అలా చూడొద్దు!

గురునానక్‌ పర్యటనలో భాగంగా ఆగ్రా నగరానికి చేరుకున్నారు. ఆయన వెంట మరికొందరు శిష్యులున్నారు.

Published : 25 Jul 2019 00:33 IST

బోధివృక్షం

గురునానక్‌ పర్యటనలో భాగంగా ఆగ్రా నగరానికి చేరుకున్నారు. ఆయన వెంట మరికొందరు శిష్యులున్నారు.
ఆగ్రాలో ముకుందరాయ్‌ అనే ధనిక వజ్రాల వ్యాపారి ఉండేవాడు. అతడు చాలా ఆస్తులు కూడబెట్టాడు. అప్పుడప్పుడు కొన్ని ధర్మకార్యాలు చేస్తుండేవాడు. మహాత్ములు వచ్చినప్పుడు ఆర్భాటంగా మర్యాదలు చేసేవాడు.
గురునానక్‌ దేవ్‌ను కూడా వినయంగా తన ఆతిథ్యం స్వీకరించాల్సిందిగా ప్రార్థించాడు ముకుందరాయ్‌. సర్వజ్ఞుడైన గురునానక్‌ ఆ గృహ పరిస్థితి గ్రహించారు.
ముకుందరాయ్‌కి ముగ్గురు అందమైన భార్యలున్నారు. కానీ అనుమానం వల్ల వారిని ఎన్నడూ బయటకు రానిచ్చేవాడు కాదు. బంగారు పంజరాల్లో చిలకల్లా వారు ముగ్గురూ దుర్భర జీవితం గడుపుతుండేవారు. ఆ విషయం స్థానిక శిష్యుల ద్వారా గురునానక్‌కి తెలిసింది. ముకుందరాయ్‌లో మార్పు తీసుకురావడానికి అతని ఆతిధ్యాన్ని గురునానక్‌ అంగీకరించారు.
ఆ సాయంత్రం నానక్‌కి, ఆయన శిష్యులకు ముకుందరాయ్‌ ఇంట్లో ఘనస్వాగతం లభించింది. భోజనశాలలో వారిని ఆశీనులను చేసి భార్యలకు బదులు తానే స్వయంగా వడ్డన చేస్తున్న ముకుందరాయ్‌ని నానక్‌ వారించారు.
‘ఓ ఉత్తమ గృహస్థుడా! అతిథులకు గృహిణి వడ్డించడం మర్యాద. అలా చేయకపోవడం అవమానం. నీ భార్యల చేత అతిథిÅ మర్యాదలు చేయించడం ఇష్టం లేకపోతే మేం వెళ్లిపోతాం’ అని లేచి నిలబడ్డారు.
ముకుందరాయ్‌ కంగారు పడుతూ చేతులు జోడించి ప్రార్థించి నానక్‌ని శాంతింపజేశాడు. భార్యల ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు.
నానక్‌ నవ్వి ‘ముకుందా! బాగా లేనిది వారి ఆరోగ్యం కాదు, నీ మానసిక ఆరోగ్యం. నిన్ను అనుమాన పిశాచం పట్టుకుంది. భార్యలను అనుమానించేవారు, వారిని మానసికంగా హింసిస్తూ మహా పాపం చేస్తుంటారు. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా వారి పాపం తరగదు. నీకు ఇల్లాలు అయినంత మాత్రాన ఆమెను బందీగా చూడకు. ప్రేమ, గౌరవంతో చూడు. వారి స్వేచ్ఛను హరించకు’ అని బోధించాడు. ముకుందరాయ్‌ తన తప్పు గ్రహించాడు. వెంటనే తన భార్యలతో అతిథులకు మర్యాదలు చేయించాడు. ఆనాటి నుంచి భార్యలను సమగౌరవంతో చూశాడు.

-కె.రాఘవేంద్రబాబు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు