దారి తప్పించే సాతాను

ప్రభువు సాన్నిధ్యం కోరుకునే వారు తమ హృదయాలను పవిత్రంగా ఉంచుకోవాలి. ‘నేను పరిశుద్ధుడను కనుక మీరలాగే ఉండాలి’ అని స్వయంగా చెప్పాడు. పరిశుద్ధంగా ఉండటం అసాధ్యమేమీ కాదు. రోజూ

Published : 19 May 2022 00:22 IST

ప్రభువు సాన్నిధ్యం కోరుకునే వారు తమ హృదయాలను పవిత్రంగా ఉంచుకోవాలి. ‘నేను పరిశుద్ధుడను కనుక మీరలాగే ఉండాలి’ అని స్వయంగా చెప్పాడు. పరిశుద్ధంగా ఉండటం అసాధ్యమేమీ కాదు. రోజూ మనం దేవునికిష్టం లేని పనులెన్నో చేస్తుంటాం. కోరికల రుగ్మతలతో బంధితులమవుతామని బైబిల్‌ చెబుతోంది. భక్తుడైన దావీదు ‘నీ వాక్యం నా తోవకు దీపమై వెలుగు చూపుతోంది’ అంటాడు. దేవుని వాక్యం హృదయంలో ఉంటే పాపపు తలపులను జయించగలం. దుష్టుడైన సాతాను ఏదోవిధంగా పరిశుద్ధతను పక్కదారి పట్టించాలని చూస్తాడు. అందుకే ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం కంటే తన మనసును కాపాడుకోవడం కష్టమంటుంది బైబిల్‌. చిన్నపిల్లల్లా కల్మషం లేనప్పుడే దేవుని రాజ్యంలోకి ప్రవేశం లభిస్తుంది.

ఏసు ప్రభువు తన పరిచర్య ప్రారంభించడానికి సిద్ధమౌతున్న తరుణంలో దుష్టుడు వచ్చి వ్యామోహాలతో దారి తప్పించాలని చూస్తాడు. ‘ఆయన ఉపవాసం వల్ల ఆకలిగా వున్నాడని గ్రహించి ఈ రాళ్లను రొట్టెలయ్యేలా ఆజ్ఞాపించు’ అంటాడు ప్రభువు. మనిషి రొట్టెలతోనే కాదు, దేవుని మాటలతో జీవిస్తాడని చెబుతాడు. ఓ కొండమీదకు తీసుకెళ్లి ‘ఇక్కడినుంచి దూకు! దేవ దూతలు వచ్చి నిన్ను రక్షిస్తారు’ అని చెప్పగా, ‘దేవుని శోధింపవలదు’ అని గుర్తుచేశాడు. చివరిగా ‘లోకంలో ఉన్న రాజ్యాలు, వాటి వైభవాన్ని చూపి నువ్వు సాగిలపడి నమస్కరిస్తే వీటన్నిటినీ నీకిస్తానని దుష్టుడు చెప్పగా, ‘ప్రభువుకు మాత్రమే మొక్కాలి’ అంటూ దేవుని వాక్యాన్ని వివరించాడు. అలా సాతానును ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మనం చేయాల్సిందదే. దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ మన హృదయంలో పదిల పరచుకుని, వచ్చే ఆపదలు, అపనిందల నుంచి తప్పించుకోగలం. దేవుని చూడగలం.

- బందెల స్టెర్జీ రాజన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని