Published : 18 Mar 2021 00:19 IST

అర్చనకు ఆది పురుషులు!

ఈనెల 18 శ్రీ కంఠుల  జయంతి

మనలో చాలా మంది దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లి పూజలు, అర్చనలు, అభిషేకాలు చేయించుకొంటాం. పత్రి, పువ్వులు, పసుపు, కుంకుమ వంటి ా ద్రవ్యాలు సమర్పిస్తాం... ఈ ప్రక్రియలను ఇలా చేయాలని నిర్దేశించిన మూల పురుషుల్లో శ్రీకంఠ శివాచార్యులు ఒకరు. పూర్వం చాలా కఠినమైన రీతిలో సాగే పూజాదికాలు సామాన్య మానవుడికి అందుబాటులో ఉంచాలనుకునే వారాయన. తాను సిద్ధాంతీకరించిన పూజా విధానాలతో ఆది శంకరులు,  భగవాన్‌ రామానుజాచార్యుల సరసన శ్రీ కంఠులవారు కూడా చేరారు.
శ్రీకంఠుల వారి గురించి స్కాంద పురాణంలో ఉంది. ఆయన గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణీ సంగమ క్షేత్రమైన కాళేశ్వరంలో ముక్తీశ్వర స్వామి అనుగ్రహంతో ఆయన జన్మించినట్లు అందులో ఉంది. తల్లిదండ్రుల పేర్లు అంబికాదేవి, సద్యోజాత శివాచార్య.  చిన్నతనంలోనే ఆయన్ని శ్వేతాచార్యులనే గురువు దగ్గర విద్యాభ్యాసం కోసం పంపించారు. అక్కడ నాలుగు వేదాలూ ఆయన అధ్యయనం చేశారు. ఆగమ, నిర్గమ, మంత్ర, తంత్ర, యోగ, ఉపనిషత్తుల్లో ప్రావీణ్యం గడించారు. అదే సమయంలో వేదవ్యాసుల ఆదేశంతో బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని కూడా ఆయన రాశారు. ఇంటికి తిరిగివచ్చిన శ్రీకంఠుల వారు... భగవంతుని కార్యాన్ని నెరవేర్చేందుకు సన్యాస దీక్ష తీసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పారు. వారేమో శ్రీ కంఠులకు వివాహం చేసి కాశీ వెళ్లాలని ఆశ పడుతున్నట్లు చెప్పారు. అప్పుడు ఆయన తల్లిదండ్రుల కోసం కాళేశ్వరం క్షేత్రాన్ని వారణాశిగా మార్చి, అక్కడే విశ్వనాథ, అన్నపూర్ణేశ్వరిల దర్శనాన్ని వారికి చేయించారని చెబుతారు.

సన్యాస దీక్ష తీసుకున్న శ్రీ కంఠులు అమర్థగిరి ప్రాంతంలో తీవ్ర తపస్సు చేశారు. అక్కడే ఆయనకు పరమేశ్వర దర్శనమైంది. కఠినమైన తపస్సులు, యజ్ఞ యాగాదులను సంస్కరించే బాధ్యతను ఆయనకు స్వయంగా పరమేశ్వరుడే అప్పగించాడు. దీంతో శ్రీకంఠులు ఆ విషయంలో విశేషమైన కృషి చేశారు. దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయంగా పూజాదికాలు నిర్వహించే పద్దతులను ప్రవేశపెట్టారు.  దేవాలయాల్లో అర్చనలు, అభిషేకాల వంటి ప్రక్రియలకు నాంది పలికారు. సామాన్య భక్తులకు భగవంతుని దగ్గర చేశారు. ఇంట్లో సైతం భగవంతుడిని  ఆరాధించుకొనే మార్గాలను చెప్పారు. భాష్యాలలో శ్రీకంఠ భాష్యము ప్రాచీనమైనది చెబుతారు.

- యలమంచిలి రమా విశ్వనాథన్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని