పతంజలి సూత్రం

లోకంలో నాలుగు రకాల మనుషులున్నారు. సుఖంగా జీవిస్తున్నవారు, దుఃఖితులు, ధర్మాత్ములు, దుర్మార్గులు.. వారి వారి కర్మానుసారం జీవనయాత్ర సాగిస్తుంటారు. సంతుష్టిగా ఉన్నవారిని చూసినప్పుడు

Published : 19 May 2022 00:22 IST

లోకంలో నాలుగు రకాల మనుషులున్నారు. సుఖంగా జీవిస్తున్నవారు, దుఃఖితులు, ధర్మాత్ములు, దుర్మార్గులు.. వారి వారి కర్మానుసారం జీవనయాత్ర సాగిస్తుంటారు. సంతుష్టిగా ఉన్నవారిని చూసినప్పుడు దిగులుపడుతున్నవారికి అసూయ కలుగుతుంది. నిజానికి ఈర్ష్యాసూయలతో బాధ అధికమవుతుందే గానీ ఉపశమనం కలగదు. ఉన్న కాస్త మనశ్శాంతీ ఉష్‌కాకీ అయిపోతుంది. చేయాల్సిందల్లా సంతోషించడం, స్ఫూర్తిపొందడం.

దుఃఖితులను చూసి వాళ్ల కర్మ అలా ఉంది అనడం వింటుంటాం. నిజానికి అలాంటివారికి కావలసింది సానుభూతీ సహకారాలు. ఎగతాళో నిర్లిప్తతో సరి కాదని, అలాగే దుర్మార్గులను చూసి జాలిపడాలే తప్ప కోపగించుకుని లేదా సలహాలిచ్చీ ప్రయోజనం లేదన్నారు పెద్దలు. వరం ఇచ్చిన శివుని నెత్తిన చేయి పెట్టబోయాడు భస్మాసురుడు. హిరణ్యకశిపుడికి అందుకే నారదుడు హితబోధ చేయలేదు. రావణుడికి మండోదరి మాట చెవికెక్కలేదు.

మరీ చొరవ చూపితే మనకే ఎసరుపెట్టొచ్చు. చెట్టుకొమ్మపైన చిన్న గూడు కట్టుకున్న పక్షి. వర్షంలో తడుస్తున్న కోతికి మానవజాతికి ఆదివైన నువ్వూ ఓ ఇల్లు కట్టుకోమని సలహా ఇచ్చింది. వానరం రెచ్చిపోయి పక్షి గూటిని పడగొట్టింది. దిక్కులేని పక్షిరెక్కలు దులుపుకుంటూ మరో దారి లేక విడిచి ఎక్కడికో ఎగిరిపోయింది. కనుక దుష్టులను దూరంపెట్టడమే మంచిది. ఒక ఉత్తముడైన మానవుడి గురించి పతంజలి యోగి ఒక చక్కని శ్లోకం చెప్పాడు.

మైత్రీకరుణ ముదితోపేక్షాణాం
సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణాం
భావనా తశ్చిత్త ప్రసాదనం

యోగసూత్రాలలో ఇది చాలా ముఖ్యమంది. అందరికీ దారిదీపం. సుఖజీవులపట్ల స్నేహభావం, దుఃఖితుల ఎడల కరుణ, పుణ్యాత్ములను చూసి ఆనందించడం, దుర్మార్గుల విషయంలో కలగజేసుకోకపోవడం- వీటివల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది.

- ఉప్పు రాఘవేంద్ర రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని