శబరి కొండపై స్వర్ణ సంబరం

సంక్రాంతి అనగానే అయ్యప్ప భక్తులు తన్మయత్వానికి లోనవుతారు. ఈ రోజు సాయంత్రం శబరిమలకు ఎదురుగా పొన్నంబల మేడుపై జ్యోతి రూపంలో దర్శనమిచ్చే హరిహరసుతుని తలచుకుని భక్త్యావేశాలతో పులకించిపోతారు. మకర సంక్రాంతి రోజంతా శబరిమలలో జరిగే వేడుకలన్నీ ఒక ఎత్తయితే తిరువాభరణాల వేడుక అద్భుతం... అనిర్వచనీయం....

Updated : 14 Jan 2021 14:54 IST

పందళం నుంచి పంబదాకా...

సంక్రాంతి అనగానే అయ్యప్ప భక్తులు తన్మయత్వానికి లోనవుతారు. ఈ రోజు సాయంత్రం శబరిమలకు ఎదురుగా పొన్నంబల మేడుపై జ్యోతి రూపంలో దర్శనమిచ్చే హరిహరసుతుని తలచుకుని భక్త్యావేశాలతో పులకించిపోతారు. మకర సంక్రాంతి రోజంతా శబరిమలలో జరిగే వేడుకలన్నీ ఒక ఎత్తయితే తిరువాభరణాల వేడుక అద్భుతం... అనిర్వచనీయం.

అయ్యప్ప స్వామి స్వయంగా తిరుగాడిన ప్రాంతమే పందళం. అచ్చెన్‌ కోవిల్‌ నది ఇక్కడ ప్రవహిస్తుంటుంది. ఈ నదీ తీరంలో అయ్యప్ప మణికంఠుని పేరుతో 12 ఏళ్ల పాటు నివసించిన పందళ రాజ మందిరాన్ని నేటికీ సందర్శించవచ్చు. మణికంఠుడు తపస్సు చేయాలని నిర్ణయించకున్నాక అతని పట్టాభిషేకం కోసం చేయించిన ఆభరణాలను మకర సంక్రాంతి రోజు మాత్రం ధరిస్తానని తల్లిదండ్రులకు మాట ఇచ్చినట్లు చెబుతారు. శబరిమల దివ్య మందిరంలో మకర సంక్రాంతి సందర్భంగా రాజలాంఛనాలతో పందళ రాజ వంశీయుల ఆధ్వర్యంలో పూజలుజరిగేట్లు అనుగ్రహించాడు. అప్పటి నుంచి సంక్రాంతి సందర్భంగా ఈ వేడుక అత్యంత వైభవంగా జరుగుతోంది.

ఏడాది పొడవునా ఈ తిరువాభరణాలను పందళం రాచమందిరంలో ఉంచుతారు. వీటికి పెద్దఎత్తున భద్రత ఉంటుంది. రాజ వంశీయులు రోజూ వీటికి పూజలు చేస్తుంటారు. ఈ వంశంలోని అతి పెద్ద వ్యక్తిని వళియ రాజు అని పిలుస్తారు. ఈయన ఆధ్వర్యంలో శబరిమల ఆలయంలో మకర సంక్రాంతి ఉత్సవాలను రాజ లాంఛనాలతో కేరళ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ లాంఛనాలు సంక్రాంతికి నాలుగు రోజుల ముందే ప్రారంభమవుతాయి. అప్పటికే పందళం అంతటా పండగ వాతావరణం నెలకొంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది అయ్యప్ప భక్తులు అక్కడకు చేరుకుని ఇరు ముడులు కట్టుకొని ఎదురు చూస్తుంటారు. మొదటిరోజు పందళ రాజు సమక్షంలో ప్యాలెస్‌ లో తిరువాభరణం పెట్టెలకు పూజలు చేశాక అక్కడే ఉన్న వలియ కోయిక్కర్‌ ధర్మశాస్త్ర ఆలయానికి చేర్చి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. ప్రభుత్వ అధికారులు, శబరిమల అధికారులకు పందళరాజు లాంఛనంగా తిరువాభరణాలు అప్పగిస్తారు. మధ్యాహ్న సమయానికి అయ్యప్పను స్వయంగా సేవించుకున్న పరిచారకుల కుటుంబీకులు చేరుకుంటారు. స్వామి వారి తిరువాభరణాల పెట్టెలను మోసే అవకాశం పూర్తిగా వీరికే సొంతం. మంగళ వాయిద్యాల నడుమ ఇరుముడి కట్టుకొన్న స్థానిక భక్తులు ముందుగా బయలుదేరతారు. అనంతరం వలియ రాజు పెట్టెలను సాగనంపుతారు. ఈ ఆభరణాలను పరశురాముడు గరుడ నాగ బంధనం చేసినట్లు చెబుతారు. అందుకే తిరువాభరణాలు సాగినంతమేరా ఓ గరుడ పక్షి ఆకాశంలో చక్కర్లు కొడుతుందని చెబుతారు. ఆకాశంలో గరుత్మంతుడు, నేల మీద అదృశ్య రూపంలో నాగేంద్రుడు రక్షణ బాధ్యత తీసుకుంటారని నమ్ముతారు. ఈ యాత్రని తిరువాభరణ ఘోష యాత్ర అని పిలుస్తారు.  ఈ యాత్ర జరిగినంత మేరా గ్రామాల్లో ప్రజలు ఇంటి ముంగిట దీపం వెలిగించి, పువ్వులతో అలంకరించి స్వాగతం పలుకుతారు. ప్రజలు మహారాజ వంశీయులకు మర్యాదలు చేస్తూ అభిమానం చాటుకొంటారు.

అయిరూర్‌, పెరియాడ్‌, పుంగావనం, నీలక్కల్‌ మీదుగా దట్టమైన అటవీ ప్రాంతంలో అడుగుపెట్టే స్వామి వారి ఆభరణాలకు గిరిజన ప్రజానీకం జేజేలు పలుకుతారు. అట్టతోడు మార్గం మీదుగా శబరిపీఠం చేరాక దేవాలయం దగ్గర నుంచి ఒక బృందం ముందుకు వచ్చి స్వాగతం పలుకుతారు. తిరువాభరణం పెట్టెలు తీసుకొని వచ్చిన వారికి పూల మాలలు వేసి స్వాగతం పలుకుతారు. ఆలయం దగ్గర పూజలు పూర్తవుతున్న  వేళ.. తిరువాభరణం ఊరేగింపు స్వామివారి సన్నిధికి చేరుకుంటుంది. స్వామి వారికి అలంకరించే ఆభరణాలు కలిగిన పెట్టెను పవిత్ర పదునెనిమిది మెట్ల మీదుగా గర్భాలయము కు చేరుస్తారు. అక్కడ మేల్‌ శాంతి చేతుల మీదుగా ఆభరణములను స్వామి వారికి అలంకరిస్తారు. మిగిలిన రెండు ఆభరణముల పెట్టెలను మాలికాపురమ్మ అమ్మవారి గుడి సమీపంలోకి చేరుస్తారు. తిరువాభరణములతో... రాజ ఠీవితో అయ్యప్ప స్వామి అద్భుత కాంతులతో మెరిసిపోతుండగా.... శబరి కొండ కు ఎదురుగా ఉన్న కాంతిమల మీద మకర జ్యోతి రూపంలో స్వామి దర్శనం ఇస్తారు. తరువాత రాత్రివేళ తిరువాభరణములతో స్వామి భక్తులనుఅను గ్రహిస్తారు.

రాత్రి సమయానికి ఈ ఊరేగింపు అయిరూర్‌ పుత్తికావు దేవాలయానికి చేరుకుంటుంది. అయిరూర్‌ లో రాత్రంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. వేల సంఖ్యలో చుట్టు పక్కల గ్రామస్తులు చేసుకొంటారు . స్థానికులు రాత్రంతా అక్కడ అన్నదానం నిర్వహించటం ఆనవాయితీ. తిరువాభరణం పెట్టెలను తెరిచి  ఆభరణములను చూసేందుకు భక్తులను అనుమతిస్తారు. అర్థరాత్రి సమయం దాకా ఇది సాగుతుంది. అక్కడ నుంచి బయలుదేరి భోగి రోజు తెల్లవారే సరికి వడశక్కర చేసుకొంటారు. అక్కడ ఉదయ కాలపు పూజను జరుపుతారు.  ఆరోజు మధ్యాహ్నం పెరియాడ్‌ దేవాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో ఇక్కడ ఉత్సవం ఉంటుంది. భోగి రోజు సాయంత్రానికి  అయ్యేసరికి లాహా ప్రాంతానికి చేరతారు. ఇక్కడ ప్రభుత్వ గెస్ట్‌ హౌస్‌ లో పూర్తి మర్యాద లతో విడిది చేయిస్తారు. పెద్ద ఎత్తున సంగీత వాయిద్యాలతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోతుంది. పెద్ద సంఖ్యలో చేరిన భక్తులతో పండుగ వాతావరణం నెలకొంటుంది. అర్థరాత్రి దాకా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి కొంతమేర స్వామివారి పుంగావనం విహారం జరిపించి అడవిలోకి ప్రవేశిస్తారు. తెల్లవారేసరికి నీలక్కల్‌ శివాలయం కు చేసుకొంటారు. అప్పటికే కొందరు భక్తులు స్వామికి ఇరు ముడులు సమర్పించి నీలక్కల్‌ దగ్గర జ్యోతి దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ భక్తులంతా తిరువాభరణం ఘోష యాత్ర కు జేజేలు పలుకుతారు.  నీలక్కల్‌ మహదేవన్‌ ఆలయం నుంచి తిరువాభరణం ఘోష్‌ యాత్రకు కొత్త ఊపు వచ్చేస్తుంది. కొంత దూరం పాటు యాత్రికుల మార్గంలో ప్రయాణించి అకస్మాత్తుగా అడవి మార్గము లోకి ప్రవేశిస్తుంది. భయంకరమైన అడవి వాతావరణం కళ్ల ముందు నిలుస్తున్న వేళ స్వామి వారి శరణు ఘోష మిన్నంటుతుంది. పంబ నది ఒడ్డున తిరువాభరణం పెట్టెలు తరలుతుంటే ... ఒకప్పుడు అయ్యప్ప స్వామి నడయాడిన నేల మౌన గురుతుగా కనిపిస్తుంది. పంబ నదికి ఒకవైపు అడవుల మధ్య పందళ రాజ పరివారం, దేవాలయ అర్చకులు, ఘోష్‌ యాత్ర నడుస్తుండగా.. పంబ నదికి ఆవలి వైపున మారుమూల అడవులలో జీవించే పూర్తి గిరిజన ప్రజానీకం జేజేలు పలుకు తుంటారు. ఈ మార్గాన్ని అట్ట తోడు అని పిలుస్తారు. అక్కడ నుంచి యాత్ర అప్పాచ్చిమేడు వైపునకు కదులుతుంది. తర్వాత శబరి పీఠము దగ్గర కు చేసుకొంటారు. ఇటు, పందళ రాజ వంశీయులు ఊరేగింపు గా పంబ తీరంలోని కన్నె మూల గణపతి ఆలయం దగ్గర ఉండే రాజ వంశీయుల బసకు చేసుకొంటారు. ఈలోగా ఘోష్‌ యాత్ర శబరి కొండకు చేరుతోందన్న సమాచారము దేవాలయానికి చేరుతుంది. అక్కడ పూజలకు సంబంధించిన సమాచారాన్ని మార్పిడి చేసుకొంటారు. 

మకర సంక్రాంతి రోజున శబరిమలై సన్నిధానంలో చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. తెల్లవారుజామున 5గంటలకు నిర్మాల్య దర్శనముతో పూజాదికాలు మొదలవుతాయి. అప్పటికే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు చేసే శరణు ఘోషలతో శబరి గిరులు మార్మోగుతుంటాయి. ఏడు గంటల సమయంలో ఉషా పూజ నిర్వహిస్తారు.  ఆరోగ్యానికి ప్రదాత గా సూర్య భగవానుడు నిలుస్తాడు. అందుచేత భూలోకవాసులు అందరికీ చక్కటి ఆరోగ్యం, ఆనందం నెలకొనాలని కాంక్షిస్తూ గణపతి హోమం, ఇతర హోమాదికాలు నిర్వహిస్తారు. అడవుల నుంచి సేకరించిన ఔషధ మూలికలతో చేసే హోమాదికాలు కనుల పండుగగా సాగుతుంటాయి. మరో వైపు సూర్య భగవానుడు ధనూరాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్య ఘడియలను పండితులు ముందుగానే అంచనా వేసి నిర్దేశిస్తారు. ఆ సమయాన్ని గుర్తించుకొని మకర సంక్రమణ పూజలు జరిపిస్తారు. అయ్యప్పస్వామికి ఎంతో ఇష్టమైన నెయ్యాభిషేకం నిరంతరాయంగా సాగేట్లుగా చర్యలు తీసుకొంటారు. ఆ రోజంతా స్వామివారు పరమానందభరితులై భక్తులను అనుగ్రహిస్తుంటారు.  

అటు దేవాలయం దగ్గర నుంచి ఒక బృందం ముందుకు వచ్చేసి స్వాగతం పలుకుతారు. తిరువాభరణం పెట్టెలు తీసుకొని వచ్చిన వారికి పూల మాలలు వేసి స్వాగతం పలుకుతారు. ఆలయం దగ్గర పూజలు పూర్తవుతున్న  వేళ.. తిరువాభరణం ఊరేగింపు స్వామి వారి సన్నిధికి చేరుకుంటుంది. స్వామి వారికి అలంకరించే ఆభరణాలు కలిగిన పెట్టెను పవిత్ర పదునెనిమిది మెట్ల మీదుగా గర్భాలయము కు చేరుస్తారు. అక్కడ మేల్‌ శాంతి చేతుల మీదుగా ఆభరణములను స్వామి వారికి అలంకరిస్తారు. మిగిలిన రెండు ఆభరణముల పెట్టెలను మాలికాపురమ్మ అమ్మవారి గుడి సమీపంలోకి చేరుస్తారు. తిరువాభరణములతో... రాజ ఠీవితో అయ్యప్ప స్వామి అద్భుత కాంతులతో మెరిసిపోతుండగా.... శబరి కొండ కు ఎదురుగా ఉన్న కాంతిమల మీద మకర జ్యోతి రూపంలో స్వామి దర్శనం ఇస్తారు. తరువాత రాత్రివేళ తిరువాభరణములతో స్వామి భక్తులను అను గ్రహిస్తారు.  మకర సంక్రాంతి రోజంతా స్వామి వారి జ్యోతి దర్శనం, భక్తులకు తిరువాభరణ సహితుడై దర్శనం ఇవ్వడం జరుగుతాయి. దీంతో మరునాడు సాయంత్రం దాకా భక్తుల తిరుగు ప్రయాణాలు జరుగుతుంటాయి. ఇక అక్కడ నుంచి నాలుగు రోజుల పాటు పందళ రాజుల ఆధ్వర్యంలో విశేషంగా పూజాదికాలు నిర్వహిస్తారు. యాత్రికుల సందడి బాగా తగ్గిపోయాక, పంబ లో మకాం చేసి ఉన్న పందళ రాజు ఊరేగింపుగా స్వామి వారి సన్నిధికి బయలు దేరతారు. ఈ సందర్భంగా పందళం నుంచి వచ్చిన కొందరు పరివారం వారిని అనుసరిస్తారు. మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రానికి నెమ్మదిగా కాలినడకన చేరుకొంటారు. సరిగ్గా స్వామి వారి ఆలయం ముంగిట పదునెట్టాంపడికి సమీపంలో ఆలయ అధికారులు, అర్చకులు, పండితులు స్వాగతం పలుకుతారు. అక్కడ రాజ సాంప్రదాయానికి చెందిన ఖడ్గం, ఇతర లాంఛనాలను ఆయనకు అందచేస్తారు. తర్వాత ఆయనకు వివిధ రకాలుగా ఉపచర్యలు జరుపుతారు. పదునెట్టాంపడి కి సమీపంలో అయ్యప్పస్వామి వారి బాల్య స్నేహితులంతా కలిసి ఈ వేడుకను ఆస్వాదిస్తారని నమ్మకం. అనంతరం పందళరాజు నేరుగా పదునెట్టాంపడిని ఎక్కుతూ స్వామివారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. అయ్యప్పస్వామి దర్శనం కోసం ఇరుముడిలేకుండా పదునెట్టాంపడి మీదుగా వెళ్లే అవకాశం పందళరాజుకి మాత్రమే సొంతం. తర్వాత అయ్యప్పస్వామి వారి ఆలయంలో పందళరాజు చేతుల మీదుగా ప్రత్యేకపూజలు జరిపిస్తారు. అనంతరం స్వామి వారి ప్రసాదం తీసుకొని తిరిగి పదునెట్టాంపడి మీదుగా పందళరాజు దిగువకు చేరుకొంటారు. అనంతరం అక్కడ పల్లకీ, ఇతర రాజలాంఛనాలను తీసుకొని వస్తారు. రాజ మకుటాలను ధరించి పందళరాజు ఊరేగింపు గా మాళిగపురత్తమ్మ అమ్మవారి ఆలయం దగ్గరకు చేరుకొంటారు. అక్కడ మణిమండపం సమీపంలోని రాచరిక విడిదిలో బస చేస్తారు. అంతటితో మహారాజుల పూజ తదుపరిదశకు చేరుతుంది.   తర్వాత పందళరాజు పరివారంతో కలిసి ఉదయం సమయంలో స్వామివారి సన్నిధానంకు చేరుకొంటారు. అప్పటిదాకా స్వామి వారికి పెద్ద ఎత్తున నెయ్యాభిషేకాలు జరుగుతుంటాయి. రాజ పరివారం సన్నిధానం కు వచ్చాక నెయ్యాభిషేకాలు నిలిపివేస్తారు. తమ వంశీయుడైన అయ్యప్ప స్వామికి పెద్ద ఎత్తున నెయ్యాభిషేకాలు జరిపిస్తూ రావటంతో ఆయన శరీరం ఉష్ణగ్రస్తం అవుతుందని రాజవంశీయులు ఆందోళన చెందుతుంటారు. అందుచేత స్వామివారు పూర్తిగా చల్లబడేందుకు అడవుల నుంచి సేకరించిన మేలు జాతి గంధాన్ని రంగరించి, గంధంలో అభిషేకం జరుపుతారు. దీనిని కలభాభిషేకం అని పిలుస్తారు. స్వామివారి ఆలయం ప్రాంగణం అంతా దివ్య పరిమళం అలుముకొంటున్న వేళ ఈ సీజన్‌ కు నెయ్యాభిషేకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తారు. ఈ చందనాభిషేకం నుంచి తీసిన చందనం ప్రసాదాన్ని పందళరాజు, ఆయన పరివారానికి అందించిన తర్వాత మిగిలిన భక్తులకు అందిస్తారు.  

అదే రోజు సాయంత్రం మాళిగపురత్తమ్మ అమ్మవారి ఆలయంలో దివ్యమైన ఉత్సవం నిర్వహిస్తారు. అయ్యప్ప స్వామివారి చరిత్రను చూసినట్లయితే, స్వామివారి మీద మనసు పడిన మాళిగపురత్తమ్మ అమ్మవారికి భగవానుడు ఒక వరం ఇస్తారు. ఏ సంవత్సరం అయితే కన్నెస్వామి (మొదటిసారి మాలధారణ చేసిన భక్తుడు) తమ దర్శనానికి రాకుండా ఉంటాడో ఆ ఏడాది ఆమెను వివాహం చేసుకొంటానని, అప్పటిదాకా బ్రహ్మచర్య దీక్షలో ఉంటానని పేర్కొంటాడు. అందుచేత ఈ  సంవత్సరం అయినా వివాహ ఘడియ లభిస్తుందేమో అన్న ఆశతో మాళిగపురత్తమ్మ అమ్మవారు మంగళకర స్నానాలు, అలంకరణలు చేసుకొని ముస్తాబు అవుతారు. తర్వాత ఏనుగు మీద అమ్మవారి ప్రతిమ ను ఉంచి హుషారైన మంగళవాయిద్యాలు, భజనలతో శరంకుత్తి దాకా తీసుకొని వెళతారు. అక్కడ కన్నెస్వాములు గుచ్చిన శరములు చూసి అమ్మవారు తీవ్ర నిరాశకు లోనవుతారు. దీంతో మంగళవాయిద్యాలను నిలిపివేస్తారు. శోకంలో మునిగిపోయినందుకు గుర్తుగా కాగడాలు ఆర్పివేస్తారు. నిశ్శబ్దంగా అమ్మవారి ప్రతిమను వెనక్కి తీసుకొని వచ్చి అమ్మవారి ఆలయానికి చేర్చటంతో ఆ ఘట్టం పూర్తి అవుతుంది.   తర్వాత రోజు చాలావరకు అయ్యప్ప సన్నిధానం ఖాళీ అయిపోతుంది. నెయ్యాభిషేకాలు నిలిచిపోయినందున కొందరు భక్తులు సాధారణ దర్శనాలు చేసుకొంటూ ఉంటారు. ఈలోగా అమ్మవారి ఆలయం ముంగిట ఉన్న మణిమండపాన్ని అలంకరిస్తారు. చీకటి పడ్డాక శబరిమలై చుట్టుపక్కల దట్టమైన అడవుల్లో ఉండే ఆటవికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొంటారు. ఆ సమయానికి పోలీసు సిబ్బంది అప్రమత్తమై ఇతర భక్తులను కొండ కిందకు పంపించివేస్తూ ఉంటారు. ఏడాది పొడవునా వివిధ రకాల పూజలు జరిగినందున క్రియాపరమైన దోషాలు హరించేందుకు కురుబ పూజ (బలిపూజ) నిర్వహిస్తారు. పందళరాజు స్వయంగా తమ ప్రాంతానికి తరలి వచ్చినందుకు మురిసిపోతూ ఆటవికులు తమ సాంప్రదాయం మేరకు ఆయనకు ఆతిథ్యం కల్పిస్తారు. అడవిలో ఉండే పశు పక్ష్యాదులు, వన్యప్రాణుల వైవిధ్యంలో నష్టం ఉండకూడదని ప్రార్థించుకొంటారు. ఇంతటి ప్రేమ చూపించిన ఆటవికుల పెద్దలకు పందళరాజు కానుకగా కొంత దక్షిణ ఇవ్వటం ఆనవాయితీ.

దోషాలు తొలగించేందుకు పెద్ద ఎత్తున బూడిద గుమ్మడికాయలను పగల గొడతారు. ఆ రోజు అర్థ రాత్రి కురుబ పూజ అయ్యే సరికి శబరిమలై దాదాపుగా ఖాళీ అయిపోతుంది.   తర్వాత రోజు శబరి సన్నిధానంలో ఎవరికీ దర్శనాలు ఉండవు. ఉదయమే పందళం నుంచి వచ్చిన భక్తుల తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తిరువాభరణాలను మరల మూడు పెట్టెలలో సర్దేసి ఊరేగింపుగా పంబ దగ్గరకు తీసుకొని వచ్చేస్తారు. ఈలోగా పందళరాజు చివరి దర్శనం కోసం స్వామివారి సన్నిధానానికి వెళతారు. అక్కడ పందళరాజు చేతుల మీదుగా చివరి పూజలు నిర్వహిస్తారు.  స్వామి వారి ఆలయాన్ని మూసివేసి తాళం  చెవిని పందళ రాజుకి అప్పగించేస్తారు. తర్వాత సన్నిధానం నుంచి కిందకు వచ్చిన పందళరాజుకి పదునెట్టాంపడి దగ్గర అర్చకులంతా వీడ్కోలు పలుకుతారు. ఆ సమయంలో ఒక అర్చక ప్రతినిధిని పిలిచి పందళరాజు గుడి తాళాలు ఆయనకు అప్పగిస్తారు. వచ్చే ఏడాది దాకా ప్రతీరోజు అర్చకత్వం, పూజలు నిర్వహించాలని కోరతారు. దీంతో మకర సంక్రాంతి సీజన్‌ ముగిసినట్లు అవుతుంది. పందళరాజు, ఇతర అధికారులు, పరివారం కాలి నడకన పంబకు బయలుదేరతారు. ఇక అక్కడ కొందరు అర్చకులు, భద్రతా సిబ్బంది మాత్రమే మిగులుతారు. పంబకు పందళరాజు చేరుకొన్నాక, ఇక తిరువాభరణాల తిరుగు ప్రయాణం మొదలవుతుంది.  

పంబ నుంచి అటవీ మార్గంలో ప్రయాణిస్తూ రాత్రికి లాహా ప్రాంతానికి చేరుకొని అక్కడ ప్రభుత్వ గెస్టు హౌస్‌ లో నిలుపుతారు. అర్ధరాత్రి అక్కడ నుంచి బయలు దేరి ఉదయానికి పెరినాడ్‌ చేరుకొంటారు. అక్కడ పెరినాడ్‌ ఆలయంలోని అయ్యప్పస్వామికి ఈ ఆభరణాలను అలంకరిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు తిరువాభరణాలను ధరించిన అయ్యప్పస్వామి అద్భుతమైన కాంతులతో మెరిసిపోతూ దర్శనం ఇస్తారు. పెరినాడ్‌ అయ్యప్ప ఆలయంలోకి అందరికీ అనుమతి ఉంటుంది కాబట్టి తిరువాభరణాలు ధరించిన స్వామి వారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తారు. దాదాపుగా రోజంతా తిరువాభరణ ధారియై స్వామి వారు దర్శనం ఇస్తారు కాబట్టి పూజలు, మొక్కుబడులు చెల్లించుకొంటారు. అందుచేత దీనిని స్త్రీ శబరిమలై అని కూడా పిలుస్తారు. రోజంతా కళా ప్రదర్శనలు, సాంస్కత్రిక కార్యక్రమాలు, నాట్య గీతికలు, సంగీత స్వరార్చనలు మిన్నంటుతాయి. దాదాపుగా అర్ధ రాత్రి దాకా ఉత్సవాలు, అన్నదానాలు, పూజాదికాలు జరుగుతూ పండగ వాతావరణం నెలకొంటుంది.  

అనంతరం అక్కడ నుంచి తిరువాభరణాలు బయలుదేరి అరణ్ముల కు చేరతాయి. అక్కడ మఠంలో కొంతసేపు నిలిపి ఉంచాక స్థానికులకు దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత తిరువాభరణాలు ఊరేగింపుగా పందళం రాజ ప్యాలెస్‌ కు చేరతాయి. సరిహద్దుల దగ్గరకు పందళం గ్రామస్తులు చేరుకొని తిరువాభరణాలకు స్వాగతం పలికి ఊరేగింపుగా రాజమందిరానికి తీసుకొని వెళతారు.  అక్కడ ప్రభుత్వాధికారులు, దేవాలయ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తిరువాభరణాలను పందళం రాజ కుటుంబానికి అప్పగించటంతో వేడుక ముగుస్తుంది. అయ్యప్పస్వామిని తమ ఊరి బిడ్డడుగా పందళం గ్రామస్తులు తలంచుకొంటారు. స్వామివారి ఆభరణాలు వేంచేసి ఉన్న రాజప్యాలెస్‌ ను అంతే గౌరవంగా చూసుకొంటారు. మకర సంక్రాంతి వేడుకలు రాచరిక సాంప్రదాయంలో నిర్వహించుకొన్న ప్రజానీకం వచ్చే ఏడాది ఉత్సవాల కోసం ఎదురు చూస్తుంటారు.

 

-యలమంచిలి రమావిశ్వనాథన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని