తల్లి పాదాల కింద స్వర్గం

హజ్రత్‌ షర్ఫుద్దీన్‌ ధార్మిక భావాలున్న యువకుడు. తల్లిదండ్రుల సేవ చేయడంలో తనకి తానే సాటి. ఒకసారి అతని తల్లికి జబ్బుచేసింది. మూలుగుతూ ‘నాయనా దాహమేస్తోంది, కాసిని నీళ్లివ్వు’ అనడిగింది.

Updated : 21 Oct 2021 05:23 IST

హజ్రత్‌ షర్ఫుద్దీన్‌ ధార్మిక భావాలున్న యువకుడు. తల్లిదండ్రుల సేవ చేయడంలో తనకి తానే సాటి. ఒకసారి అతని తల్లికి జబ్బుచేసింది. మూలుగుతూ ‘నాయనా దాహమేస్తోంది, కాసిని నీళ్లివ్వు’ అనడిగింది. తల్లి దాహం తీర్చేందుకు కడవ తీసుకొని పరిగెత్తి వెళ్లి నీళ్లతో తల్లి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈలోగా ఆవిడ నిద్రలోకి జారుకుంది. ‘అమ్మను నిద్ర నుంచి మేల్కొలిపితే నిద్రా భంగమవుతుంది. లేపకపోతే దాహం తీరదు.. తల్లి కోరిక తీర్చని వాడినవుతాను’ అని ఆలోచిస్తూ నీళ్లగ్లాసు చేతిలో పట్టుకొని తల్లి దగ్గరే నిల్చుండిపోయాడు. తన తల్లి ఏ క్షణంలో మేల్కొని నీళ్లు అడుగుతుందోనని ఎదురు చూస్తున్నాడు. ఎన్నో గంటల పాటు అలానే నిల్చున్నాడు. బాగా పొద్దుపోయాక తల్లి నిద్ర నుంచి మేల్కొని కళ్లు తెరిచి చూసేసరికి నీళ్ల గ్లాసుతో కొడుకు నిలబడి ఉన్నాడు. ‘అప్పటి నుంచి నువ్వలా నిల్చునే ఉన్నావా నాయనా?’ అంది తల్లి ఎంతో మురిసిపోతూ. ‘అవునమ్మా నీకు మెలకువ రాగానే నీళ్లిద్దామని ఇక్కడే నిల్చండిపోయా’ అన్నాడతను. ఆ సేవానిరతికి తల్లి ఎంతగానో ముచ్చటపడింది. కొడుకును ఆశీర్వదించింది. ఒకసారి ముహమ్మద్‌ ప్రవక్త (సఅసం) తన సహచరులతో ఏదో పనిలో నిమగ్నమై ఉండగా ఒక మహిళ అక్కడికి వచ్చింది. వెంటనే ప్రవక్త (స) లేచి నిలబడి తన భుజంపై ఉన్న దుప్పటిని తీసి పరిచి ఆమెని కూర్చోబెట్టారు. గౌరవ భావంతో మాట్లాడారు. అక్కడున్న ఓ వ్యక్తి ఆమె ఎవరని అడగ్గా, ప్రవక్తకు చిన్నతనంలో దాయీ హలీమా పాలుపట్టి పెద్దచేశారు. అలా పాలుపట్టింది ఈమే. కనుకనే చూడగానే లేచి నిలబడి, తన భుజంపై వస్త్రాన్ని తీసి పరిచి కూర్చోబెట్టారు అంటూ చెప్పారు. అదెంతో ఆదర్శనీయం.

ఒకసారి ప్రవక్త (స) వద్దకు ఓ అనుచరుడు వచ్చి ‘వృద్ధాప్యంతో నడవలేక మంచానికే పరిమితమైన మా అమ్మను నా భుజాలపై కూర్చోబెట్టుకుని హజ్‌ యాత్ర చేశాను. మా అమ్మ రుణాన్ని తీర్చుకున్నట్లేనా?’ అనడిగాడు. దానికి ప్రవక్త ‘ఆమె ప్రసవ సమయంలో బాధ భరించలేక పెట్టిన ఒక కేక రుణం కూడా తీరలేదు’ అంటూ జవాబిచ్చారు.

ఈ సంఘటనలతో తల్లి స్థానం ఎంత గొప్పదో బోధపడుతుంది. పురుటి నొప్పులు భరించి, తన రక్తాన్ని క్షీరంగా మార్చి బిడ్డ ఆకలి తీర్చి తన ఒడిలో జీవిత పాఠాలు నేర్పిన తల్లిని ఎంత ఆదరించాలో అర్థమవుతుంది. అందుకే ప్రవక్త (స) తల్లి పాదాల కింద స్వర్గముందని, స్వర్గాన్ని కోరుకునేవారెవైనా తల్లికి సేవచేయాలి అన్నారు.

- ముహమ్మద్‌ ముజాహిద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని