నిజమైన గురువు

శిష్యుల ప్రతిభను, అర్హతలను కచ్చితంగా అంచనావేసి, ఎప్పుడు, ఎవరికి, వేటిని ప్రసాదించాలో తెలిసినవారే నిజమైన గురువులు. గౌతమ మహర్షికి విశేష సేవలు చేసి,...

Published : 09 Sep 2021 00:20 IST

ఉపనిషత్‌ కథ

శిష్యుల ప్రతిభను, అర్హతలను కచ్చితంగా అంచనావేసి, ఎప్పుడు, ఎవరికి, వేటిని ప్రసాదించాలో తెలిసినవారే నిజమైన గురువులు. గౌతమ మహర్షికి విశేష సేవలు చేసి, బ్రహ్మజ్ఞానాన్ని పొందిన సత్యకామ జాబాలి గొప్ప రుషిగా పేరు పొందాడు. గురు స్థానానికి చేరుకున్నాడు. అనంతరం సత్యకాముడి ఆశ్రమానికి విద్యలు నేర్చుకునేందుకు శిష్యులు వచ్చేవారు. పన్నెండేళ్లపాటు సేవ చేసి, బ్రహ్మోపదేశాన్ని పొందేవారు. ఉత్తీర్ణ్ణులైన శిష్యులు గురువుగారి అనుమతితో పెళ్లి చేసుకుని, అర్హతకు తగిన ఉపాధిని ఎంచుకుని, ధర్మ మార్గంలో జీవనం సాగించేవారు.

అలా వచ్చినవాడే ఉపకోశలుడు. అబ్బాయి ఎంతో తెలివైనవాడు. క్రమం తప్పకుండా గురువునీ, అగ్నినీ సేవిస్తూ, అన్ని విద్యలూ నేర్చుకున్నాడు. పన్నెండేళ్లు పూర్తయ్యాయి. బ్రహ్మోపదేశాన్ని పొందే దశకు చేరుకున్నాడు. సత్యకాముడు మాత్రం శిష్యుడికి ఉత్తీర్ణతను ప్రసాదించలేదు. ఉపకోశలుణ్ని అనుగ్రహించమని గురుపత్ని కోరింది. కానీ ఆమెకి గురువు సమాధానమివ్వలేదు. అగ్నిని సేవించమని శిష్యుణ్ని ఆదేశించి, ఏదో పని మీద కొన్నాళ్ల పాటు బయటకు వెళ్లాడు.

మిగిలిన శిష్యులకు ఉత్తీర్ణతను అనుగ్రహించి గురువు తనను విస్మరించాడని ఉపకోశలుడు కలత చెందాడు. గురుపత్ని బతిమాలుతున్నా ఆహారం తీసుకోకుండా శరీరాన్ని శుష్కింపచేస్తూ అగ్నిని సేవించసాగాడు. అతడి దీక్షకు మెచ్చి, ‘గార్హపత్యం’, ‘దక్షిణాగ్ని’, ‘ఆహవనీయం’- అనే మూడు రకాల అగ్నులు ఉపకోశలుడికి బ్రహ్మవిద్యను ఉపదేశించాయి. ప్రాణం బ్రహ్మస్వరూపమని చెప్పాయి. అది హృదయంలో చేరినప్పుడు కలిగే ఆనందం, ఆ ఆనందానికి ఆలంబనగా నిలిచే ఆకాశం కూడా బ్రహ్మ స్వరూపాలేనని వివరించాయి. శాశ్వతమైన ఆనందానికి నెలవైన హృదయాకాశాన్ని బ్రహ్మస్వరూపంగా ధ్యానించే ఉపాసన మార్గాన్ని అనుసరించమని బోధించాయి. అందులో భాగంగా భూమి, అగ్ని, అన్నం సూర్యుడు తన శరీరాలని చెప్పి తనను ఉపాసించే విధానాన్ని గార్హపత్య అగ్ని వెల్లడించింది. నీరు, దిశలు, చుక్కలు, చంద్రుడు తన అవయవాలని వాటిని ఎలా ఉపాసించాలో దక్షిణాగ్ని బోధపరచింది. ప్రాణం, ఆకాశం, స్వర్గం, విద్యుత్తు తన శరీర భాగాలని ఎరుకపరచిన ఆహవనీయాగ్ని తనను ఆరాధించే విధానాన్ని వివరించింది. అలా మూడు అగ్నుల నుంచి పొందిన బ్రహ్మజ్ఞానంతో ఉపకోశలుడు బ్రహ్మ తేజస్సును సంతరించుకున్నాడు.

ఆశ్రమానికి తిరిగి వచ్చిన సత్యకామ జాబాలి జరిగిన సంగతి తెలుసుకున్నాడు. తామరాకు మీద నీటిబొట్టులాగా జీవిస్తూ, బ్రహ్మమార్గం ద్వారా ప్రయాణించి, మరోజన్మంటూ లేని సత్యలోకాన్ని పొందే అంతిమ ఉపాసనను ఉపకోశలుడికి తెలియజేసి, పరిపూర్ణ సాధకుడిగా తీర్చిదిద్దాడు. గురువుగారు తనకు ఉత్తీర్ణత ప్రసాదించడాన్ని ఎందుకు ఆలస్యం చేశారో అర్థమైన ఉపకోశలుడు ఆయన చరణాలకు నమస్కరించాడు. ఇది ఛాందోగ్య ఉపనిషత్తులోని కథ.

- తేజస్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు