మూడు లాంతర్ల సెంటరే దేవీచౌక్‌

రాజమహేంద్రవరం దేవీచౌక్‌లోని బాలాత్రిపుర సుందరీదేవి విద్యాప్రదాతగా, ఆకలి తీర్చే అన్నపూర్ణగా, దుష్టులను శిక్షించే దుర్గామాతగా, మహిషాసురమర్దనిగా సాక్షాత్కరిస్తుంది. పవిత్ర గోదావరి తీరాన ఈ గుడికి

Updated : 07 Oct 2021 05:09 IST

రాజమహేంద్రవరం దేవీచౌక్‌లోని బాలాత్రిపుర సుందరీదేవి విద్యాప్రదాతగా, ఆకలి తీర్చే అన్నపూర్ణగా, దుష్టులను శిక్షించే దుర్గామాతగా, మహిషాసురమర్దనిగా సాక్షాత్కరిస్తుంది. పవిత్ర గోదావరి తీరాన ఈ గుడికి దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలి వస్తారు. శరన్నవరాత్రులప్పుడు అమ్మవారి అలంకరణ ప్రత్యేకంగా ఉంటుంది. ఉత్సవమూర్తిని తిథుల ప్రకారం అలంకరిస్తారు. ముందురోజు రాత్రి అమ్మవారిని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. దసరా పదిరోజులు ఇక్కడి సందడి చూసి తీరాల్సిందే. కనుల పండుగ్గా ఉండే అమ్మ దర్శనంతోబాటు పందిరిలో భక్తి గీతాలు, నృత్యాలు, కోలాటం, భజనలు ఉంటాయి. పసిపిల్లలను సైతం తెచ్చి అమ్మవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకుంటారు.

కోల్‌కతా ప్రేరణతో కట్టిన గుడి

నగరానికి చెందిన కామరాజు, మునియ్య సోదరులు వ్యాపారరీత్యా కోల్‌కతాకు వెళ్లేవారు. అక్కడ కాళీమాత పూజలు చూసి, గోదావరి తీరంలోను పూజలు ఇంత ఘనంగా జరగాలనుకున్నారు. 1960లో అక్కడి నుంచి దేవి విగ్రహాన్ని తీసుకొచ్చి చిన్న గుడి కట్టారు. 1962లో శాశ్వత ఆలయాన్ని నిర్మించారు. అప్పటివరకు ఈ ప్రాంతాన్ని మూడులాంతర్ల సెంటర్‌గా పిలిచేవారు. ఆలయం వచ్చాక దేవీచౌక్‌గా మారింది.

నాటకాలకు ప్రోత్సాహం

అప్పట్లో నాటకరంగానికి ఆదరణ ఉండటంతో ఉత్సవాలను పురస్కరించుకుని పౌరాణిక, సాంఘిక నాటకాలను ప్రదర్శించేవారు. ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఈ వేదికపై ప్రఖ్యాత కళాకారులెందరో తమ ప్రతిభను ప్రదర్శించారట. గాన గాంధర్వుడు బాలూ కూడా దేవీచౌక్‌ ఉత్సవాల్లో కచేరీ చేశారు. గత ఏడాది కరోనా కారణంగా అమ్మవారి ఉత్సవమూర్తిని నెలకొల్పి దసరా ఉత్సవాలు జరిపారు. పరిస్థితులు పూర్తిగా చక్కబడనందున ఈ ఏడాది కూడా అలాగే ఉత్సవాలు నిర్వహించనున్నారు.

- యడ్లపల్లి సూర్యకుమారి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని