హోమఫలితం దక్కాలంటే...

పూర్వం ఒకరోజు ఆరుగురు వేదపండితులు సమావేశమయ్యారు. ‘మన ఆత్మ ఎవరు? ఏది పరబ్రహ్మం?’ అంటూ చర్చ మొదలుపెట్టారు. ఎంతకీ సమాధానం లభించలేదు.

Published : 02 Sep 2021 00:54 IST

ఉపనిషత్‌ కథ

పూర్వం ఒకరోజు ఆరుగురు వేదపండితులు సమావేశమయ్యారు. ‘మన ఆత్మ ఎవరు? ఏది పరబ్రహ్మం?’ అంటూ చర్చ మొదలుపెట్టారు. ఎంతకీ సమాధానం లభించలేదు. అప్పుడు వారంతా కలసి ఉద్దాలక మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఆయన కూడా తనకు సంపూర్ణంగా తెలియదన్నాడు. ‘వైశ్వానర ఉపాసన విద్య’ (జఠరాగ్ని రూపంలో ఉండే పరమాత్మను ఉపాసించే పద్ధతి) తెలిసిన కేకయ రాజకుమారుడైన అశ్వపతి వద్దకు తీసుకువెళ్లాడు. అశ్వపతి వారిని స్వాగతించి సత్కరించాడు. విషయం విని, వారి ఉపాసన పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నాడు.

ఒకాయన దేవతా లోకాన్ని, రెండో వేదవేత్త సూర్యభగవానుణ్ని, మూడో పండితుడు వాయుదేవుణ్ని, నాలుగో విద్వాంసుడు ఆకాశాన్ని, ఐదో సాధకుడు జలదేవతను, చివరిగా ఉద్దాలక మహర్షి భూమిని పరమాత్మ స్వరూపంగా భావిస్తున్నామని చెప్పారు. అశ్వపతి అందరి మాటలూ విన్నాడు. ఆయా పద్ధతులవల్ల వారెలాంటి ప్రయోజనాలు పొందుతున్నారో చెప్పాడు. అదే సమయంలో అవి సమగ్ర ఉపాసనా మార్గాలు ఎందుకు కావో విశ్లేషించాడు. అంతేకాదు అసంపూర్ణ పద్ధతుల్ని అనుసరించటంవల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయంటూ స్పష్టంచేశాడు. అది విన్న ఆరుగురూ సకాలంలో తాము అశ్వపతి వద్దకు వచ్చామని అనుకున్నారు. అశ్వపతి ఇలా అన్నాడు-

‘జ్ఞానులారా పరమాత్మతత్త్వం అనంతం. ఆ వైశ్వానరుడి శిరస్సు స్వర్గలోకం, ఆయన కంటిచూపే సూర్యుడు, ప్రాణశక్తే వాయువు, శరీర మధ్యభాగం ఆకాశం లేదా అంతరిక్షం. మూత్రాశయం జలం, పాదాలు భూమండలం. అలా అంతటా, అన్నిటా నెలకొన్న పరమాత్మను ఏదో ఒక అంశానికే పరిమితం చేసి, ఆ ఒక్క కోణంలోనే ఉపాసించడం అసమగ్రమౌతుంది. సకల లోకాల్లో, సర్వ భూతాల్లో పరివ్యాప్తమై, అనాదిగా, నిరవధికంగా ప్రకాశించే పరమాత్మని ఉపాసించడమే సంపూర్ణ ఉపాసనా విధానం. ఈ పద్ధతిని అనుసరించేవారు సమస్తాన్నీ అన్నంగా, స్వానుభూతిగా, స్వస్వరూపంగా ఆస్వాదిస్తారు. ప్రాణ, వ్యాన, అపాన, సమాన, ఉదాన- అనే పంచ ప్రాణాల రూపంలో వర్ధిల్లే వైశ్వానరుడికి అన్నాన్ని ఆహుతిగా సమర్పిస్తారు. ‘సమగ్రం, సంపూర్ణం అయిన ఆ వైశ్వానర ఆత్మను నేనే’ అని అనుభూతి చెందుతూ చేసే ఉపాసన వల్ల అన్ని జీవులకు, ఆత్మలకు ఆహుతులు సమర్పితమై, హోమ ఫలితం చేకూరుతుంది. ఆకలి వేసినప్పుడు అమ్మకోసం ఎదురుచూసే పిల్లల్లాగా సాధకులు దీన్ని అనుసరించాలి’ ఆ వివరణతో ఉద్దాలకుడితోపాటు మిగిలినవారూ సందేహ నివృత్తి పొందారు. కేకయ రాకుమారుడి వద్ద సెలవు తీసుకుని సంతృప్తిగా, సంతోషంగా వెళ్లిపోయారు. ఇది ఛాందోగ్య ఉపనిషత్తులోని కథ.

- తేజస్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని