రొట్టెను పిండితే...

ఒకరోజు గురునానక్‌ తన పర్యటనలో భాగంగా బాయి మార్‌దానాతో కలిసి అమీనాబాద్‌ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) నగరానికి వెళ్లారు. నానక్‌ వచ్చారని తెలిసి ఆ ఊరిలో ఉన్న ధనవంతులు పోటీలు పడి

Published : 19 May 2022 00:22 IST

ఒకరోజు గురునానక్‌ తన పర్యటనలో భాగంగా బాయి మార్‌దానాతో కలిసి అమీనాబాద్‌ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) నగరానికి వెళ్లారు. నానక్‌ వచ్చారని తెలిసి ఆ ఊరిలో ఉన్న ధనవంతులు పోటీలు పడి మరీ వాళ్లిద్దరినీ భోజనానికి ఆహ్వానించారు. అయితే నానక్‌ వడ్రంగి పని చేసుకుని జీవిస్తోన్న బాయి లాలో ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. నిరుపేద అయిన బాయి లాలో చిన్న వంటగదిలో తన చేత్తో స్వయంగా వండిన భోజనాన్నే వడ్డించగా వాళ్లు ఆనందంగా తిన్నారు.

తమ అందరి ఆహ్వానాన్ని కాదని నానక్‌ సామాన్య వడ్రంగి బాయి ఇంటికి వెళ్లారని తెలిసి ఆ ధనవంతులంతా ఆశ్చర్యచకితులయ్యారు. మాలిక్‌ భాగో అనే ఉన్నతాధికారి కూడా నానక్‌ని ఆహ్వానించినవారిలో ఉన్నాడు. నానక్‌ రాకపోవడం తనని, తన హోదాను అవమానించినట్లు తోచింది. వెంటనే తన పరివారంతో వెళ్లి ‘గురుదేవా! మీరెందుకు మా ఆతిథ్యం సీˆ్వకరించడానికి రాలేదు? ఈ పేద వడ్రంగి రొట్టెముక్క అంత నచ్చిందా? ఈపాటి భోజనాన్ని నేను సమకూర్చలేననుకున్నారా?’ అని హేళన చేశాడు. అప్పుడు నానక్‌ ‘తొందరపడకు మాలిక్‌! ఇప్పుడే నీ ఇంటి నుంచి ఓ రొట్టె తీసుకురా!’ అన్నారు. అతడు సేవకుణ్ణి పంపి ఇంటి నుంచి రొట్టె తెప్పించి నానక్‌ పాదాల వద్ద ఉంచాడు. అప్పుడు నానక్‌ బాయిలాలో రొట్టెలో చిన్న ముక్క తుంచి మాలిక్‌ రొట్టె పక్కనే ఉంచి ‘మాలిక్‌! వీటిని కొంచెం పిండు’ అన్నారు. మాలిక్‌ అయోమయంగా చూసి, బాయి లాలో రొట్టెను చేతిలోకి తీసుకున్నాడు. ‘ఇంత గట్టిగా ఉంది. దీన్నెలా తింటారు?’ అనుకుని నానక్‌ చెప్పినట్లు పిండగానే అందులోంచి పాలు కారాయి. ఆశ్చర్యపోయి తన ఇంటి రొట్టెను పిండగా రక్తం చుక్కలు కారాయి. మాలిక్‌ మ్రాన్పడిపోయాడు. నానక్‌ నవ్వి ‘బాయిలాలో కాయకష్టంచేసి సంపాదిస్తున్నాడు. కానీ నువ్వు పరుల కష్టాన్ని దోచుకుని, వాళ్ల రక్తాన్ని పీలుస్తున్నావు. అందుకు నిదర్శనమే ఈ పాలూ రక్తమూ’ అన్నాడు. మాలిక్‌కి నోట మాట రాలేదు.

- జి.శ్రీనివాసు, ఆలమూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని