మొత్తం తనకే  కావాలనుకుంటే...

గురుశిష్యులిద్దరూ ప్రయాణిస్తున్నారు. దారిలో ఆకలేయడంతో గురువు ‘‘నీ దగ్గరెంత డబ్బుంది?’ అన్నారు. శిష్యుడు రెండు దిర్హమ్‌లు(రూపాయిలు) ఉందన్నాడు. గురువు తన దగ్గరున్న నాణెం తీసిచ్చి రొట్టెలు

Updated : 07 Oct 2021 05:03 IST

గురుశిష్యులిద్దరూ ప్రయాణిస్తున్నారు. దారిలో ఆకలేయడంతో గురువు ‘‘నీ దగ్గరెంత డబ్బుంది?’ అన్నారు. శిష్యుడు రెండు దిర్హమ్‌లు(రూపాయిలు) ఉందన్నాడు. గురువు తన దగ్గరున్న నాణెం తీసిచ్చి రొట్టెలు తెమ్మన్నారు. దానితో వచ్చిన మూడు రొట్టెలూ తీసికెళ్తే చెరిసగం తినాల్సి వస్తుంది అనుకున్నాడు శిష్యుడు. ఒక నాణెం తనదే ఎక్కువుంది కనుక మూడింటిలో ఒకటి తినేసి రెండే వచ్చాయని చెప్పాడు. ఇద్దరూ చెరోరొట్టె తిని పయనం సాగించారు. దారిలో పెద్ద వాగు రావడంతో శిష్యుడు భయంగా ‘ఈ వాగునెలా దాటాలి గురువుగారూ?’ అన్నాడు. దానికాయన ‘భయమెందుకు? నా చేయిపట్టుకుని వెంట నడువు’ అని ధైర్యం చెప్పారు. ఇద్దరూ సురక్షితంగా వాగు దాటారు. శిష్యుడు ‘ఇంతపెద్ద వాగును క్షణాల్లో దాటించారు. మీరెంతో గొప్ప! మీపై నాకు మరింత గౌరవం పెరిగింది’ అన్నాడు. అప్పుడు గురువుగారు ‘మూడు దిర్హమ్‌లకు ఎన్ని రొట్టెలొచ్చాయో చెప్పు’ అనడగ్గా రెండే అన్నాడు. గురువు మౌనంగా నడిచారు. దారిలో జింకలు కనిపించగా కోసి వండుకు తిన్నారు. తర్వాత గురువు జింక చర్మంపై కొట్టగా అల్లాహ్‌ ఆజ్ఞతో జింక లేచి ఎగరసాగింది. శిష్యుడు ఆశ్చర్యపోయి ‘మీలాంటి గురువు దొరకడం నా అదృష్టం’ అన్నాడు. ‘అయితే దీనివల్ల నీ నమ్మకం బలపడిందా?’ అన్నారాయన. దానికి శిష్యుడు ‘అవును గురువు గారూ! నిజంగానే విశ్వాసం రెట్టింపయింది’ అన్నాడు. ‘ఆరోజు ఎన్ని రొట్టెలొచ్చాయో చెప్పు’ మళ్లీ ప్రశ్నించినా శిష్యుడు రెండే రొట్టెలన్నాడు. ఇద్దరూ వెళ్తుండగా ఓ పర్వతం దగ్గర మూడు బంగారు ఇటుకలు కనిపించాయి. వాటిని చేతిలోకి తీసుకుని ‘ఇందులో ఒకటి నీకు, ఒకటి నాకు. మూడోనాణెం మూడో రొట్టె తిన్న వారికిచ్చేద్దాం’ అన్నారాయన. శిష్యుడు సిగ్గుతో తలవంచుకుని ‘ఆ మూడో రొట్టె నేనే తిన్నాను’ అన్నాడు. ‘ఈ మూడు ఇటుకలూ నువ్వే తీసుకో’ అని చెప్పి గురువు వెళ్లిపోయారు. ఇంతలో ముగ్గురు దొంగలు వచ్చి శిష్యుడ్ని చంపేసి ఇటుకలు తీసుకున్నారు. వారికి ఆకలేయడంతో ఒకణ్ని రొట్టెలు తెమ్మన్నారు. దొంగ మూడు రొట్టెలు తీసుకున్నాడు. వాటిల్లో విషం కలిపి ఆ ఇద్దరికీ పెడితే మూడు ఇటుకలూ తనకే దక్కుతాయనుకున్నాడు. రొట్టెలకోసం వెళ్లినవాణ్ని చంపితే తాము చెరిసగం పంచుకోవచ్చనుకున్నారు తక్కిన ఇద్దరూ. మూడో దొంగ విషం కలిపిన రొట్టెలు చెరొకటి ఇచ్చాడు. వాళ్లతన్ని చంపేసి రొట్టెలు తిని, విష ప్రభావంతో చనిపోయారు. గురువుగారు తిరుగు ప్రయాణంలో బంగారు ఇటుకల వద్ద మృతదేహాలను చూసి ‘మొత్తం తనకే కావాలనుకునేవాళ్లు ఒట్టిచేతులతోనే వెళ్తారు’ అనుకున్నారు.

- ముహమ్మద్‌ ముజాహిద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని