నీతికి తోడు... దేవుడు!

పూర్వం బనీ ఇస్రాయిల్‌ జాతికి చెందిన ఒక వ్యక్తికి వెయ్యి బంగారు నాణేలు అత్యవసరమయ్యాయి. దాంతో తనకు బాగా తెలిసిన ఒక వ్యాపారిని అప్పివ్వమని అభ్యర్థించాడు. ఆ వ్యాపారి అల్లాహ్‌పై నమ్మకం ఉంచి అతనికి వెయ్యి బంగారు నాణేలను అప్పుగా ఇచ్చాడు. ఫలానా గడువులోగా తిరిగి ఇచ్చేయాలని షరతు పెట్టాడు.

Published : 25 Jul 2019 00:34 IST

ఇస్లాం సందేశం

పూర్వం బనీ ఇస్రాయిల్‌ జాతికి చెందిన ఒక వ్యక్తికి వెయ్యి బంగారు నాణేలు అత్యవసరమయ్యాయి. దాంతో తనకు బాగా తెలిసిన ఒక వ్యాపారిని అప్పివ్వమని అభ్యర్థించాడు. ఆ వ్యాపారి అల్లాహ్‌పై నమ్మకం ఉంచి అతనికి వెయ్యి బంగారు నాణేలను అప్పుగా ఇచ్చాడు. ఫలానా గడువులోగా తిరిగి ఇచ్చేయాలని షరతు పెట్టాడు. బంగారు నాణేలను తీసుకుని సముద్ర మార్గాన్ని దాటి తన ప్రాంతానికి వెళ్లిపోయాడు. తీసుకున్న డబ్బుతో అవసరాలు తీర్చుకున్నాడు. అంతలోనే అప్పు తీర్చే గడువు వచ్చింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు నాణేలను తీసుకుని ప్రయాణమయ్యాడు. సముద్ర తీరం దగ్గర నిలబడి పడవ కోసం ఎదురు చూడసాగాడు. ఎంతసేపటికీ పడవ రాలేదు. ఇచ్చిన మాట తప్పుతున్నానని కుమిలిపోయాడు. ఎలాగైనా నాణేలను ఈరోజు అతనిదాకా చేర్చాలని గట్టి సంకల్పం చేసుకున్నాడు. సముద్రం ఒడ్డున పడి ఉన్న ఒక కర్రను అందుకున్నాడు. దాన్ని రెండుగా చీల్చి అందులో అప్పుగా తీసుకున్న వెయ్యి బంగారు నాణేలను నింపాడు. చీల్చిన కర్రను అతికించాడు. ‘‘ఓ అల్లాహ్‌ రుణాన్ని తీర్చే మార్గం కానరావడం లేదు. కాబట్టి వీటిని నా రుణదాత వరకు చేర్చు ప్రభూ’’ అని వేడుకుంటూ కర్రను సముద్రంలో వదిలాడు. అదే సమయంలో తనవద్ద అప్పుతీసుకున్న వ్యక్తి కోసం వ్యాపారి సముద్రం ఒడ్డున ఎదురు చూస్తున్నాడు. ఎంతసేపటికీ ఎవ్వరూ వచ్చే జాడ కానరాలేదు. అయితే అంతలోనే ఒక కర్ర సముద్రంలో కొట్టుకువచ్చింది. పొయ్యిలో కనీసం కట్టెగానైనా పనికొస్తుందనే ఉద్దేశంతో ఇంటికి తీసుకువచ్చాడు. పొయ్యిలో పెట్టేందుకు కర్రను చీల్చి చూసినప్పుడు; అందులోంచి వెయ్యి బంగారు నాణేలు నేలపై రాలిపడ్డాయి. అందులో ఉన్న ఉత్తరాన్ని చదివాక అతనికి అసలు విషయం అర్థమయ్యింది. కొంతకాలానికి ఆ వ్యక్తి అప్పు తీర్చే ఉద్దేశంతో వ్యాపారి ఇంటికి వెళ్లాడు. ‘‘ఆరోజు నీకిచ్చిన మాటప్రకారం అప్పు తీర్చాలనుకున్నాను, కానీ పడవలు అందుబాటులో లేకపోవడంతో రాలేకపోయాను. ఇప్పుడు నీ అప్పును నయా పైసాతో సహా చెల్లిస్తున్నాను. అందుకో’’ అంటూ బంగారు నాణేల సంచిని అందించబోయాడు. అప్పుడా రుణదాత నువ్వు ఆరోజు నాకోసం కర్రలో పెట్టి పంపిన నాణాలు నాదాకా చేరాయి... అంటూ ఆ సొమ్మును తిరిగి ఇచ్చేశాడు. నిజాయితీ ఉంటే అల్లాహ్‌ తోడ్పడతాడన్నది ఈ కథలో నీతి.

- బైరున్నీసా బేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని