ప్రార్థనతో ఓదార్పు

క్రీస్తు ప్రభువు తన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. ‘ప్రార్థన సమయంలో గది తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రిని స్మరింపుము’ అన్నాడు.  మన భారాలను దేవుని పాదాల ముందు ఉంచేటప్పుడు  ఆ ప్రార్థన ఏకాంతంగా చేయాలి.

Updated : 19 Aug 2021 01:46 IST

క్రీస్తు ప్రభువు తన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. ‘ప్రార్థన సమయంలో గది తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రిని స్మరింపుము’ అన్నాడు.  మన భారాలను దేవుని పాదాల ముందు ఉంచేటప్పుడు  ఆ ప్రార్థన ఏకాంతంగా చేయాలి. చుట్టూ ఉన్న ప్రాపంచిక విషయాలు మన ప్రార్థనను భంగపరచకుండా ఒక తాదాత్మ్యంతో, మనసును దేవునిముందు పరచాలన్నాడు ప్రభువు. ఈ లోక సంబంధమైన ఆలోచనలు, చింతలు, ఇతరుల ప్రస్తావన మొదలైనవన్నీ గదిలోకే కాదు,  మనసు తలుపు దాటి లోనికి చొరబడనివిధంగా స్థిరచిత్తంతో ప్రార్థించమన్నాడు. అంటే ఆ సమయంలో  ఏ తలపులూ రాకూడదు.

ప్రార్థించేటప్పుడు ‘పరలోకమందున్న తండ్రీ’ అంటూ సంబోధించాలి. తండ్రి తన బిడ్డల పట్ల ఎంత జాగరూకతతో ఉంటాడు?! అదీ దేవుడు పోషించే పాత్ర. ఈ సమస్త లోకంలో తల్లిదండ్రులు మాత్రమే మనని నిర్లక్ష్యం చేయరని ఈ వాక్యంద్వారా ప్రభువు తెలియజేస్తున్నాడు. ఆయన నేర్పిన ప్రార్థనలో ‘అప్పు తీర్చనివాళ్లని మేం క్షమించినట్లు, నీవు మా రుణాలను క్షమించు’ అనే సూత్రముంది. ఈ వాక్యంలో ఆయన ఆశీర్వచనంతోపాటు, కర్తవ్యాన్ని పొందుపరిచాడు. మనకు హాని చేసినవారిని మనం క్షమించలేకపోతే, మన తప్పులను క్షమించమని దేవుని కోరే అర్హత కోల్పోతాం. మరో సందర్భంలో ‘మమ్ములను తెలియని చోటుకు నడిపించకు, దుష్టత్వం నుంచి కాపాడు’ అని ఉంటుంది. ఈ లౌకిక ప్రపంచంలో, ప్రాపంచిక జీవనంలో ప్రతి మనిషికి శోధన, అది మిగిల్చే వేదన సాధారణం. వాటినుంచి తప్పించమని ప్రార్థన. ‘శత్రువులను క్షమించాలి, దుష్టత్వం నుంచి బయటపడాలి’- అనేది సమస్త మానవాళికీ అవసరమైన మరో ప్రవచనం. వీటితో మనకెంతో ఓదార్పు కలుగుతుంది. అదే ప్రార్థనతో వచ్చే బలం. అదే దేవుడు ఇచ్చే బహుమానం. 

- అపేక్ష


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని