతిక్రమిస్తారు. వాగ్దాన భంగం చేసేవారిని, హద్దులు మీరే వారిని నమ్మలేం. ఈ దుర్గుణాలు లేనివారే నిఖార్సయిన ముస్లిములు. ప్రాణంమీదకు వచ్చినా వారు అబద్ధం పలకరు. ఇలాంటివారికే గౌరవం దక్కుతుంది. వారే ఇహపరలోకాల్లో సాఫల్యం పొందుతారు. సత్యానికి దూరమైన వారు అల్లాహ్‌ అనుగ్రహానికి దూరమవుతారు. (దివ్యఖురాన్‌ 3:61). అబద్ధాలకోరులకు మేలు జరగదని, ఆ నోటా ఈ నోటా విన్న విషయాలను నిర్ధారించుకోకుండా ప్రచారం చేయడం కూడా అబద్ధం కిందికే వస్తుందని ఖురాన్‌ హెచ్చరిస్తోంది. ఒకరి హక్కులకు విఘాతం కలిగించే, మానమర్యాదలను హరించే అబద్ధాలను ఇస్లామ్‌ తీవ్రంగా పరిగణిస్తుంది. ‘అబద్ధాలాడటం వల్ల సంపద తగ్గుతుంది’ అన్నారు ప్రవక్త. సంపద అంటే కేవలం డబ్బే కాదు. పరువుప్రతిష్ఠలు, ఆరోగ్యం, ఉపాధి ఇలా ఏదైనా కావచ్చనేది ఈ ప్రవచనానికి ఉలమాల తాత్పర్యం.

- తహూరా సిద్దీఖా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని