నామస్మరణే రక్షణ కవచం

కురుక్షేత్రం ముగిశాక... ధర్మరాజు అంపశయ్యపై ఉన్న భీష్ముణ్ని ఆరు ప్రశ్నలు అడిగాడు- ‘లోకంలో ఏకైక దైవం ఏది? ప్రాణులన్నీ పొందదగిన గొప్ప స్థానం ఏది? మనుషులు ఎవరిని పూజించాలి? ఎవరిని అర్చించడం

Published : 04 Nov 2021 01:01 IST

కురుక్షేత్రం ముగిశాక... ధర్మరాజు అంపశయ్యపై ఉన్న భీష్ముణ్ని ఆరు ప్రశ్నలు అడిగాడు- ‘లోకంలో ఏకైక దైవం ఏది? ప్రాణులన్నీ పొందదగిన గొప్ప స్థానం ఏది? మనుషులు ఎవరిని పూజించాలి? ఎవరిని అర్చించడం ద్వారా మనుషులు సర్వశుభాలను పొందగలుగుతున్నారు? మీ దృష్టిలో అన్నిటికంటే ఏది గొప్ప ధర్మం? ఏది జపించడం ద్వారా మనుషులు సకల కర్మబంధాల నుంచి విముక్తులౌతారు?’ అనేవి ఆ ప్రశ్నలు.

ధర్మరాజు అడిగినవాటికి సమాధానమే భీష్ముడు తెలియజేసిన విష్ణు సహస్రనామాలు. ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే కలిగే సత్ఫలితాలేంటో వ్యాసుడు ఉత్తర పీఠికలో చెప్పాడు.

రోగార్తోముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్‌
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః

రోగార్తులు, కష్టాల్లో చిక్కుకున్నవారు విష్ణునామ పారాయణతో విముక్తులవుతారు. అంతేగాక ధర్మార్థ కామార్థులందరికీ తమ పురుషార్థాలు నెరవేరేలా విష్ణు నామాలు అనుగ్రహిస్తాయి.

భగవత్‌ తత్త్వాన్ని వ్యాస, వాల్మీకాది మునీంద్రులు దర్శించారు. పుణ్య సాధకం, మోక్షకారకమైన ఆ తత్త్వాన్ని వారు భగవన్నామాలుగా మలిచారు. రామనామాన్ని తొంభైఆరు కోట్లసార్లు జపించి త్యాగయ్య శ్రీరామ సాక్షాత్కారాన్ని పొందాడు.

అవశేహ్యపి యన్నామ్ని కీర్తితే సర్వ పాతకైః
పుమాన్‌ విముచ్యతే సద్యః సింహ త్రస్థైర్మృగైరివ

దైవ సంకీర్తన చేసే భక్తులను చూసి పాపాలన్నీ సింహానికి భయపడ్డ మృగాల్లా చెదిరిపోతాయనేది విష్ణు పురాణంలోని ఈ శ్లోకానికి అర్థం.

గంగాస్నాన సహస్రేషు పుష్కరస్నాన కోటిషు
నయత్పాపంలయం యాతి స్మృతే నశ్యతి తద్ధరౌ

వేయిసార్లు గంగా స్నానం, కోటి పుష్కర స్నానాలు చేసినా తొలగని పాపం భగవన్నామ కీర్తనతో సాధ్యమని పురాణోక్తి.

ప్రహ్లాదుడు తల్లి గర్భంలోనే విష్ణునామ ప్రాధాన్యాన్ని నారదుడి ద్వారా విన్నాడు. వయసుతో పాటే భక్తి పెరిగింది. తండ్రి విధించిన శిక్షల నుంచి కాపాడే రక్షణ కవచంగా నిలిచింది హరి సంకీర్తనే.

అనన్యచేతా స్సతతం యోమాం స్మరతి నిత్యశః  
తస్యాహం సులభః పార్థ! నిత్యయుక్తస్య యోగినః

అనన్యమైన భక్తితో నా నామస్మరణలో మునిగితేలే భక్తుడికి నేను సులభ సాధ్యుడినంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు.

హరిర్హరతి పాపాని దుష్టచిత్తై రపిస్మృతః  
అనిచ్ఛయాపి సం స్పృష్టో దహత్యే వహి పావకః

తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా దహించడం అగ్ని స్వభావం. దేవుడి స్వభావం అవ్యాజ ప్రేమ. ఇష్టంతో తలచుకున్నా, మొక్కుబడిగా స్మరించినా దైవనామం పాపాలను హరిస్తుంది. అందుకే అన్నమయ్య ‘హరినామమే కడు ఆనందకరము మరుగవో... మరుగవో మనసా’ అన్నాడు.

- శ్రీరామ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు