సంకల్పం - స్థిరత్వం

ఒకసారి బెంగాల్లో అనావృష్టి ఏర్పడింది. వర్షాలు లేక పంటభూములు ఎండిపోతున్నాయి. చేసేదేముందని చాలామంది నిరాశపడుతూ ఇంటిపట్టునే ఉండిపోయారు.

Published : 09 Sep 2021 00:20 IST

గురుబోధ

కసారి బెంగాల్లో అనావృష్టి ఏర్పడింది. వర్షాలు లేక పంటభూములు ఎండిపోతున్నాయి. చేసేదేముందని చాలామంది నిరాశపడుతూ ఇంటిపట్టునే ఉండిపోయారు. లక్ష్మణ అనే రైతు మాత్రం ఎలాగైనా తన పొలాన్ని రక్షించుకోవాలనుకున్నాడు. పలుగు, పార పట్టి కొన్ని మైళ్ల దూరానున్న ఏటి నుంచి పొలం వరకూ కాలువ తవ్వడం ప్రారంభించాడు. అతని ప్రయత్నం చూసి కొండకు దారం కట్టి లాగుతున్న చందంగా ఉందంటూ చాలామంది ఎగతాళి చేశారు. ఈశ్వర అనే మరో రైతు మాత్రం తను కూడా కాలువ తవ్వుదామని బయల్దేరాడు.

లక్ష్మణ అలుపెరుగక కాలువ తవ్వుతున్నాడు. ఎంతకూ ఇంటికి రాని తండ్రిని వెతుక్కుంటూ కూతురు వచ్చి స్నానం చేసి భోజనం చేసేందుకు రమ్మని పిలిచింది. మరి కొంత తవ్వాక వస్తానన్నాడు. ఇంకో గంట చూసి భార్య వచ్చింది. ‘నీరు లేక పైరు ఎండిపోతోంది’ అని బాధపడుతూ ఇంటికెళ్లాడు. గబగబా స్నానం, భోజనం కానిచ్చి వెంటనే బయల్దేరాడు. అతని తపన చూసి భార్య, కూతురు కూడా కాలువ తవ్వకంలో సాయం చేశారు. నాలుగురోజులు ముగ్గురూ కష్టపడగా కాలువ పూర్తయి అతని పొలంలోకి నీరు పారింది. రైతు ఆనందానికి అవధుల్లేవు. ఈశ్వర తత్వం భిన్నంగా ఉంది. తవ్వకం మొదలుపెట్టిన కాసేపటికే అలసట కలిగింది. కాసేపటికోసారి విశ్రాంతి తీసుకుంటూ, నిరాశపడుతూ, చిరాకుచెందుతూ ఇక తనవల్ల కాదని ఆపేశాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులకు ఈ ఉదాహరణ చెప్పి ‘నిరాశా నిస్పృహలతో ఒరిగేదేమీ ఉండదు. ఆశయసాధనకు దృఢ సంకల్పం తోడయితే దేన్నయినా సాధించవచ్చు. అది సాధారణ పని కావచ్చు, భగవత్‌ సాక్షాత్కారానికి చేసే సాధన కావచ్చు’ అన్నారు.

- వింజనంపాటి రాఘవరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని