శ్రీకాళహస్తికి వరమిచ్చాడు

శ్రీకాళహస్తి...ఈ క్షేత్రం పేరులోనే చరిత్ర ఉంది. ఇందులో శ్రీ అంటే సాలె పురుగు. కాళ అంటే పాము.. హస్తి అంటే ఏనుగు.. ఈ మూడు జీవుల పేర్లతోనే ఈ పేరొచ్చింది. ఇందుకు స్థలపురాణంగా పేర్కొనే ప్రత్యేక కథ ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అడవి....

Updated : 13 Feb 2020 01:01 IST

కన్నప్పను కరుణించాడు
ఈనెల 16 నుంచి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు

శ్రీకాళహస్తి...ఈ క్షేత్రం పేరులోనే చరిత్ర ఉంది. ఇందులో శ్రీ అంటే సాలె పురుగు. కాళ అంటే పాము.. హస్తి అంటే ఏనుగు.. ఈ మూడు జీవుల పేర్లతోనే ఈ పేరొచ్చింది. ఇందుకు స్థలపురాణంగా పేర్కొనే ప్రత్యేక కథ ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అడవి.  ఇక్కడ వాయులింగరూపుడై ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు సాలె పురుగు, పాము, ఏనుగు పోటీపడ్డాయి.  ఒక దానికి¨ తెలియకుండా మరొకటి స్వామిని జలం, పూలు, పండ్లతో అర్చించేవి. ఈ క్రమంలో మూడూ విభేదించాయి. అలా ఒక దానిపై ఒకటి దాడిచేసుకుని మూడు జీవులూ తనువు చాలించాయి.  వాటి భక్తిని మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై మూడింటికి ముక్తిని ప్రసాదిస్తారు. అలా మూగజీవుల ముక్తిధామంగా ఈ క్షేత్రం పేరొందింది.
‘‘కైలాసవాసీ భగవాన్‌ శ్రీకాళహస్తీశ్వరశ్శివః
కరోతు నిత్య కల్యాణం కరుణావరుణాలయః!!’’

తొలిపూజ భక్తుడికే
శ్రీకాళహస్తి క్షేత్రంలో తొలిపూజ భగవంతుడికి కాకుండా భక్తుడికి దక్కుతోంది. ఏటా జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొలుత కన్నప్ప ధ్వజారోహణం జరుగుతుంది. మరుసటి రోజు స్వామి పూజాదికాలు ప్రారంభమవుతాయి. ఆలయంలో ఏ పూజ జరిగినా ప్రథమ ప్రాధాన్యం కన్నప్పకే.  అంతరాలయంలోని పరివార దేవతల వరసలో భక్తకన్నప్ప నిలువెత్తు విగ్రహం దర్శనమిస్తుంది.
ఉచ్ఛ్వాస నిశ్వాస!
గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం..   పంచభూతాత్మకమైన అయిదు లింగాలు మన దేశంలో ఉన్నాయి. అందులో శ్రీకాళహస్తిలో ఉంది వాయులింగం.  వాయువు అంటే ప్రాణశక్తి. దీనికి నిదర్శనం మనం ఇక్కడి గర్భాలయంలో చూడొచ్చు. అక్కడకు గాలి ప్రవేశించే అవకాశం ఉండదు. కాబట్టి ఆలయంలో ఉన్న అన్ని దీపాలు నిశ్చలంగా వెలుగుతుంటాయి. అయితే, లింగానికి కుడివైపు ఉన్న రెండు దీపాలు మాత్రం క్రమ పద్ధతిలో కదులుతుంటాయి. ఆ కదలిక  స్వామి ఉచ్ఛ్వాసనిశ్వాసలకు ప్రతీకలుగా రుత్వికులు చెబుతుంటారు.

అలంకరణ అక్కడే
రుత్వికులు శ్రీకాళహస్తీశ్వర లింగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరు. ఎలాంటి అలంకరణలూ చేయరు. లింగానికి ముందుభాగంలో కాస్త దూరంగా నవగ్రహ కవచాన్ని వేలాడదీస్తారు. అలంకరణలన్నీ ఆ కవచానికే. ఏ ఆలయంలో అయినా సవ్య దిశలో ప్రదక్షిణ చేసి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటారు. ఇక్కడ మాత్రం అపసవ్య దిశలో చేస్తారు.
తనపై ఆ జీవులు
లింగం అడుగుభాగాన సాలెపురుగు గుర్తు ఉంటుంది. ఆ పై ఏనుగుదంతాల ఆకృతి కనిపిస్తుంది. లింగ శిఖర భాగంలో పాము పడగలు దర్శనమిస్తాయి. అంటే మూడు మూగజీవులకు స్వామి తనలోనే చోటు ఇచ్చారనడానికి ఇదే నిదర్శనం.
గ్రహణాలు ఉండవు
పరమేశ్వరుడికి ఇక్కడ నవగ్రహ కవచం ఉంటుంది. పైగా ఇక్కడ స్వామి శిఖర భాగంలో సర్ప రూపం ఉంటుంది. అందుకే కాళహస్తిని గ్రహణాతీత క్షేత్రంగా భావిస్తుంటార.

 


ధూర్జటి తపస్సు...
శ్రీకృష్ణదేవరాయలంతటివాడి ఆదరణ...  
మహాకవిగా బిరుదు, గొప్ప పేరు ప్రఖ్యాతులు...
అపారమైన సంపద...
దాసదాసీ జనం. కోరుకున్నన్ని విలాసాలు.
కానీ... ఏదో వెలితి.
కాలం గడుస్తోంది.
శరీరం వడలుతోంది.
ఇంతకాలం తనవి అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వదలి పోతున్నాయి...
అశాంతి? అంతులేని అలజడి?
మరి ఏది శాశ్వతం..
ఎక్కడుంది సత్యపథం...
ఇవి ధూర్జటి మనసును మెలిపెడుతున్న ఆలోచనలు
విషయవాంఛలతో సమయం వృథా చేసుకున్నానన్న నిలవనీయడం లేదు.
తాను అనుభవించిన సంతోషాలన్నీ క్షణికాలని గుర్తించాడు. చింతించాల్సింది, చేరుకోవాల్సింది పరమేశ్వరుడి పాదాలు మాత్రమేనని గుర్తించాడు.
మాయామోహాన్ని ఛేదించుకునే శక్తిని ప్రసాదించమని పరమేశ్వరుడిని ప్రార్థించాడు.  

తండ్రీ!
జానెడు పొట్ట కోసం ఇంత ఆరాట పడుతున్నాం...
నీ పేరు తలిస్తే చాలదా ఆకలి తీరడానికి.
భక్తి, ధ్యానం, తపస్సు ఇవన్నీ మేం ప్రకటించే బాహ్యరూపాలు మాత్రమేనయ్యా...
నీ పాదాల మీద ఒక్క క్షణం త్రికరణ శుద్ధిగా మనస్సు నిలిపితే చాలదా
వేయి జన్మల తపఃఫలం రావడానికి..
శ్రీ కాళహస్తీశ్వరా..!
ఏ వేదంబు పఠించె లూత
భుజగంబేశాస్త్రమ్ముల్సూచె తా
నే విద్యాభ్యాసనంబొనర్చె కరి
చెంచే మంత్రమూహించే...
సాలెపురుగు ఏ వేదం చదివింది.
సర్పం ఏశాస్త్రాలు అధ్యయనం చేసింది...
ఏనుగు ఎన్ని ఆధ్యాత్మిక విద్యలు నేర్చుకుంది...
నిర్మలమైన హృదయంతో, నిజమైన భక్తితో
కొలిచినంతనే ఆ మూగజీవులను కరుణించావు...
తిన్నడు ‘శివయ్యా’ అని పిలిచినంతనే
పరుగుపరుగున వచ్చావు.
నిన్ను కీర్తించడానికి ఏ పురాణాలు చదవనవసరం లేదు,
అద్భుతమైన విమాన గోపురాలు నిర్మించాల్సిన పని లేదు.
మణిమాణిక్యాలతో అలంకారాలూ నీకవసరంలేదు.
పరిమళద్రవ్యాలూ నువ్వు కోరుకోవు.
కావాల్సింది గుండె చప్పుడు. హృదయాంతరాళాల్లో నుంచి నీ నామ స్మరణ...
మహేశ్వరా! ఇక పరీక్ష ఆపి నన్ను నీ అక్కున చేర్చుకోవయ్యా...
.. అంటూ తనువును, మనసును అర్పణ చేసుకున్నాడు...
ఆ పరమభక్తుడు చేసిన ప్రార్థన యావజ్జాతికి మహోపకారం చేసింది. మనిషిగా పుట్టిన తర్వాత జీవి ఏం కోరుకోవాలో, ఏం చేయాలో, అంతిమంగా అతని స్థానం ఏంటో చూపించింది.  
ఆ భక్తుడు మహాకవి ధూర్జటి. ఆ ప్రార్థన శ్రీకాళహస్తీశ్వర శతకం.  
నిజమైన భక్తి, వైరాగ్యాలకు నిర్వచనంలా నిలుస్తోందీ శతకం.

 


మాయ వద్దు
అంతా మిధ్య తలంచి చూచిన నరుండట్లౌ టెఱింగిన్‌ సదా
కాంత్పుత్రులు నర్ధమున్‌ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతిం జెంది జరించు గాని పరమార్ధంబైన నీయందు దా
జింతాకంతయు జింత నిల్పడుగదా శ్రీ కాళహస్తీశ్వరా!
మనిషి మనసు చాలా విచిత్రంగా ఉంటుంది. తన కళ్లముందు జరిగిన సంఘటనలన్నీ చూస్తూ కూడా ఆ మాయలో చిక్కుకుంటాడు. పరమాత్మ పాదాలపై  కొద్దిసేపు కూడా తన మనస్సును నిలపలేకపోతాడు. ఇదంతా మాయ. వీటి నుంచి బయటకు వస్తేనే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది.


పుత్రులు లేరని...
కొడుకుల్‌ పుట్టరటంచు నేడ్తురవివేకుల్‌ జీవనభ్రాంతులై
కొడుకుల్‌ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్‌ వారిచే నేగతుల్‌
వడసెం బుత్రు లేని యా శుకునకున్‌ బాటిల్లెనే దుర్గతుల్‌!
చెడునే మోక్షపద మపుత్రకునకున్‌ శ్రీ కాళహస్తీశ్వరా !  
పుత్రసంతానం లేకపోతే ఉత్తమగతులు కలగవనే భ్రాంతితో బతుకుతున్నారు. కురు రాజైన ధృతరాష్ట్రుడికి వంద మంది కుమారులు పుట్టినా ఫలితం లేదు. పుత్రులు లేని శుకమహర్షి మాత్రం మోక్షాన్ని పొందాడు. కైవల్యం చేరుకోవాంటే త్రికరణశుద్ధిగా ఉండే భక్తి కావాలే తప్ప పుత్రులు కాదంటాడు ధూర్జటి.


భయంఎందుకు?
నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,
జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు పై
కొననీ, జ్ఞానముగల్గనీ, గ్రహగతుల్‌ కుందింపనీ, మేలు వ
చ్చిన రానీ, యవి నాకు భూషణములే, శ్రీకాళహస్తీశ్వరా!  
ఒక్కోసారి భగవంతుడే భక్తుల్ని అనేకవిధాలుగా పరీక్షిస్తాడు. అంతులేని భోగాలు, అంతే స్థాయిలో కష్టాలు కలిగిస్తాడు. ఇవన్నీ పరమేశ్వరుడి పరీక్షలుగానే భావించాలి. కష్టమైనా, సుఖమైనా, ఆనందమైనా, విచారమైనా అన్నిటినీ సమానంగా స్వీకరించి, ఎటువంటి మాయకు లోనుకాకుండా పరమేశ్వరుడిని ఉపాసించాలి.

 


చంచలతత్వం వదిలెయ్‌...
రోసీ రోయదు కామినీ జను తారుణ్యోరు సౌఖ్యంబున్‌,
బాసీ పయదు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి, వాంఛాలతల్‌
కోసీ కోయదు నా మనంబకట! నీకున్‌ బ్రీతిగా సత్క్రియల్‌
చేసీ చేయదు, దీని త్రుళ్ళణచవే శ్రీకాళహసీశ్వరా!  
ఎన్ని హితబోధలు చేసినా కోతిలాంటి మనస్సుకు చంచల స్వభావం వదలిపోదు. కాంతా సౌఖ్యాలు, పుత్ర మిత్ర బాంధవ్యాలు, ఇంకా ఎన్నో కోరికలు...  ఏ ఒక్కటినీ విడిచిపెట్టడానికి మనస్సు ఇష్టపడదు. నిజమైన భక్తుడు వీటికి లొంగిపోకూడదు. వీటన్నిటికీ అతీతంగా నిలబడితేనే శివానుగ్రహం లభిస్తుంది.

- కప్పగంతు రామకృష్ణ, గాలి సురేష్‌


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని