శుష్క వాదాలు వద్దు

ఒకసారి బుద్ధుడు కోశాంబి నగరంలో ఉన్న ఆశ్రమంలో గడిపేందుకు వచ్చాడు. కానీ అక్కడి భిక్షువుల మధ్య తరచు కాలాన్ని వృథా చేసే వివాదాస్పదమైన సైద్ధాంతిక చర్చలు జరుగుతున్నాయి. అది చూసి ఆయన బాధపడి ఎవరికీ చెప్పకుండా...

Updated : 28 Oct 2021 02:35 IST

కసారి బుద్ధుడు కోశాంబి నగరంలో ఉన్న ఆశ్రమంలో గడిపేందుకు వచ్చాడు. కానీ అక్కడి భిక్షువుల మధ్య తరచు కాలాన్ని వృథా చేసే వివాదాస్పదమైన సైద్ధాంతిక చర్చలు జరుగుతున్నాయి. అది చూసి ఆయన బాధపడి ఎవరికీ చెప్పకుండా రాత్రివేళ రక్షిత వనానికి వెళ్లిపోయాడు. ఆ వర్షాకాలమంతా తపస్సు చేశాడు. బుద్ధుడు కనిపించక పోవడానికి కారణం భిక్షువులు చేసే వ్యర్థ చర్చలే కారణమని ఆనందుడు అనే శిష్యుడు గ్రహించాడు. వర్షరుతువు అయిపోగానే ఆయన జేతవనానినికి వెళ్లాడని తెలుసుకున్నాడు. చర్చలతో కాలయాపన చేసిన భిక్షువులను తీసుకుని బుద్ధుని వద్దకు వెళ్లాడు. వారంతా తమ తప్పును ఒప్పుకొని ఇకపైన వ్యర్థ ప్రసంగాలతో కాలయాపన చేయమంటూ ప్రతిజ్ఞ చేశారు. అప్పుడు బుద్ధుడు ‘ముఖ్యమైన అంశాలమీద మనసు లగ్నం చేయాలి. ఉదాహరణకి కుటుంబపోషణ అత్యవసరం. అందుకోసం యజమాని ఉద్యోగం చేయాలి. దృష్టి, ధ్యాస అంతా ఆ పనిమీదే ఉండాలి. లేదంటే చేసే పనిలో లోపాలు తప్పవు. జీవితంలో గమ్యాలూ అంతే. ఏం చేయాలో, ఎలా చేయాలో నిర్దేశించుకోనట్లయితే చేసిన పనినే మళ్లీమళ్లీ చేయాల్సి వస్తుంది. మనకున్న అతి తక్కువ సమయాన్ని వీలైనంత నాణ్యంగా వెచ్చించాలి. లేదంటే అనేక జన్మలు తప్పవు. లక్ష్యాన్ని గమ్యపు గంటలపై కేంద్రీకరిస్తే జన్మరాహిత్యం సులభంగా పొందొచ్చు’ అంటూ వివరించాడు.

ఉమాబాల 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని