లక్ష్మీదేవి అలిగిన వేళ

మన సనాతన సంప్రదాయంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. ఆషాఢమాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన పూరి జగన్నాథుని రథయాత్ర. ఇది ఆషాఢ శుక్ల విదియ నాడు ప్రారంభమై ద్వాదశినాడు ముగుస్తుంది. జగన్నాథడి అన్న బలరాముడు, చెల్లెలు సుభద్రతో కలిసి

Updated : 30 Jun 2022 03:38 IST

మన సనాతన సంప్రదాయంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. ఆషాఢమాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన పూరి జగన్నాథుని రథయాత్ర. ఇది ఆషాఢ శుక్ల విదియ నాడు ప్రారంభమై ద్వాదశినాడు ముగుస్తుంది. జగన్నాథడి అన్న బలరాముడు, చెల్లెలు సుభద్రతో కలిసి ఆలయానికి కొంత దూరంలో ఉన్న ‘గుండిచా మాత’ అనే తమ పిన్ని గారింటికి కొత్తరథంలో వెళ్లిరావడమే ఈ రథయాత్ర. ఎక్కడైనా ఊరేగింపులో ఉత్సవ విగ్రహాలుంటాయి. కానీ ఈ ఆలయంలో మాత్రం మూల విరాట్టునే ఊరేగిస్తారు.
ఆషాఢ శుక్ల విదియనాటి ఉదయం అత్యంత కోలాహలంగా విగ్రహాల్ని ఆలయం వెనుకవైపు నుంచి రథంలోకి ఎక్కిస్తారు. ఈ ఉత్సవాన్ని స్థానికంగా ‘పహండీ బిజె’ అంటారు. దీనికి ముందు గజపతి రాజవంశీకులు బంగారు చీపురుతో ఆ రథాన్ని, రథమున్న చోటును శుభ్రంచేస్తారు దీన్ని ‘చెరా పహారా’ అంటారు. అనంతరం ‘గరుడధ్వజం’ రథంమీద జగన్నాథుడు, ‘తాళధ్వజం’ రథంమీద బలభద్రుడు, ‘దేవతళన్‌’ రథంమీద సుభద్ర అధిరోహించి 12గంటల ఉరేగింపు తర్వాత సాయంత్రానికి ఆలయానికి చేరుతుంది. ఏడు రోజులపాటు అక్కడే ఉంటారు. చెల్లి, అన్నలతో పాటు తనను ఆలయం లోపలికి తీసుకువెళ్లలేదని స్వామిపై అలుగుతుంది లక్ష్మీదేవి. ఆమె పట్టరాని కోపంతో పంచమినాడు రథాన్ని కొంత విరగ్గొట్టి వెళ్లిపోతుంది. దీన్ని ‘హీరా పంచమి’ ఉత్సవం అంటారు. గుండిచామాత ఆతిథ్యం తర్వాత ఆషాఢ శుక్ల దశమి నాడు సోదరీ సోదర సమేతంగా జగన్నాథస్వామి పూరి ఆలయానికి బయల్దేరి మార్గమధ్యంలో ‘అర్థాసనీ’ ఆలయం దగ్గర మధురప్రసాదాన్ని స్వీకరించి పూరి చేరుకుంటారు. దీన్ని ‘బహూడా యాత్ర’ అంటారు. మర్నాడు స్వామివారిని 208 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. ఈ అలంకరణను ‘సోనా బేషా’ (స్వర్ణవేషం) అంటారు. ఆషాఢ శుద్ధద్వాదశినాడు మళ్లీ స్వామివారిని సోదరసోదరీ సమేతంగా అలంకరించి రత్నపీఠంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర ముగుస్తుంది. ఈ రథయాత్రకు సంబంధించిన ప్రస్తావన మనకు బ్రహ్మాండ, స్కాంద, పద్మ పురాణాల్లో కనిపిస్తుంది.

- డా.ఎస్‌.ఎల్‌.వి.ఉమామహేశ్వరరావు, త్రిపురాంతకం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని