ఆరావళీ పర్వతాల్లో కొలువైన శాకంబరీదేవి

ఇసుక తివాచీల రాష్ట్రంలో రాజస్థానీయుల ఇలవేల్పు శాకంబరీ మాత. ఉత్తరభారతానికి అలంకారం ఆరావళీ పర్వతశ్రేణులు. అక్కడే సీకర్‌ జిల్లా ఉదయపురవాటీకి....

Published : 02 Sep 2021 00:54 IST

దర్శనీయం

ఇసుక తివాచీల రాష్ట్రంలో రాజస్థానీయుల ఇలవేల్పు శాకంబరీ మాత. ఉత్తరభారతానికి అలంకారం ఆరావళీ పర్వతశ్రేణులు. అక్కడే సీకర్‌ జిల్లా ఉదయపురవాటీకి దగ్గర్లో సకరాయ్‌ ధామ్‌లో ఉన్న శాకంబరీ మాత ఆలయం ఆషాఢ, శ్రావణాల్లో ఉత్సవాలతో కళకళలాడుతుంది. రాజస్థాన్‌లో పుష్కర్‌ మేళా తర్వాత అంత విశిష్టత శాకంబరీమాత మేళాకే ఉంది.

న తెలుగుప్రాంతాల్లో వాసవీ కన్యకాపరమేశ్వరిలా ఈ శాకంబరీ మాత ఉత్తర భారత వ్యాపార వాణిజ్య సామాజిక వర్గాల ఇలవేల్పుగా పూజలందుకుంటోంది. ఇదెంతో పురాతన దేవాలయం. రాజస్థానీ సంప్రదాయ వాస్తునిర్మాణ శైలిలో అక్కడ ప్రసిద్ధి చెందిన మకరానా శిలలతో నిర్మితమైంది. విమాన శిఖరం సమున్నతంగా నిటారుగా స్థూపాకారంలో ఉంటుంది. ప్రవేశద్వారం లతలతో. వారి సంప్రదాయ రంగులతో ఆకర్షణీయంగా ఉంటుంది.

ఎందరో మంత్రులు ప్రమాణస్వీకారానికి ముందు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. దేవి ఆశీస్సులతో ఆటంకాలను అధిగమించవచ్చని నమ్ముతారు. గర్భాలయంలో రజత స్థలిపై సింధూరవర్ణంలో అలరించే రుద్రాణి, బ్రాహ్మణి దేవతలను సకరాయ్‌ మాతలుగా ఆరాధిస్తారు. రుద్రాణి కాళీమాత స్వరూపం, బ్రాహ్మణి జగన్మాత రూపాల్లో విలక్షణమైన శాకంబరీ స్వరూపం. త్రిశక్తి రూపిణిగా అవతరంచిన మహిషాసురమర్దిని. షోడశాక్షర మంత్రానికి అధిష్టాన దేవతగా, శ్రీచక్ర పీఠ నిలయగా, ఏకాదశ శక్తుల సంగ్రహ రూపంగా, అపరాజితగా, మహిషాసుర మర్దినిగా ప్రకటితమైందని దేవీభాగవతం వెల్లడిస్తోంది. అమ్మవార్ల మందిరం పక్కనే ప్రత్యేక స్థూపాకార మంటపంలో ఏకముఖ జటాశంకరలింగం ఉంది. ఇది అరుదైన శివలింగం.

నాథ్‌ సంప్రదాయపు సాధువులు ఈ ఆలయ పూజారులుగా ఉంటారు. ఈ ఆలయంలో మరో విశిష్ట క్రతువు ఏంటంటే రజస్వలా పూర్వ బాలికలను సువాసినిలుగా భావించి అమ్మవారి ప్రతినిధిగా అర్చించడం.

భక్తులంతా ప్రధాన మూలవిరాట్టు దర్శనం కోసం ఎదురుచూసే ముఖమంటపం అందమైన ఆకృతిలో గాజుపలకల తాపడంతో అలరిస్తుంది. ఆలయ సందర్శకులు ఆరావళీపర్వత అందాలు, లోయలు, సెలయేర్లు, జలపాతాలు, సకరాయ్‌ డామ్‌ వంటి మనోహర ప్రదేశాలను కూడా చూసిరావచ్చు. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ నుంచి చోమూ, రీంగస్‌, రానోలీల మీదుగా ఈ సికర్‌లోని సకరాయ్‌ ప్రాంత శాకంబరీ ఆలయానికి చేరుకుంటారు.

- ఉదయ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని