హృదయం సమర్పయామి!

మంత్రపుష్పం మానవాళికి ఒక మహత్తర సందేశం. దేవుడెక్కడ ఉన్నాడు? మనచుట్టూ ఉండే గాలి, నీరు, సూర్యుడు, చంద్రుడు చరాచర జగత్తు, దాని వెనక ఉండే పరంజ్యోతి లేదా పరబ్రహ్మను తెలుసుకునే విధానం మంత్ర పుష్పార్ధాలలో ఉంది. 

Updated : 21 Jan 2021 08:43 IST

మంత్రపుష్పం మానవాళికి ఒక మహత్తర సందేశం. దేవుడెక్కడ ఉన్నాడు? మనచుట్టూ ఉండే గాలి, నీరు, సూర్యుడు, చంద్రుడు చరాచర జగత్తు, దాని వెనక ఉండే పరంజ్యోతి లేదా పరబ్రహ్మను తెలుసుకునే విధానం మంత్ర పుష్పార్ధాలలో ఉంది.  
మంత్రపుష్పం రెండు చోట్ల కనిపిస్తుంది. యజుర్వేదంలో ఉండే తైత్తిరీయ అరణ్యకంలో ఎనిమిది శ్లోకాలుగా, నారాయణ సూక్తంలో పదమూడు శ్లోకాలుగా కనిపిస్తుంది. అనేక వేదాంత, ఆధ్యాత్మిక విశేషాలను వివరిస్తుంది. విశ్వమంతా వ్యాపించి ఉంది ఆ పరమాత్మ ఒక్కడే... అతడే సర్వజీవుల్లో సూక్ష్మాతిసూక్ష్మంగా ఇమిడి ఉంటాడని చెబుతుంది.
పద్మకోశ ప్రతీకాశగ్‌ం
హృదయం చాప్యదోముఖమ్‌
అధో నిష్ట్వ్యా వితస్త్యాంతే
నాభ్యా ముపరి తిష్ఠతి
జ్వాలమాలాకులం భాతి
విశ్వస్యా యతనం మహత్‌...

ముడుచుకుని ఉన్న కమలం మొగ్గలా ఉండే మనిషి హృదయంలో అగ్ని శిఖలా, అణువంత పరిణామంలో పరమాత్మ ఉనికిని వివరిస్తుంది మంత్రపుష్పం. భగవంతుడు ఎక్కడో కాదు మన హృదయంలోనే ఉన్నాడని చాటి చెప్పే మంత్రమిది.  
యోపాం పుష్పం వేద పుష్పవాన్‌
ప్రజావాన్‌ పశుమాన్‌ భవతి
చంద్రమా వా అపాం పుష్పమ్‌
పుష్పవాన్‌ ప్రజావాన్‌ పశుమాన్‌ భవతి
య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్‌ భవతి

మనిషి మనుగడ సాగించేటప్పుడు పంచభూతాలైన నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం అనే వాటి విలువ ఉనికిని గురించిన అన్వేషణ, పరిశీలన మొదలయ్యాయి. ఆ అన్వేషణలో ముందుగా చందమామ సంగతి చర్చకొచ్చింది. తైత్తిరీయారణ్యకంలోని మంత్రపుష్ప భాగంలో చంద్రుడిని జలానికి కారణంగా భావించారు. అలాగే చందమామని భౌతిక దృష్టితో చూడడం మాత్రమే కాకుండా భక్తితో అర్చించాల్సిన అవసరంకూడా ఉందన్న విషయం బోధించారు. ఎంతో విలువైన జలాన్ని సమకూర్చుకుని పరిరక్షించుకున్నవాడు విలువైన వాటిని తన జీవితంలో పొందగలుగుతాడు. జలాన్ని పుష్పంగా పరమాత్మకు సమర్పించాలని అనడంలో జలాన్ని పవిత్రంగా చూడాలి. కాలుష్యానికి పాల్పడవద్దన్న సందేశం ఇమిడివుంది.
అగ్నిర్వా అపామాయతనం, ఆయతనవాన్‌ భవతి
యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్‌ భవతి
ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్‌ భవతి
య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్‌ భవతి’

నిప్పు విలువను కూడా తెలియజెపుతుంది మంత్రపుష్పం. అగ్ని జలానికి ఆథారం. అలాగే జలానికి అగ్ని కారణమవుతుంది. రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడుతున్నాయి. నీటితో పాటు అగ్ని విలువను తెలుసుకుని మసలుకోవటం మంచిదన్న సూక్తిని ఈ మంత్ర భాగం వివరిస్తుంది.
వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్‌ భవతి
యో వాయోరాయతనం వేద ఆయతనవాన్‌ భవతి
ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్‌ భవతి
య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్‌ భవతి’

నీరు, నిప్పు తర్వాత గాలి విలువను తెలుసుకోవాలి. జీవుడిలో వాయురూపంలో ఉన్న ప్రాణం ఉన్నంత వరకే ఏంచేసినా చెల్లుబాలయ్యేది. బతకడానికి నీరెంత అవసరమో గాలీ అంతే అవసరం కాబట్టి వాయువును కాపాడుకోవాలి. నీరు, ప్రాణవాయువు ఒకదానికొకటి పరస్పరాధారితాలు అని తెలుసుకుని జీవించాలి. ఈ క్రమంలో సాగే మంత్రపుష్పంలో సూర్యభగవానుడి మహిమగురించి, భూమి మేఘాలు, నక్షత్ర మండలాలకు ఆవల పరమాత్మ నిలయమైన మోక్షపధానికి సంబంధించిన అంశాల వివరణలు  మంత్రపుష్పంలో ఉన్నాయి.అందుకే భగవంతుడిని తెలుసుకునేందుకు మంత్రపుష్పాన్ని మించింది లేదంటారు పెద్దలు.

- యల్లాప్రగడ మల్లికార్జునరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని