రైతు భక్తి

సదా హరినామాన్ని జపించే నారదుడు తనదే అపూర్వ భక్తి అనుకున్నాడు. తనంతటి భక్తుడు మరెవరూ ఉండరనిపించి, వెంటనే వైకుంఠానికి వెళ్లి, విష్ణుమూర్తితో అదే అన్నాడు. అందుకు విష్ణుమూర్తి సమాధానం

Published : 16 Sep 2021 01:01 IST

సదా హరినామాన్ని జపించే నారదుడు తనదే అపూర్వ భక్తి అనుకున్నాడు. తనంతటి భక్తుడు మరెవరూ ఉండరనిపించి, వెంటనే వైకుంఠానికి వెళ్లి, విష్ణుమూర్తితో అదే అన్నాడు. అందుకు విష్ణుమూర్తి సమాధానం ఇవ్వలేదు సరికదా, చిరునవ్వు నవ్వి, భూలోకంలోని ఒక చిన్న పల్లెలో హరిదాసు అనే రైతు ఇంటికెళ్లి, అతని ఒకరోజు దినచర్యను గమనించి రమ్మన్నాడు.

నారదుడు ఆ పల్లెకు చేరి, హరిదాసును గమనించసాగాడు. అతడు పొద్దున్నే లేచి, ‘నారాయణా, ఆపద్భాంధవా’ అని ఒకసారి హరిని స్మరించి, తన పనిలో దిగాడు. పశువుల పాక శుభ్రం చేసి, ఇతర పనులన్నీ చక్కబెట్టుకుని, నాగలితో పొలం వెళ్లాడు. రోజంతా పనిచేసి సాయంత్రానికి ఇంటికి చేరాడు. స్నానం, భోజనం అయ్యాక పడుకునే ముందు మరోసారి దేవుని ప్రార్థించి పడుకున్నాడు.

భక్తుని చిహ్నాలేవీ లేని, కేవలం రెండుసార్లు హరినామం జపించే ఈ మొరటు రైతుని మహావిష్ణువు ఎందుకు చూసి రమ్మన్నాడో నారదునికి అర్థం కాలేదు. వైకుంఠం చేరి తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. విష్ణువు తల పంకించాడు. నిండుగా నెయ్యి నింపిన పాత్రనిచ్చి, అది తొణకకుండా వైకుంఠం చుట్టి రమ్మన్నాడు.

నారదుడు ఆ పాత్రను తీసుకుని, అతి జాగ్రత్తగా, నింపాదిగా నడుస్తూ, చాలాసేపటి తర్వాత శ్రీహరి సన్నిధికి చేరి, ‘ఒక్క చుక్క కూడా జారకుండా తెచ్చాను ప్రభూ’ అన్నాడు.

విష్ణువు నవ్వుతూ తల పంకించి, ‘నారదా! వైకుంఠం చుట్టివచ్చిన సమయంలో ఎన్నిసార్లు నా నామస్మరణ చేశావు?’ అనడిగాడు.

‘ఒక్కసారి కూడా స్మరించలేదు. నా ధ్యాసంతా నెయ్యి తొణకకుండా చూడటంపైనే ఉండిపోయింది ప్రభూ’ అన్నాడు నారదుడు.

శ్రీహరి నవ్వి ‘నిరంతరం నా నామస్మరణ చేసే నువ్వు కొద్దిసేపు నెయ్యి ఒలికిపోకుండా చూసే పనిలో ఉన్న మాత్రానికి తల్చుకోవడమే మర్చిపోయావు! అలాంటిది సాగరం వంటి సంసారాన్ని ఈదుతూ కూడా రోజులో రెండుసార్లు నా నామస్మరణ చేస్తున్న హరిదాసు ఎంత గొప్పవాడో నువ్వే ఆలోచించు!’ అన్నాడు.

అంతే కదా! పనిలో నిమగ్నమైనపుడు, పనే దైవం, పనే నామస్మరణ.

- రమా మాధవరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు