అసూయ - ఆశావాదం

బోధిసత్వుడు తన జన్మ పరంపరలో భాగంగా ఒక వ్యాపారుల ఇంట జన్మించాడు. ఒకరోజు బోధి 500 బండ్ల సరుకుతో పడమటి దిక్కునున్న ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

Published : 26 Aug 2021 01:05 IST

బోధిసత్వుడు తన జన్మ పరంపరలో భాగంగా ఒక వ్యాపారుల ఇంట జన్మించాడు. ఒకరోజు బోధి 500 బండ్ల సరుకుతో పడమటి దిక్కునున్న ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అది దేవదత్తుడనే మరో వర్తకుడికి తెలిసింది. ఈర్ష్యాసూయలతో అతనికంటే ముందు వెళ్లాలని 500 బండ్ల సరుకుతో బయల్దేరాడు. ఆ సంగతి విన్న బోధి ‘వెయ్యి బళ్ళు, వెయ్యిమంది మనుషులతో ఒకేసారి వెళ్తే ఎవరి వ్యాపారమూ సజావుగా సాగదు, ఇద్దరికీ నష్టమేనని ఆలోచించి ‘ముందు నువ్వు వెళ్లు’ అన్నాడు. స్వార్థలోచనుడైన దేవదత్తుడు మరోలా ఆలోచించాడు. ‘నిజమే! ఇద్దరం ఒకేసారి వెళ్తే గిరాకీ ఉండదు. సరకు ధర తగ్గించమంటారు. అందుకు భిన్నంగా నేను ముందు వెళ్తే చెప్పిన ధరకే సరకు అమ్మవచ్చు’ అనుకుని సంతోషంగా ముందు బయల్దేరాడు. బోధి తొందరపడక పోగా ‘ముందు వెళ్ళిన వారి వల్ల దారి మెత్తబడుతుంది, పశువులకు లేత పచ్చిక దొరుకుతుంది, వారి అనుభవాలు తమకు పాఠాలవుతాయి’ అనుకున్నాడు. ముందు వెళ్లిన వర్తకుడు, అతడి అనుచరులను రాక్షసులు అడ్డంగించి చంపి తినేశారు.  

దేవదత్తుడు ఎన్నాళ్లకూ తిరిగి రాకపోయేసరికి బోధి తన బండ్లతో బయల్దేరాడు. రాక్షసులు మనుష్య రూపాలు ధరించి మోసగించాలని చూశారు. భూమి పైన వారి నీడ పడకపోవడంతో బోధి అర్థం చేసుకున్నాడు. విచక్షణతో వారిని తరిమికొట్టి ముందుకు వెళ్లగా చనిపోయిన వర్తకుడు, అనుచరుల ఎముకల పోగులు, సరకు ఉన్న బళ్లు కనిపించాయి. ఆ సరకును కూడా తన బళ్లకు ఎక్కించి బోధి రెట్టింపు లాభం గడించాడు. దేవదత్తుడు అసూయతో ప్రాణాలు పోగొట్టుకుంటే ఆశావాదంతో బోధి ఊహించని లాభం పొందాడు.

- చల్లా జయదేవ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు