వేదం చెప్పింది విజయీభవ!

వేద పురుషుడు బ్రహ్మం. కాలం వేద పురుషమయం... అన్నారు పెద్దలు.  వేదం ఏం చెబుతుందో వింటే జీవిత పరమావధి అర్ధమవుతుంది. రాబోయే కాలంలో ఏం చేయాలో తెలుస్తుంది. నూతన సంవత్సరం ఆగమిస్తున్న వేళ...జీవన మార్గదర్శక సూత్రాల్లాంటి వేద మంత్రాల సారాన్ని తెలుసుకుందామా? ‘ఓమ్‌ భద్రం కర్ణేభిః శృణుయామ దేవాభద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరజ్ఞై స్తుష్టువాస్తనూభిర్వ్యశేవ దేవహితం యదాయుః..

Updated : 31 Dec 2020 01:07 IST

వేద పురుషుడు బ్రహ్మం. కాలం వేద పురుషమయం... అన్నారు పెద్దలు.  వేదం ఏం చెబుతుందో వింటే జీవిత పరమావధి అర్ధమవుతుంది. రాబోయే కాలంలో ఏం చేయాలో తెలుస్తుంది. నూతన సంవత్సరం ఆగమిస్తున్న వేళ...జీవన మార్గదర్శక సూత్రాల్లాంటి వేద మంత్రాల సారాన్ని తెలుసుకుందామా?

‘ఓమ్‌ భద్రం కర్ణేభిః శృణుయామ దేవాభద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః
స్థిరైరజ్ఞై స్తుష్టువాస్తనూభిర్వ్యశేవ దేవహితం యదాయుః..

- అధర్వ వేద భాగమైన మాండూక్యోపనిషత్తులో శాంతి మంత్రం
ఇందులో భద్రం అనే పదానికి శుభం అని అర్ధం. ఓ దేవతలారా! మా చెవులు ఎప్పుడూ శుభాలనే వింటూ ఉండేలా అనుగ్రహించండి. మా కళ్లు సర్వకాల సర్వావస్థలలోనూ శుభాలనే చూసేలా ఆశీర్వదించండి. ఇంద్రుడు, సూర్యుడు, గరుత్మంతుడు బృహస్పతి మాకు రక్షను, బలాన్ని ఇచ్చేలా కరుణించండి. మాకు నిర్దేశించిన ఆయువు ఉన్నంత వరకు మేం మంచి శుభకార్యాలనే చేస్తూ జీవించి ఉండాలి. అనేది ఈ మంత్ర అంతరార్ధం. ఇక్కడ ఆయువు విషయాన్ని త ప్రస్తావించడం వెనక ఓ అంతరార్థం ఉంది. చిన్నచిన్న సమస్యలొచ్చాయని భయపడి జీవితాన్ని మధ్యలో ముగించడమంటే దేవతలను తిరస్కరించటమే. అందుకే బలవన్మరణమనేది పాపమని అర్థం చేసుకోవాలి. ప్రతి సమస్యకూ ఓ సమాధానం ఉంటుంది. దాన్ని వెతకాలి తప్ప బలవన్మరణం వైపు అడుగులేయడం సరైన పని కానేకాదు. సంపూర్ణ ఆయుష్కాలమంతా సమాజానికి శుభాలను చెయ్యడానికే ఉపయోగపడేలా చూడమని దేవతలను వేడుకోవడడం ఇక్కడ ముఖ్యాంశం.

కాలగతిలో ఓ చిత్రమైన విషయం ఏంటంటే కొత్త విషయాలపై మోజు బలపడుతుంది. పాతవాటితో అనుబంధం పూర్తిగా తెగిపోదు. ఈ పాత, కొత్తల మధ్య పరిమళభరితమైన వంతెన నిర్మించుకోవాలి. పాత అనుభవాల పునాదులపై కొత్త ఆశలు, ఆశయాల సౌధాలను నిర్మించుకోవాలి.

‘ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్నిబోధత
క్షురస్యధారా నిశితా దురత్యయా దుర్గ పథస్తత్కవయో వదన్తి’

-కఠోపనిషత్తు మొదటి అధ్యాయం మూడో వల్లి పధ్నాలుగో మంత్రం
మానవులారా! మేల్కోండి. అవిద్య అనే నిద్ర నుంచి మేల్కొనేందుకు ఉత్తముల సాంగత్యం చేయండి. పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకోండి...ఇది పై మంత్ర సారం. దీని ప్రకారం నడుచుకుంటే బద్ధకం వదులుతుంది. మానవత్వం నిండిన మనిషిగా ఎదగాలన్న ఆలోచన కలుగుతుంది. అలా తత్త్వజ్ఞానం తెలిసిన మనుషులున్న సమాజం శాంతిమయం అయి తీరుతుంది.


‘ఆత్మానగ్‌ం రథినం విద్ది శరీరగ్‌ం రథమేవతు
బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ’

- కఠోపనిషత్తు మొదటి అధ్యాయం మూడో వల్లిలో మూడో సూత్రం
జీవన రథానికి బుద్ధిని సారథిగా చేసుకోవాలి. మనస్సును పగ్గంగా పట్టుకుని ముందుకు సాగాలి. సరైన సారథి ఉన్నప్పుడే రథం సక్రమంగా సాగుతుంది. ఆ సారథి కూడా పగ్గాన్ని పట్టుకోవడంలో నేర్పరితనం కలవాడై ఉండాలి. బుద్ధి, మనసు అనేవి ఎంత నిర్మలంగా, దృఢంగా ఉండాలో చెబుతుందీ మంత్రం.


అగ్ని ర్వాగ్భూత్వా ముఖం ప్రావిశద్వాయుః
ప్రాణో భూత్వా నాసికే ప్రావిశ దాదిత్య...

- ఐతరేయబ్రాహ్మణం.
అగ్నిదేవుడు వాక్కు రూపంలో ఉంటాడు. అగ్ని ఎంత పవిత్రమో వాక్కూ అంతే పవిత్రం. అగ్ని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మాట విషయంలో కూడా అలాగే ఉండాలి. ఏమాత్రం తేడా జరిగినా ప్రమాదమే. మాట నిక్కచ్చిగా ఉంటే అదే మంత్రమవుతుంది. ఆచితూచి అందంగా తియ్యగా మాట్లాడితేనే జీవితం సజావుగా సాగుతుంది.


‘యస్తు విజ్ఞానవాన్‌ భవతి యుక్తేన మనసా సదా
,తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వా ఇవ సారథేÇః’

- కఠోపనిషత్తు మొదటి అధ్యాయం మూడో వల్లిలోని ఆరో మంత్రం
మనసు స్వాధీనంలో ఉంటే ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయి.అందుకే అందరూ మనసును స్వాధీనంలో ఉంచుకోవడానికి తగిన ప్రయత్నం చేస్తుండాలి. దీనికోసం సద్గురువులను ఆశ్రయించి సత్ఫలితాలను పొందాలి.

-యల్లాప్రగడ మల్లికార్జునరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని