సమయం రావాలి

బాయిజా తన కొడుకు తాత్యాతోబాటు సాయిని కొడుకుగా భావించేది. ఒకరోజు తాత్యా ‘అమ్మా! సాయి నీ పెద్దకొడుకే అంటావుగా! మరి అన్నయ్య షిరిడీ తిరిగొస్తాడా? వస్తే గుర్తుపడతావా?

Updated : 25 Nov 2021 06:11 IST

బాయిజా తన కొడుకు తాత్యాతోబాటు సాయిని కొడుకుగా భావించేది. ఒకరోజు తాత్యా ‘అమ్మా! సాయి నీ పెద్దకొడుకే అంటావుగా! మరి అన్నయ్య షిరిడీ తిరిగొస్తాడా? వస్తే గుర్తుపడతావా?’ అన్నాడు.
‘ఎన్నాళ్లు గడిచినా, ఎన్ని మార్పులొచ్చినా తల్లి కొడుకును గుర్తుపట్టగలదు. ఆ ప్రేమే కొడుకును తల్లి దగ్గరకు చేరుస్తుందని నా నమ్మకం’ అంది.

అడవిలో ఉన్న సాయి ఆమె మాటలు విని నవ్వుకున్నాడు. అంతలోనే చాంద్‌ పాటిల్‌ అనే వ్యాపారి తప్పిపోయిన గుర్రాన్ని వెదుకుతూ అక్కడికొచ్చాడు. సాయి అతడి దాహం తీర్చి, బిజిలీ అని పిలవగానే ఎక్కడో ఉన్న గుర్రం వచ్చింది. పాటిల్‌ సంతోషంతో ‘సాయీ మీరు మా ఇంటికి వస్తే సేవ చేసుకుంటాను’ అన్నాడు. దానికి సాయి ‘నాకు కాదు, ప్రజలకు సేవచేస్తే నాలాంటి ఎందరో ఫకీర్లకు సేవచేసినట్లే’ అన్నాడు. అయోమయంగా ఉన్న పాటిల్‌ను చూస్తూ ‘అర్థం కాలేదా? ఎలాంటి పనినైనా సాధించగలం అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ ఫలం నిర్దేశించిన సమయానికే దక్కుతుందని గ్రహించాలి. నువ్వు ఎన్నోరోజులు నమ్మకంతో, పట్టుదలతో బిజిలీ కోసం వెతికినా అది ఈరోజే నీకు దొరికింది. అలాగే తన కొడుకు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఒక తల్లి కూడా త్వరలో కొడుకును చూడబోతోంది’ అనడంతో పాటిల్‌ సాయికి వినమ్రంగా నమస్కరించాడు.

- ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని