నారదుడు... విష్ణుమాయ

ఒకసారి నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ‘స్వామీ, అసాధ్యమైన దాన్ని సాధ్యమయ్యేట్లు చేసే మీ మాయను ఒకసారి చూపించండి’ అంటూ ప్రార్థించాడు.

Updated : 28 Oct 2021 02:36 IST

కసారి నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ‘స్వామీ, అసాధ్యమైన దాన్ని సాధ్యమయ్యేట్లు చేసే మీ మాయను ఒకసారి చూపించండి’ అంటూ ప్రార్థించాడు.

విష్ణుమూర్తి సరేనన్నాడు. తర్వాత ఒకరోజు వాళ్లిద్దరూ కలిసి ప్రయాణమై వెళ్తున్నారు. దారిలో విష్ణుమూర్తి అలసిపోయి, నేలమీద కూర్చుని ‘నారదా! చాలా దాహంగా ఉంది. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో చూసి తీసుకురా’ అన్నాడు. నారదుడు వెంటనే బయల్దేరాడు. చాలా దూరం వెళ్లాక ఒక నది కనిపించగా సంతోషంగా పరుగులాంటి నడకతో వెళ్లాడు. తీరా నది దగ్గరికి వెళ్లగానే మహా సౌందర్యరాశి అయిన ఒక యువతి కనిపించింది. ఆమెని చూడగానే నారదుడికి మతి పోయింది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. విష్ణుమూర్తి దాహం సంగతి మర్చేపోయాడు. ఆ యువతి కూడా నారదుని చూసి ఆకర్షితురాలైంది. ఇద్దరూ వెంటనే పెళ్లి చేసుకున్నారు. దగ్గర్లోనే ఒక కుటీరం కట్టుకుని గృహస్థుగా స్థిరపడిపోయాడు. వారి సంతోషానికి చిహ్నంగా పిల్లలు పుట్టారు. వాళ్లలా ఆనందంగా జీవిస్తుండగా ఆ ప్రాంతంలో వర్షాల్లేక పొలాలన్నీ ఎండిపోయాయి. ఎక్కడ చూసినా ఆకలి చావులే. అనేక మందిలా నారదుడు కూడా భార్యాపిల్లల్ని తీసుకుని వలస బయల్దేరాడు. మార్గమధ్యంలో నదిని దాటాల్సివచ్చింది. వరద ముంపుతో భార్యాపిల్లలు నదిలో కొట్టుకుపోయారు. ఒంటరిగా మిగిలిన నారదుడు, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక పెద్దపెట్టున విలపిస్తున్నాడు.

ఇంతలో విష్ణుమూర్తి ప్రత్యక్షమై ‘ఏమైంది నారదా, నీళ్లు తెమ్మంటే ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావేంటి?’ అనడిగాడు.

నారదుడు ఉలిక్కిపడ్డాడు. ఏం జరిగిందో క్షణంలో అర్థమైంది. ‘స్వామీ మీకు కోటి నమస్కారాలు. మీ అద్భుత మాయకు శతకోటి నమస్కారాలు’ అన్నాడు. విష్ణుమూర్తి చిద్విలాసంగా నవ్వాడు.

- గోవిందరాజు ఉమామహేశ్వర రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు