రాజుగారి దొంగ అల్లుడు

పాదుషా కూతురు గొప్ప ధర్మాత్మురాలు. ఆమెకి సరైన వరుణ్ని ఎంపికచేయడం ఆయనకి సవాలుగా మారింది. రాజుగారి ప్రకటన చూసి ఆమెని చేసుకోవడానికి ఏ ఒక్కరూ సాహసించలేదు. దాంతో ఆయన భక్తిపరుడు, ధర్మనిష్టుడైన యువకుడి...

Updated : 28 Oct 2021 02:36 IST

పాదుషా కూతురు గొప్ప ధర్మాత్మురాలు. ఆమెకి సరైన వరుణ్ని ఎంపికచేయడం ఆయనకి సవాలుగా మారింది. రాజుగారి ప్రకటన చూసి ఆమెని చేసుకోవడానికి ఏ ఒక్కరూ సాహసించలేదు. దాంతో ఆయన భక్తిపరుడు, ధర్మనిష్టుడైన యువకుడి కోసం రాజ్యమంతా గాలించమని, పట్టణ ప్రధాన మస్జిదులో కాపలా కాయమని ఆదేశించారు. రాత్రివేళ మస్జిదులో దైవారాధనతో గడిపిన వ్యక్తిని బంధించి తీసుకురమ్మని హుకుం జారీ చేశారు. చెప్పినట్లుగానే సైన్యం అర్ధరాత్రి మస్జిద్‌ చేరింది. అంతలో ఒక దొంగ పారిపోతూ మస్జిదులోకి జొరబడ్డాడు. ప్రాణభయంతో ఓ మూలన నమాజ్‌ చేస్తున్నట్లు నటించసాగాడు. అతడ్ని చూసిన సైన్యం తమకు కావాల్సిన యువకుడు దొరికాడని మంత్రికి కబురు పంపారు. మంత్రి రావడం ఆలస్యమవగా సిబ్బంది మస్జిదు ద్వారాలన్నీ మూసి తాళం వేశారు. తెల్లారేవరకూ ఆ దొంగ నమాజ్‌లోనే గడిపాడు. ఉదయం నమాజు ముగిశాక అతడ్ని బంధించి రాజుగారి ముందు హాజరుపరిచారు. ‘నా ఏకైక కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. రాజ్యంలో సగభాగానికి నిన్ను వారసుడ్ని చేస్తాను. నీ అభిప్రాయమేంటో చెప్పు’ అన్నారు పాదుషా. ఏం జరుగుతోందో తెలియక దొంగ ఆందోళన చెందాడు. ‘మీ కుమార్తెతో పెళ్లిచేసేంత యోగ్యత నాలో ఏముందో తెలుసుకోవచ్చా ప్రభూ?!’ ధైర్యం కూడగట్టుకుని అడిగాడు. దానికి పాదుషా ‘నువ్వు రాత్రంతా దైవారాధనలో మస్జిదులోనే గడిపావు. నాకు అల్లుడిగా, నా కుమార్తెకు భర్తగా రావడానికి ఇంతకంటే ఇంకేం అర్హతలు కావాలి నాయనా?’ అన్నారు. అప్పుడు దొంగ ‘ఓ అల్లాహ్‌! దొంగబుద్ధితో చేసిన నమాజుకే రాజ్యాన్ని అప్పగించావు. రాకుమారికి భర్తనయ్యే అదృష్టం కల్పించావు. ఎంత గొప్ప వాడివయ్యా నీవు!’ అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ‘నమాజ్‌ చేసినట్లు నటించినందుకే ఇంత అదృష్టం తలుపుతడితే నిజంగా నమాజ్‌ చేస్తే ఇంకేం అద్భుతం జరుగుతుందో’ అనుకున్నాడు.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని