బే అదబ్‌ బద్‌ నసీబ్‌!

ఓ వ్యక్తికి వ్యాపారం కలిసిరాక అవస్థపడుతూ కుంగిపోసాగాడు. తమ ఊరికి బహలుల్‌ దానా అనే మహనీయుడు రావడంతో వెళ్లి కష్టం చెప్పుకున్నాడు. హజ్రత్‌ ఫలానా రంగు బట్టల వ్యాపారం...

Published : 23 Jun 2022 01:26 IST

ఇస్లాం సందేశం

వ్యక్తికి వ్యాపారం కలిసిరాక అవస్థపడుతూ కుంగిపోసాగాడు. తమ ఊరికి బహలుల్‌ దానా అనే మహనీయుడు రావడంతో వెళ్లి కష్టం చెప్పుకున్నాడు. హజ్రత్‌ ఫలానా రంగు బట్టల వ్యాపారం చేయమని సలహా ఇవ్వగా అలాగే చేశాడు. త్వరలోనే గొప్ప వ్యాపారి అయ్యాడు. డబ్బుతోపాటు గర్వమూ పెరిగింది. కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు గుర్రంమీద వెళ్తుండగా బహలుల్‌ కాలినడకన వెళ్లడం చూసి ‘ఇప్పుడు నేనేం వ్యాపారం చేయాలో చెప్పుకో గురువా!’ అన్నాడు హేళన నిండిన స్వరంతో. దానికాయన పుచ్చకాయల వ్యాపారం చేయమనగా గతంలో ఆయన మాట విని సంపన్నుడు అయినందున, ఇంకా లబ్ధి పొందాలని పెద్ద మొత్తంలో వ్యాపారం ఆరంభించి తీవ్రంగా నష్టపోయాడు. పరిస్థితి మొదటికొచ్చింది. మళ్లీ బహలుల్‌ను కలిసి తన దుస్థితిని ఏకరువు పెట్టాడు. దానికాయన ‘ఇదంతా నీ నోటి మాటవల్లే జరిగింది’ అన్నారు. ‘మొదటిసారి అణకువతో, గౌరవమర్యాదలతో మాట్లాడావు. అది అల్లాహ్‌కు నచ్చింది. శుభాలు కురిపించి లాభాలబాట పట్టించాడు. రెండోసారి అమర్యాదగా గర్వంగా మాట్లాడావు. అల్లాహ్‌కు నచ్చలేదు. ఆగ్రహించాడు. నష్టాలపాలయ్యావు’ అనడంతో కళ్లు తెరుచుకున్నాయి. అందుకే ‘బా అదబ్‌ బా నసీబ్‌.. బే అదబ్‌ బద్‌ నసీబ్‌’ అంటారు. మర్యాదామన్ననలతో భాగ్యం, అమర్యాదతో దౌర్భాగ్యం ప్రాప్తిస్తాయనేది భావం. ఎంత ఉన్నతస్థితిలో ఉన్నా ప్రేమగా, అణకువగా మసలుకోవాలి.  

- ముహమ్మద్‌ ముజాహిద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని