వాటి మధ్య తేడా ఉందా?

ఉపాసన, జపం, తపస్సు... ఈ మూడూ వేర్వేరా?

Updated : 31 Dec 2018 16:05 IST

ధర్మ సందేహం

వాటి మధ్య తేడా ఉందా?

ఉపాసన, జపం, తపస్సు... ఈ మూడూ వేర్వేరా?  - నక్కా భక్తవత్సలం, నెల్లూరు

 

మనిషి దైవానుగ్రహం పొందటానికి ఎన్నో మార్గాలున్నాయి. మానవుడు తనలోని దివ్యత్వాన్ని గుర్తించటానికి చేసే ప్రయత్నాలివి. వీటిని ఆధ్యాత్మిక సాధనలు అని వ్యవహరిస్తున్నాము. ఇందులో కొన్ని మార్గాలే ఈ జపము, తపస్సు, ఉపాసన మొదలైనవి. ఉపాసన అనేది ఒకవిధంగా భక్తికి పర్యాయ పదం. ‘యస్య విశ్వ ఉపాసతే’ అని వేదవాక్యం. ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవటం. మనం ఏ ఆధ్యాత్మిక సాధన ప్రారంభించినా మన ఇంటిలో దేవునిపూజా మందిరంలోనో, దేవాలయంలోనో దేవుని ప్రతిమకు దగ్గరగా కూర్చుంటాం. అదే సమయంలో మనసు కూడా దైవచింతనతో ఉంటే (మనిషితో పాటు మనసూ దేవునికి దగ్గరగా ఉంటే) ‘ఉపాసన’ సార్థకమవుతుంది. ఇక ‘జపము’ అంటే ఒక దైవరూపాన్ని మనసులో భావిస్తూ ఆ దైవానికి చెందిన మంత్రాన్ని ప్రతిరోజూ నియమితమైన సమయంలో ఉచ్చరించటం. ఇలా నిరంతరం చేయగా ఆ దైవరూపం హృదయంలో స్థిరపడి పవిత్రమైన భావాలు ఏర్పడతాయి. అందుకే ‘జపతో నాస్తి పాతకం’ అన్నారు పెద్దలు. ఈ జపమే మరింత తీవ్రస్థాయిలో సాగితే అది ‘తపస్సు’. నిజానికి తపస్సు అనే మాటకు ‘ఏకాగ్రత’ అని అర్థం చెప్పవచ్చు. ‘‘ఎందరో మహనీయులు మన దేశ స్వాతంత్య్రం కోసం తపించారు’’ అంటే ఒకే లక్ష్యంతో మనసును ఏకాగ్రం చేసి ప్రయత్నించారు అని అర్థం. ఇంద్రియాలు అటూ ఇటూ జరిగిపోకుండా మనసుకు లోబడి, ఆ మనసు పరమాత్మయందు లగ్నం కావటం తపస్సు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని