వృద్ధురాలిని కనికరించిన స్వామి

తిరుచ్చి నేషనల్‌ కాలేజి హైస్కూల్‌ ప్రాంగణంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి దర్శనం కోసం భక్తులు బారులు తీరి ఉన్నారు. ఆయన పరమాచార్యగా ప్రఖ్యాతులు. ఆ నిప్పులు చెరిగే ఎండలో ఓ పండు వృద్ధురాలుంది.

Published : 23 Jun 2022 01:26 IST

గురుబోధ

తిరుచ్చి నేషనల్‌ కాలేజి హైస్కూల్‌ ప్రాంగణంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి దర్శనం కోసం భక్తులు బారులు తీరి ఉన్నారు. ఆయన పరమాచార్యగా ప్రఖ్యాతులు. ఆ నిప్పులు చెరిగే ఎండలో ఓ పండు వృద్ధురాలుంది. సమాలోచనల కారణంగా దర్శనం ఆపగా భక్తులలాగే ఎదురుచూస్తున్నారు. పెద్దావిడ ‘శంకరా! నిన్ను చూడకుండానే లోకం విడిచిపోతానేమో! నీ కోసం వస్తే ఆపడం భావ్యమా? ఒక్కసారి కనిపించు!’ అంటూ రొప్పుతూ రోదిస్తోంది.

అప్పుడే స్వామి పూర్వాశ్రమంలో తమ్ముడైన సాంబమూర్తి శాస్త్రి వచ్చారు. వృద్ధురాలిని చూసి లోపలికెళ్లి ‘మీకోసం వందేళ్ల పెద్దావిడ చూస్తోంది’ అని చెప్పారు. పరమాచార్య ఒక్కుదుటన బయటకొచ్చారు.

ఆవిడలాగే స్వామిని కనిపించమని వేడుకుంటోంది. స్వామి దగ్గరగా వెళ్లి ‘అవ్వా! నువ్వొచ్చావని తెలిసిన వెంటనే నీకోసం వచ్చేశాను’ అన్నారు ప్రేమగా.

‘శంకరా! నాకోసం వచ్చావా!’ అని కన్నీళ్లు కారుస్తూ ఆనందంతో చేతులు పట్టుకుంది. వంగిపోవడాన తలెత్తి చూడలేక ‘ఎదురుగా వచ్చినా చూడలేకపోతున్నాను’ అని దుఃఖించింది. స్వామి కొంచెం వంగి ‘అవ్వా! ఇప్పుడు కనిపిస్తున్నానా?’ అనడిగారు. స్వామి దర్శనానికి సంతోషించి ‘నిన్ను చూడాలనే ఇంతకాలం ప్రాణాలు నిలుపుకున్నాను, ఇక నన్ను తీసుకుపో’ అంది.

‘అవ్వా, ఇంకెప్పుడూ నన్ను చూడాలంటూ రాకు. నేనెప్పుడూ నీ వెంటే, నీతోనే ఉంటాను’ అన్నారు. నడిచే దైవమే తన వెంట ఉంటానని మాటిచ్చారు. అదెంత భాగ్యమో! 

- జూపూడి శ్రీలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని