బ్రహ్మహత్యాపాతకం ఉండే తావులు

పూర్వం ముల్లోకాలని దితికుమారుడైన వృత్రుడు ప్రజారంజకంగా పాలించాడు. అతడి శరీరం వంద యోజనాల విస్తారం, మూడొందల యోజనాల ఎత్తు. తన ధర్మపాలనలో దేశం సుభిక్షంగా ఉండగా పెద్దకొడుకుని అభిషిక్తుణ్ణి చేసి తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయాడు.

Published : 23 Jun 2022 01:26 IST

కథాస్రవంతి

పూర్వం ముల్లోకాలని దితికుమారుడైన వృత్రుడు ప్రజారంజకంగా పాలించాడు. అతడి శరీరం వంద యోజనాల విస్తారం, మూడొందల యోజనాల ఎత్తు. తన ధర్మపాలనలో దేశం సుభిక్షంగా ఉండగా పెద్దకొడుకుని అభిషిక్తుణ్ణి చేసి తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయాడు. ఆ తపస్సు చూసి దేవతలకి భయం కలిగింది. ఇంద్రుడు విష్ణు మూర్తి వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నాడు. ‘వృత్రుడు పరాక్రమశాలి. ఇప్పుడు చేస్తున్న భయంకర తపస్సు కొనసాగితే నేనతడికి దాస్యం చేస్తూ బతకాల్సిందే. నీ దయతోనే ఈ లోకాలను వశపరచుకున్నాడు. నువ్వు మాత్రమే దేవతలను రక్షించగలవు. తగిన ఉపాయం చెప్పు’ అని ప్రార్థించాడు.

విష్ణువు ఇంద్రుడితో తాను వృత్రుణ్ణి చంపలేనన్నాడు. కారణం అతడి పట్ల ఉన్న స్నేహభావం. దేవతలకి సాయం చేసేందుకు తన తేజస్సుని ఇంద్రుడిలో, వజ్రాయుధంలో, భూమిలో నిక్షేపం చేస్తానని, దానితో ఇంద్రుడికి వృత్రుణ్ణి చంపగల  శక్తి వస్తుందని అన్నాడు.

వృత్రుడు తపస్సు చేస్తున్న ప్రదేశంలో ఆకాశమంతా ప్రకాశించేటంతటి తేజస్సు ఉంది. కానీ ఇంద్రుడు నిర్దయుడై తపస్సు చేస్తున్న వృత్రుణ్ణి వజ్రాయుధంతో సంహరించాడు.

ధర్మవర్తనుడై జీవించి, తపస్సులో ఉన్న వృత్రుణ్ణి చంపటంతో ఇంద్రుడికి బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంది. వెంటపడుతున్న ఆ మహాపాతకం నుంచి తప్పించుకోవ డానికి ఇంద్రుడు లోకాలకు ఆవల ఉన్న తమస్సులో దాక్కున్నాడు. వృత్రుడు చనిపోయాడనే సంతోషం, ఇంద్రుడు కనపడకుండా పోయాడని బాధ కలిగాయి దేవతలకి. అగ్ని నాయకత్వంలో విష్ణుమూర్తి వద్దకు వెళ్లి సేవలతో, కీర్తనలతో తృప్తిపరచి.. ‘నీ దయ వల్ల వృత్రుడు చనిపోయాడు, కానీ ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం కలిగింది. సత్ప్రవర్తనగల ఇంద్రుడు ఆ పాపం నుంచి బయటపడే మార్గం తెలియచెప్పు స్వామీ’ అంటూ ప్రార్థించారు.

వారి ప్రార్థన విన్న విష్ణువు దయతో ‘ఇంద్రుడు నన్ను గూర్చి అశ్వమేథయాగం  చేస్తే బ్రహ్మహత్యాపాతకం తొలగి తిరిగి దేవత్వం పొందుతాడు’ అన్నాడు. దేవతలు మతిలేనివాడి వలె ఉన్న ఇంద్రుణ్ణి వెతికి పట్టుకుని యజ్ఞం చేసేందుకు ఒప్పించారు. అశ్వమేథం చేయగానే ‘ఇంద్రుణ్ణి వదిలితే నేనెక్కడ ఉండాలి?’ అంటూ దేవతలను అడిగింది బ్రహ్మహత్యాపాతకం. ‘నీ ఇష్టం వచ్చిన నాలుగుచోట్ల నాలుగు భాగాలుగా ఉండు’ అన్నారు దేవతలు. అది నాలుగు భాగాలై వానాకాలంలో నదుల్లో, భూమియందు చవుడుగా, స్త్రీల రజోదర్శన నాటి మూడురోజులు, నిర్దోషులైన బ్రాహ్మణులను అపకీర్తి పాలుచేసేవారిలో ఉంటాను’ అని చెప్పి వెళ్లిపోయింది.

- రాహుల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని