ఏమున్నా... లేకున్నా!

బౌద్ధధర్మంపై ప్రజలు విపరీతంగా ఆకర్షితులవుతున్న రోజులవి... అందుకు విరుద్ధమైన ధర్మపీఠ గురువులు.. ఒక వ్యక్తిని, బుద్ధుడికి శిష్యుడిగా చేరి ఆనుపానులు తెలుసుకు రమ్మని పంపారు. ఆవ్యక్తి పేరు విరుద్ధుడు. పేరుకు తగినట్ట్టే ప్రతి విషయాన్నీ వక్రంగా చూసేవాడతను.

Published : 16 May 2019 00:04 IST

ఈనెల18 బుద్ధ పూర్ణిమ
బోధివృక్షం

బౌద్ధధర్మంపై ప్రజలు విపరీతంగా ఆకర్షితులవుతున్న రోజులవి... అందుకు విరుద్ధమైన ధర్మపీఠ గురువులు.. ఒక వ్యక్తిని, బుద్ధుడికి శిష్యుడిగా చేరి ఆనుపానులు తెలుసుకు రమ్మని పంపారు. ఆవ్యక్తి పేరు విరుద్ధుడు. పేరుకు తగినట్ట్టే ప్రతి విషయాన్నీ వక్రంగా చూసేవాడతను. ప్రతిదానికీ విరుద్ధంగా వ్యవహరించేవాడు. సరిగ్గా అలాంటి వ్యక్తితోనే బుద్ధుడి ఆట కట్టించవచ్చని వైరివర్గం వాళ్లు ఆలోచించారు. అతడికి బాగా ధనం ఆశపెట్టి బుద్ధుడి దగ్గర ఎలా మసలుకోవాలో చెప్పిపంపారు.విరుద్ధుడి బుద్ధి కూడా అలాంటిదే కావడంతో ఈ వ్యవహారం అతడికి బాగా నచ్చింది. వెంటనే విరుద్ధుడు బౌద్ధ విహారానికి వెళ్లాడు. ఎంతో వినయం నటిస్తూ తనని కూడా ఈ ధర్మంలో చేర్చుకోమని ప్రార్థించాడు. బుద్ధుడు కొన్ని క్షణాలు విరుద్ధుడికేసితదేకంగా చూశాడు. అతనిలో అంతఃశుద్ధి లేదని గ్రహించాడు. నిజానికి అలాంటి వారికే జ్ఞానబోధ అవసరమని బుద్ధుడి అభిప్రాయం. రోగికి తప్పనిసరిగా చికిత్స చేయాల్సిందే కదా... విరుద్ధుడికి బౌద్ధదీక్ష ఇచ్చారు. తర్వాత అతను శిష్యులతో కలిసిపోయాడు. ఎంతో శ్రద్ధ నటిస్తూ బుద్ధుడి బోధలు వినేవాడు. ఇలా కొన్నాళ్లు గడిచింది. ఒకనాడు బుద్ధుడు ఉదయాన్నే శిష్యులకు వైరాగ్యబోధ చేస్తున్నాడు. ‘మమకారాన్ని వదులుకోవడమే వైరాగ్యం. మనుషులు, వస్తువులు, చివరకు పెంపుడు ప్రాణులపై మమకారం మన సాధనకు ఆటంకం కలిగిస్తుంది. మనం చేయాల్సింది కేవలం కర్తవ్యపాలన. దాన్ని మమకారంతో జతచేయకూడదు. జ్ఞానాన్ని, ధ]ర్మాన్ని, సంఘాన్ని నిస్వార్థ బుద్ధితో సేవించడమే బౌద్ధ ధర్మం’ విరుద్ధుడు ప్రతి బోధ  సమయంలో కొన్ని వింత సందేహాలు అడిగేవాడు. అతని ధోరణి ఇతర శిష్యులకు చికాకు కలిగించేది. ఒక్కోమారు అతన్ని చాటుగా దండిద్దామా... అన్నంతగా వాళ్లకు కోపం వచ్చేది. అయినా తమాయించుకునేవాళ్లు. ఆరోజు కూడా విరుద్ధుడు అడిగిన అసందర్భ సందేహాలకు బుద్ధుడు ఎంతో సహనంతో, మందహాసంతో సమాధానాలిచ్చాడు. బోధ ముగిసింది. బుద్ధుడు భిక్షాటనకు వెళ్లే సమయం అయింది. కానీ ఆయన భిక్షాపాత్ర కనిపించలేదు. దాన్ని విరుద్ధుడే దాచాడు. బుద్ధుడిలో వైరాగ్యం ఎంతుందో చూడాలనిపించి అలా చేశాడు. అయితే బుద్ధుడు యథాప్రకారం భిక్షకు బయల్దేరాడు. ఆయన చేతిలో చిన్న ఆకు దొన్నె ఉంది. అందులోనే భిక్ష స్వీకరించి విహారానికి తిరిగివచ్చాడు. అందులోని ఆహారాన్ని పక్షులకు తినిపించి, మిగిలిన దాన్ని తాను భుజించాడు. విరుద్ధుడికి బుద్ధుడి గొప్పతనం తెలిసివచ్చింది. తన భిక్షాపాత్ర కోసం ఆయన ఆసక్తి చూపలేదు. ఏమీ ఎరగనట్లే తన కర్తవ్యాన్ని అమలు చేశాడు. ఆరాత్రి ఏకాంతంగా ఉన్న గురువు వద్దకు వెళ్లాడు విరుద్ధుడు. భిక్షాపాత్ర పాదాల దగ్గర ఉంచి తాను ఎందుకు వచ్చిందీ, ఎవరు పంపిందీ పశ్చాత్తాప పడుతూ కన్నీళ్లతో వివరించాడు. ‘భగవాన్‌ ! ఈక్షణం నుంచి నేను గత బంధాలను తెంచేసుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి’ అంటూ భక్తితో ప్రణమిల్లాడు. బుద్ధభగవానుడు ప్రసన్న వదనంతో చెయ్యెత్తి ఆశీర్వదించాడు. జ్ఞానానికి వైరాగ్యమే తొలిమెట్టు అని వివరించాడు.

- కె.రాఘవేంద్రబాబు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు