ఆ ఆరాధన చెల్లని నాణెమే

దారిలో అడ్డంగా ఉన్న వస్తువును తొలగించడం దానంతో సమానం. ఒకరి దారికి ఆటంకాలు ఏర్పరచడం, మాటలు, చేతలతో ఇబ్బందిపెట్టడం మహాపాపం అంటారు ప్రవక్త (స). అలాంటివారిని అల్లాహ్‌ అనుగ్రహించడు. ఎవరికీ ఏ ఇబ్బందీ కలిగించనని సంకల్పం చేసుకోవాలంటారు ఉలమాలు.

Updated : 12 Aug 2021 03:44 IST

దారిలో అడ్డంగా ఉన్న వస్తువును తొలగించడం దానంతో సమానం. ఒకరి దారికి ఆటంకాలు ఏర్పరచడం, మాటలు, చేతలతో ఇబ్బందిపెట్టడం మహాపాపం అంటారు ప్రవక్త (స). అలాంటివారిని అల్లాహ్‌ అనుగ్రహించడు. ఎవరికీ ఏ ఇబ్బందీ కలిగించనని సంకల్పం చేసుకోవాలంటారు ఉలమాలు. అప్పుడు ఇరుగుపొరుగు మనవల్ల ప్రశాంతంగా ఉండగలరు. ఒకవేళ మనవల్ల ఎదుటివారికి దుఃఖం కలిగితే మన్నించమని వేడుకోవాలన్నది ఇస్లామ్‌ ఉద్బోధ. బాధితుల ఆక్రందన నేరుగా అల్లాహ్‌కి చేరుతుందని ప్రవక్త హెచ్చరించారు. ‘పొరుగువారు, బాటసారులు, నౌకర్ల పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి’ (ఖురాన్‌ 4:36) ఒకవ్యక్తి మహాప్రవక్తతో ‘ఫలానా స్త్రీ నఫిల్‌ (అదనపు) నమాజులు చేస్తుంది, నఫిల్‌ ఉపవాసాలు పాటిస్తుంది. దానధర్మాలు చేస్తుంది. ఖ్యాతి కూడా పొందింది. కానీ మాటలతో పొరుగువారిని కష్టపెడుతుంది’ అని చెప్పాడు. దానికాయన ‘ఆమె నరకానికే పోతుంది’ అన్నారు. తిరిగి ఆ వ్యక్తి అన్నాడు-  ‘దైవప్రవక్తా! ఫలానా మహిళ అరుదుగా నమాజు చేస్తుంది, రోజాలు పాటిస్తుంది, కాస్త జున్ను దానం చేస్తుంది. కానీ ఎన్నడూ పొరుగువారిని కష్టపెట్టదట’ ఇది విని మహాప్రవక్త (సఅసం) ‘ఈమె స్వర్గ నివాసి’ అని సెలవిచ్చారు. అందరూ సత్సంబంధాలతో, సాన్నిహిత్యంగా, ప్రేమగా మెలగాలని ఇస్లామ్‌ బోధనలు నిర్దేశిస్తున్నాయి. తోటివారు ఎలా ఉండాలని కోరుకుంటామో, మనమూ అలాగే ఉంటే ఆత్మబంధువులవుతారు. అవసరానికి ఆదుకుంటారు. సుఖంగా, ప్రశాంతంగా కాలం గడపవచ్చు. ఇదే ఇస్లామ్‌ సందేశం. ఇతరులను హింసించి, ఒకరి హక్కులను కొల్లగొట్టి, ఎన్ని ఆరాధనలు చేసినా అల్లాహ్‌ వద్ద చెల్లని నాణాలవుతాయి. ప్రళయదినం నాడు అవమానం, శిక్ష తప్పవని ఖురాన్‌ హెచ్చరిక. దౌర్జన్యం నరకానికి తీసుకెళుతుంది. ‘వారి దౌర్జన్యానికి ప్రతిఫలంగా పూర్వం ఎన్నో పట్టణాలను నాశనం చేశాం’ అని ఖురాన్‌ పేర్కొంది. ‘దుర్మార్గులు సాఫల్యం పొందలేరనేది వాస్తవం’ (ఖురాన్‌ 6:135) ఇతరులను హాని చేయడమంటే తన పరలోకాన్ని నాశనం చేసుకోవడమే.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు