ఆత్మలో పదహారు కళలు

మహా జ్ఞాని అయిన పిప్పలాద మహర్షి వద్దకు అనేకులు వచ్చేవారు. సందేహాలు అడిగి, సమాధానాలు పొందేవారు. ఒకసారి భరద్వాజ మహర్షి కుమారుడైన సుకేశుడు స్నేహితులతో కలసి పిప్పలాదుడి

Updated : 19 Aug 2021 01:52 IST

హా జ్ఞాని అయిన పిప్పలాద మహర్షి వద్దకు అనేకులు వచ్చేవారు. సందేహాలు అడిగి, సమాధానాలు పొందేవారు. ఒకసారి భరద్వాజ మహర్షి కుమారుడైన సుకేశుడు స్నేహితులతో కలసి పిప్పలాదుడి వద్దకు వచ్చాడు. ‘గురుదేవా! పదహారు కళలంటే ఏవి? అవి ఎవరిలో ఉంటాయి?’ అనడిగాడు. పిప్పలాదుడు ప్రసన్నంగా చూసి...

‘విను నాయనా! సంద్రపు నీరు ఆవిరిగా మారి ఆకాశం చేరుతుంది. అక్కడ మేఘంగా మారి, చల్లగాలి సోకగానే వానగా కురుస్తుంది. ఆ వాననీరు వాగులుగా నదులుగా మారుతుంది. ఆ నదులు చివరికి సముద్రంలో కలుస్తాయి. ఇలా ఎన్నో దశలు. ఒక్కో దశను అనుసరించి ఒక్కో పేరు. అంతర్లీనంగా ఉన్నది మాత్రం నీరే! అది సముద్రంతో మొదలై మళ్లీ సముద్రం వద్దకు చేరడం సృష్టి చక్రం, అలాగే పదహారు కళలు పరమాత్మ నుంచి వెలువడి, తిరిగి పరమాత్మలోనే కలుస్తాయి. దశలను బట్టి నీళ్లకు వివిధ పేర్లున్నట్టు కళలకూ వేర్వేరు పేర్లున్నాయి. అవే- ప్రాణం, శ్రద్ధ, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, పది ఇంద్రియాలు, మనస్సు, అన్నం, బలం, తపస్సు, వేదాలు, కర్మలు, వాటి ఫలాలుగా సంప్రాప్తించే స్వర్గ లోకాలు, ప్రాణుల పేర్లు. ఈ పదహారు కళలు ‘పురుషుడు’లో ఉంటాయి. ఆ పురుషుడే ‘ఆత్మ’. దానికి ‘హిరణ్యగర్భుడు’ అని మరో పేరు. ఈతడు పదహారు కళలతో శోభిస్తూ శరీరంలో ఉంటాడు. అతడున్నంత కాలం ఆత్మ శరీరాన్ని ఓ గూడులా చేసుకుంటుంది. ఆ ఉనికి ‘నేను’ అనే అభివ్యక్తిలో ఉట్టిపడుతుంది. జ్ఞానులు ‘నేను’ అంటే శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకుంటారు. అజ్ఞానులు శరీరమే తామనుకుంటారు. పదహారు కళలతో విరాజిల్లే హిరణ్యగర్భుడు- అంటే ఆత్మ ఈ శరీరమనే గూటిని విడిచిపెట్టిన మరుక్షణం అక్కడ మిగిలేది పీనుగు తప్ప ‘నేను’ కాదు! బండి చక్రం తాలుకు ఇరుసులో ఆకులు అమరినట్లుగా ఆత్మలో ఈ పదారు కళలూ ఇమిడి ఉంటాయి’ అంటూ వివరించాడు పిప్పలాద మహర్షి.

ఇది ‘ప్రశ్నోపనిషత్తు’లోని కథ.

- ఓలేటి శ్రీనివాసభాను


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని