ఢమరుకం మోగ...శ్రీశిఖరమూగ!

ఢమ ఢమ ఢమ ఢమ... ఢమరుక శబ్దాలు, భేరీనాదాలు,నమశ్శివాయ నినాదాలు...ఆనంద తాండవాలు...భక్తజన సముద్రాలు...అవి భ్రమరాంబసమేత మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు...నందీశ్వరుడు ధ్వజమై ఎగరగా...చండీశ్వరుడు ముందుండి నడవగా...ప్రమథ గణాలు పాంచజన్యాలు పూరించగా...అత్యంత కోలాహలంగా జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతి ఘట్టం ప్రత్యేకం...ప్రతి సన్నివేశం అపురూపం!...

Updated : 08 Jul 2021 19:29 IST

ఈ నెల 14 నుంచి శ్రీశైల బ్రహ్మోత్సవాలు

ఢమ ఢమ ఢమ ఢమ... ఢమరుక శబ్దాలు, భేరీనాదాలు,

నమశ్శివాయ నినాదాలు...

ఆనంద తాండవాలు...

భక్తజన సముద్రాలు...

అవి భ్రమరాంబసమేత మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు...

నందీశ్వరుడు ధ్వజమై ఎగరగా...

చండీశ్వరుడు ముందుండి నడవగా...

ప్రమథ గణాలు పాంచజన్యాలు పూరించగా...

అత్యంత కోలాహలంగా జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతి ఘట్టం ప్రత్యేకం...

ప్రతి సన్నివేశం అపురూపం!

స్థలం - శ్రీశైలం

శివుడు - మల్లికార్జునస్వామి

పార్వతీదేవి - భ్రమరాంబాదేవి

ఈ ఆది దంపతులకు నిత్య, వార, మాస, సంవత్సర ఉత్సవాలెన్నో జరుగుతాయి. వాటన్నింటిలో మహాశివరాత్రి సందర్భంగా మాఘమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు అతి ముఖ్యమైనవి. పరమశివుడు లింగరూపుడుగా ఆవిర్భవించే మహా ఘట్టంలో జరిగే అద్భుత వేడుకలివి.

వాహన సేవలు

బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు నుంచి రోజూ సాయంత్రం మల్లికార్జునస్వామి, భ్రమరాంబాదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులు రోజుకొక్క వాహనం అధిరోహించి తిరువీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. అంతకు ముందు ఉత్సవ మూర్తులను ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉంచి పూజలు చేస్తారు. ఈ సేవల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. శివనామస్మరణతో శ్రీశైలం మార్మోగుతుంది.

తొలిరోజు

* శ్రీశైల మహాక్షేత్రంలో ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి సందర్భంగా ఒకసారి, మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా రెండోసారి జరుగుతాయి. సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షతో ఏడు రోజుల పాటు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు నిర్వహిస్తారు.

* ఇక్కడ జరిగే ఉత్సవాలను బ్రహ్మదేవుడు స్వయంగా నిర్వహిస్తాడని భక్తులు నమ్ముతారు. క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి పర్యవేక్షణలో, శివపరివార దేవతల్లో ఒకడైన చండీశ్వరుడు సారథ్యం వహిస్తాడని చెబుతారు.

తొలిరోజు ఉదయం అర్చకులు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా యాగశాలలో ప్రవేశించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. ముందుగా ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగాలని వినాయకుడిని పూజించి, సంకల్పం చెబుతారు. వేడుకలకు సారథ్యం వహించమని చండీశ్వరుడిని ఆహ్వానిస్తారు.

* చండీశ్వరుడి పూజల తర్వాత అర్చకస్వామలు, ఆలయ అధికారులు కంకణాలు ధరిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వివిధ వైదిక కర్మలను నిర్వహించమని కోరుతూ రుత్వికులకు దీక్షా వస్త్రాలను అందజేసి, ఆహ్వానిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆచార్యవరణం అని పిలుస్తారు. అదేరోజు సాయంత్రం ఆలయప్రాంగణంలో నిర్ణీత పవిత్ర ప్రాంతంలోకి వెళ్లి, అక్కడి మట్టిని సేకరిస్తారు. దాన్ని తొమ్మిది పాలికల్లో వేసి, నవధాన్యాలను పోసి ప్రతిష్ఠిస్తారు.

* బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు సాయంత్రం ధ్వజారోహణం జరుగుతుంది. నూతన వస్త్రంపై నందీశ్వరుడి చిత్రాన్ని వేస్తారు. దీన్నే నంది ధ్వజం అంటారు. దీన్ని ఊరేగింపుగా ధ్వజస్తంభం దగ్గరకు తీసుకొచ్చి చండీశ్వరుడి సమక్షంలో పూజలు చేస్తారు. తర్వాత భేరీపూజ జరుగుతుంది. సంగీత వాయిద్యాల్లో ఒకటైన డోలుకు చేసేదే భేరీపూజ. తర్వాత నాదస్వరంతో వివిధ రాగాలను ఆలపిస్తూ వివిధ దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఇక ధ్వజస్తంభంపై నంది ధ్వజాన్ని ఎగరేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.●

ఎనిమిదో రోజు

పదకొండురోజులు సాగే బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ప్రధానమైంది. ఆ రోజు మహాశివరాత్రి. నాటి సాయంత్రం స్వామికి ప్రభోత్సవం జరుగుతుంది. రాత్రి ఏడు గంటల వరకు స్వామి దేవేరి సమేతుడై దివ్యమైన అలంకారాలతో తనకు అత్యంత ఇష్టమైన నంది వాహనంపై ఊరేగుతారు. భక్తులకు నయనానందాన్ని కలిగిస్తారు. రాత్రి పదిగంటల తర్వాత మల్లికార్జునస్వామికి లింగోద్భవకాల మహారుద్రాభిషేకం చేస్తారు. పదకొండు మంది వేద పండితులు ఏకకాలంలో మహాన్యాసపూర్వకంగా నిరంతరాయంగా రుద్రాన్ని పఠిస్తుండగా ఈ అభిషేకం జరుగుతుంది. పవిత్ర జలాలతో, పంచామృతాలతో, వివిధ ఫలోదకాలతో మూడు గంటల పాటు దీన్ని నిర్వహిస్తారు.

* వివాహ సమయంలో పెళ్లికుమారుడి తలకు చుట్టేది తలపాగా. ఈ అలంకారమే శ్రీశైలంలోనూ ఉంటుంది. కాకుంటే అది పరమశివుడికి కాదు ఆలయానికి. దేశంలో ఎక్కడా లేని ఆచారమిది. ఆలయంలో కొలువుదీరిన అర్చారూపమే కాదు ఆలయం కూడా స్వామివారి విరాట్‌రూపమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ భావనకు నిదర్శనంగా నిలుస్తుంది శ్రీశైలంలో జరిగే వేడుక. మహాశివరాత్రి నాటి రాత్రి గర్భాలయంలో రుద్రాభిషేకం జరుగుతుండగా, ఆలయంపై పాగాలంకరణ జరుగుతుంది. గర్భాలయ శిఖరం నుంచి ముఖమండపం పైభాగంలో ఉన్న నందులను కలుపుతూ వస్త్రాన్ని అలంకరిస్తారు. ఈ పాగా తయారీ కూడా ఆసక్తికరమే. 365 మూరల పొడవున్న వస్త్రాన్ని రోజుకొక్క మూరచొప్పున ఏడాది పాటు నియమనిష్ఠలతో తయారుచేస్తారు. పాగాలంకరణ చేసే వ్యక్తి దిగంబరుడై అలంకరిస్తాడు. అందుకే ఆ సమయంలో ఆలయంలో విద్యుత్తు సరఫరా నిలిపేస్తారు. ‘ఓంనమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని భక్తులు పారాయణ చేస్తుండగా... ఆ నాదంతో ఆలయ ప్రాంగణం మార్మోగుతుండగా చీకట్లో ఈ అలంకరణ జరుగుతుంది. ●

శ్రీశైలంలో పరమశివుడికి నిత్యం కల్యాణోత్సవం జరుగుతున్నా మహా శివరాత్రినాటి రాత్రి పాగాలంకరణ తర్వాత జరిగే కల్యాణం ప్రత్యేకమైంది. స్వామివారు తలపై ఒకవైపు గంగమ్మను, మరోవైపు నెలవంకను, మెడలో రుద్రాక్షలను, పట్టువస్త్రాలను ధరించి నయనానందకరంగా తయారవుతారు. అమ్మవారు బుగ్గన చుక్కతో, స్వర్ణాభరణాలు, పట్టుచీర ధరించి స్వామికి సరిజోడుగా తయారవుతుంది. వేదమంత్రాల మధ్య సంప్రదాయబద్ధంగా ఈ వేడుక జరుగుతుంది.

తొమ్మిదో రోజు

మహాశివరాత్రి మరుసటి రోజు సాయంత్రం సదస్యం జరుగుతుంది. స్వామి, అమ్మవార్లను వేదమంత్రాలతో స్తుతిస్తారు. అనంతరం జరిగే నాగవల్లి కార్యక్రమంలో అమ్మవారికి నల్లపూసలు, మెట్టెలు అలంకరిస్తారు. అనంతరం రథోత్సవం, అదే రోజు రాత్రి తెప్పోత్సవం వైభవంగా జరుగుతాయి.

పదో రోజు

ఆ తర్వాతి రోజు త్రిశూలస్నానం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు సారథ్యంవహించే చండీశ్వరుడికి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. అదే రోజు సాయంత్రం నంది ధ్వజాన్ని అవరోహణం చేస్తారు.

పదకొండో రోజు

చివరి రోజు అశ్వవాహనాన్ని అధిరోహించి స్వామి క్షేత్ర పర్యటన చేస్తారు. తర్వాత పుష్పోత్సవం జరుగుతుంది. 18 రకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అర్చిస్తారు. నాటి రాత్రి ఏకాంతసేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

- ఐ.ఎల్‌.ఎన్‌.చంద్రశేఖరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని