ఏమిటీ కుటిల తీర్పు?!

వైశాలి నగరంలో వ్యాపార కుటుంబాలు అధికం. వారిలో కోట్లకు పడగలెత్తినవారూ ఉన్నారు. ఓ సామాన్య కుటుంబంలో అంబఫలి అనే సౌందర్యవతి ఉంది.

Published : 02 Sep 2021 00:54 IST

బుద్ధం శరణం

వైశాలి నగరంలో వ్యాపార కుటుంబాలు అధికం. వారిలో కోట్లకు పడగలెత్తినవారూ ఉన్నారు. ఓ సామాన్య కుటుంబంలో అంబఫలి అనే సౌందర్యవతి ఉంది. సంపన్న యువకులెందరో ఆ అందానికి ఆకర్షితులయ్యారు. పెళ్లి చేసుకుంటామంటూ పోటీపడ్డారు. వాళ్లలో ఎవర్ని అల్లుడిగా చేసుకుందామన్నా తక్కినవారికి కోపమొస్తుంది, అసలే కోటీశ్వరులని ఆమె తండ్రి భయపడ్డాడు. ఏం చేయాలో తోచక వైశాలీ సంఘాన్ని సలహా అడిగాడు. పెద్దలు న్యాయం చేయకపోగా ‘ఇంత అందం ఏ ఒక్కరికో సొంతం కాకూడదు, అందరికీ దక్కాలి’ అంటూ కుటిల నిర్ణయం చేశారు. సంఘ ఆదేశాన్ని పాటించకుంటే బహిష్కరిస్తారని కూతుర్ని బలి చేశాడతను. అంబఫలికి జీవితం దుర్భరమైంది.

రోజులలా భారంగా గడుస్తుండగా ధర్మప్రచారంలో భాగంగా గౌతమబుద్ధుడు ఆ ఊరికి వచ్చాడు. సంఘ పెద్దలు బుద్ధునికి భక్తిశ్రద్ధలతో ఆతిథ్యమిచ్చారు. అంబఫలి ధైర్యం చేసి బుద్ధుని కలిసి తన దుస్థితి గురించి చెప్పి బాధపడింది. బుద్ధుడు తక్షణం వైశాలీ సంఘ సభ్యులను పిలిచాడు. ‘ఏ ధర్మశాస్త్రం ఆధారంగా అంబఫలికి ఇంత ఘోరశిక్ష విధించారు? ఏమిటీ కుటిల తీర్పు?!’ అని నిలదీశాడు.

వాళ్లంతా జవాబు చెప్పలేక తడబడ్డారు. గౌతముని క్షమాపణ కోరి, అంబఫలికి వెంటనే విముక్తి కల్పించారు. అంబఫలి బుద్ధునికి కృతజ్ఞతలు తెలియజేసి ఆ క్షణమే భిక్షుకిగా మారింది.

- పారుపల్లి వెంకటేశ్వర రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని