సంకల్పబలం అమోఘం

దేవుడికి ప్రజలంతా బిడ్డలే. పిల్లలకు తల్లిదండ్రులు అడిగిందల్లా ప్రేమగా కొనిచ్చినట్టు దేవుడు కూడా భక్తులడిగిన కోరికలు తీరుస్తూనే ఉంటాడు. కానీ అడిగేది మంచిదైతే వారికి మంచి జరుగుతుంది. లేదంటే నష్టపోయేది భక్తుడే. ఆ అడగటాన్నే పెద్దలు

Updated : 14 Oct 2021 05:40 IST

దేవుడికి ప్రజలంతా బిడ్డలే. పిల్లలకు తల్లిదండ్రులు అడిగిందల్లా ప్రేమగా కొనిచ్చినట్టు దేవుడు కూడా భక్తులడిగిన కోరికలు తీరుస్తూనే ఉంటాడు. కానీ అడిగేది మంచిదైతే వారికి మంచి జరుగుతుంది. లేదంటే నష్టపోయేది భక్తుడే. ఆ అడగటాన్నే పెద్దలు చిత్తశుద్ధి లేదా సంకల్పశుద్ధి అన్నారు. సంకల్పశుద్ధి లేనప్పుడు వచ్చే ప్రమాదాన్ని రామకృష్ణ పరమహంస ఓ కథగా చెప్పారు.

ఒకసారి ఓ బాటసారి ఎండలో నడుచుకుంటూ పొరుగూరికి వెళ్తున్నాడు. చాలా దూరం నడిచాడు. కానీ చేరాల్సిన ఊరు ఇంకా ఎంతో దూరమున్నట్టనిపించింది. ఎండకు అలసటగా ఉంది. ఇంతలో ఒక చెట్టు కనిపించగా ఆయాసపడుతూ వెళ్లి నీడలో నిల్చున్నాడు. బాగా అలసి ఉండటం వల్ల, విపరీతంగా దాహం వేసింది. ఎక్కడైనా నీళ్లు కనిపిస్తే బాగుండునని చుట్టూ చూశాడు. ఆశ్చర్యం! అప్పటివరకూ అక్కడ లేని నీళ్లపాత్ర అక్కడ ప్రత్యక్షమైంది. నీళ్లు తాగగానే అతడికి ఆకలేసి అన్నం తినాలనే కోరిక కలిగింది. అనుకున్నదే తడవుగా రకరకాల పిండివంటలతో రుచికరమైన భోజనం ఎదురుగా కనిపించింది. కడుపు నిండా తినేసరికి, కాసేపు విశ్రాంతి తీసుకోవాలనిపించి ‘మెత్తని పడక ఉంటే బాగుండును’ అనుకున్నాడో లేదో కళ్ల ముందు మెత్తటి పరుపు కనిపించింది. దాని మీద అటూ ఇటూ దొర్లుతూ ‘నేనేది కోరుకుంటే అది కళ్లముందు ప్రత్యక్షమవుతోంది. ఇదంతా చాలా వింతగా ఉందే’ అనుకున్నాడు. మరికాసేపటికి చీకటి పడుతూండటంతో భయమేసింది. ఇలాంటప్పుడు ఒకవేళ పులేదైనా వచ్చి నన్ను గానీ చంపేస్తే ఇంకేమైనా ఉందా?!’ అనుకున్నాడు. అంతే.. ఆ క్షణమే ఎక్కడినుంచో ఓ పెద్దపులి గాండ్రిస్తూ వచ్చి అతడి మీదపడి చంపి తినేసింది.

బాటసారి తనకు అత్యవసరమైనవి కోరుకున్నాడు, ఆ కోరికలు తీరాయి. అంతటితో ఆగివుంటే బాగుండేది. కానీ చిత్తశుద్ధి లోపించడం, సంకల్పబలానికి ఎంత శక్తి ఉందో తెలియకపోవటం వల్ల అసలుకే మోసం వచ్చింది.

- వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు