మనసెరిగినవాడు మన రాముడు!

రావణాసురుడిని వధించి అయోధ్యకు తిరిగి వస్తున్న సందర్భంలో రాముడు ముందు హనుమంతుణ్ని పిలిచాడు. హనుమా! భరతునికి రాజ్యపాలనపై ఆశ ఉంటే అతన్ని బాధపెట్టి నేను పాలించడం ధర్మం కాదు, అందుకే నువ్వు వెంటనే వెళ్లి నేను అయోధ్యకు తిరిగి వస్తున్నానని చెప్పు. నీ మాటలు వింటున్నప్పుడు భరతుని

Published : 15 Apr 2021 01:00 IST

ఈ నెల 21 శ్రీరామ నవమి

కదలివచ్చే ధర్మం... రాముడు
పోతపోసిన ఆదర్శం.. రాముడు
రూపుకట్టిన కారుణ్యం రాముడు
అంతులేని, అనిర్వచనీయమైన ఆనందం.. రాముడు
అందుకే ఆయన జగదానంద కారకుడయ్యాడు...
కష్టాలే కానీ, కన్నీళ్లే రానీ..ఆ పరంధాముడు అన్నిటినీ స్వీకరించాడు. తన చిత్తమనే యాగంలో హవిస్సులా వాటిని దగ్థం చేశాడు. ఆనంద రాముడయ్యాడు. అద్వైతానికి తార్కాణంగా నిలిచాడు.

రావణాసురుడిని వధించి అయోధ్యకు తిరిగి వస్తున్న సందర్భంలో రాముడు ముందు హనుమంతుణ్ని పిలిచాడు. హనుమా! భరతునికి రాజ్యపాలనపై ఆశ ఉంటే అతన్ని బాధపెట్టి నేను పాలించడం ధర్మం కాదు, అందుకే నువ్వు వెంటనే వెళ్లి నేను అయోధ్యకు తిరిగి వస్తున్నానని చెప్పు. నీ మాటలు వింటున్నప్పుడు భరతుని ముఖ కవళికల్ని గమనించు. ముఖంలో ఆనందం లేకుండా ఏ మాత్రం బాధ కనిపించినా నేను అయోధ్యకు వెళ్లను... అని చెప్పాడు. అంత ప్రేమమూర్తి శ్రీరామచంద్రుడు.
బలవాన్‌, ధృతిమాన్‌, స్థైర్యవాన్‌, నాలసః, నిస్తంద్రీ, అప్రమత్తః, జితక్రోధః...రాముడు బలవంతుడు, ధైర్యవంతుడు, నిలకడ ఉన్నవాడు, సోమరితనం, ఏమరుపాటు లేనివాడు, కోపాన్ని దరిచేరనివ్వనివాడు అంటూ వాల్మీకి మహర్షి రామాయణంలో వర్ణించారు. అంతేకాదు రామోరాజ్యముపాసిత్వా...  రుషులు ఏకాగ్రచిత్తంతో తపస్సు చేసినట్లుగా ఓ దీక్షగా.. ఓ ఉపాసనలా రాముడు రాజ్యపాలనను నిర్వహించాడని అన్నారు. తనలో ఆనందం ఉన్నవాడే అందరినీ సంతోషంగా ఉంచగలడు. పోతపోసిన ఆనందం రామచంద్రుడు. ఒకసారి రాముని దర్శించినవారు, ఆయనతో ముచ్చటించిన వారు ఇక జీవితాంతం మరచిపోరంటోంది రామాయణం. దానికి ఆయన ముగ్ధమోహన రూపం ఓ కారణమైతే, ఆయన మృదు స్వభావం మరో కారణం. రాముడు ఏదైనా మాట్లాడటానికి ముందు చిరునవ్వు నవ్వేవాడు. అందుకే ఆ స్వామిని ‘స్మితపూర్వభాషి’ అన్నారు. కష్టాలే కానీ, కన్నీటి పర్యంతమయ్యే పరిస్థితులే రానీ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ పరంధాముడిని ప్రశాన్తాత్మా అంటారు. అందుకే హనుమంతుడు, సుగ్రీవుడు సహా అందరూ ఆయన సాన్నిధ్యంలో నిశ్చింతగా ఉండేవారు. ఏదో తెలియని ప్రశాంతతలో ఓలలాడేవారు. ఇతరుల అనందంలో తన సంతోషాన్ని చూసుకునేవాడు ఆ ఆజానుబాహుడు. ఆయన ఎవరినీ కష్టపెట్టేవాడు కాదు. ఒకవేళ ఎవరైనా పరుషంగా మాట్లాడితే బదులివ్వని శాంత స్వరూపుడు అంటారు వాల్మీకి. అన్నమాచార్య కూడా ‘రాజీవ నేత్రాయ రాఘవాయ నమో, సౌజన్య నిలయాయ జానకీశాయ...’ అని వర్ణించారు. ‘చింతించ యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము...’ అంటూ గుణగానం చేశారు.


సహస్రనామ తత్తుల్యం...

రామ రస పానం చేసి జీవన్ముక్తులైన వారు కోకొల్లలు. రామ నామం తారక మంత్రంగా ఎందరినో తరింపజేసింది. విష్ణు సహస్ర నామాలు పారాయణ చేస్తే కోర్కెలు నెరవేరతాయన్నది నమ్మకం. అయితే అన్ని నామాలు చదవలేని వారి పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నను పార్వతీదేవి శివుడిని అడిగింది. విష్ణు సహస్ర నామాలని క్లుప్తంగా ఎలా చదవచ్చో చెప్పమంది. అప్పుడు పరమేశ్వరుడు
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే।
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే।।

వేయి నామాలను పఠించడం వల్ల కలిగే పుణ్యం ‘రామ’ శబ్దాన్ని స్మరించడం వల్ల కలుగుతుంది. రామనామ జపం విష్ణు సహస్రనామ పారాయణ ఫలితాన్నిస్తుందని వివరించాడు. రామ అనేది కేవలం ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. అది సంసారాన్ని దాటించే బీజాక్షర రూప నావ. హరిని పూజించే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయలో ‘రా’ అనే అక్షరం, శివ పంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయలో ‘మః’ అన్న శబ్దం కలిపితే ‘రామః’ అనే శబ్దం రూపుదిద్దుకుంది. శివకేశవ తత్త్వాల కలయిక రామ అనే పదంలో దర్శనమిస్తుంది.


రామ అనే శబ్దం ప్రణవనాదంతో సమానం... ఇతర మంత్రాలలాగా దీనికి ముందు ఓంకారం కలిపి జపించకున్నా ఫర్వాలేదని గురువులు చెబుతారు.


తొమ్మిది విధాలా...

భగవంతుడిపై భక్తిని ప్రకటించేందుకు నవవిధ భక్తిమార్గాలను నిర్దేశించారు పెద్దలు. శ్రీరామచంద్రుడిపై కూడా తమ పరమ ప్రేమను ఈ మార్గాల్లో ప్రకటించుకున్నవారున్నారు...

శ్రవణం - హనుమంతుడు
‘రఘునాథుని కీర్తన వినిపించే చోట ముకుళిత హస్తాలతో నేను ఉపస్థితుడనవుతాను’ అని స్వయంగా హనుమంతుడే వెల్లడించాడు. అందుకే శ్రీరాముడిపై శ్రవణ భక్తికి ఆయన తార్కాణం.


కీర్తనం - వాల్మీకి
కోదండరాముడి కీర్తన బలానికి వాల్మీకి సోదాహరణగా నిలిచారు. రామ కథను రచించి కారణజన్ముడయ్యారు.


స్మరణం... సీతాదేవి
రావణుడి చెరలో ఉన్నా నిరంతరం రాముడి స్మరణలో గడిపిన పరమపావని సీతాదేవి. రాక్షస మూక మధ్య కూడా ఆ జగజ్జనని పతి నామమే ప్రాణాధారంగా తరించింది.


అర్చనం... శబరి మాత
అనన్య భక్తితో అర్చించి అయోధ్య రాముడిని తన దగ్గరికి రప్పించుకున్న భక్త శిరోమణి శబరి.


పాదసేవనం... భరతుడు
తన కారణంగానే అన్న అడవుల పాలయ్యాడని కుమిలిపోయాడు భరతుడు. అన్న పాదుకలకే పట్టాభిషేకం చేసి రాముడి పాదసేవకే జీవితాన్ని అంకితం చేశాడు.


వందనం... విభీషణుడు
అన్న రావణాసురుడికి నచ్చజెప్పి, జానకిని విడిపించేందుకు విఫలయత్నం చేశాడు విభీషణుడు. చివరకు లంకను విడిచి వందన భక్తితో శ్రీరామచంద్రుణ్ని ఆశ్రయించాడు.


దాస్యం... లక్ష్మణుడు
అనుక్షణం అన్న సేవకు తపించాడు లక్ష్మణుడు. అన్నతో అడవిలో ఉన్నా, అయోధ్యలాగే భావించి, దాసుడిగా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు.


సఖ్యం... సుగ్రీవుడు
సీతాన్వేషణలో విశేష రీతిలో శ్రీరాముడికి సహకరించాడు. భగవంతుడితో స్నేహం చేసి అవతార లక్ష్యానికి సాయపడ్డాడు.


ఆత్మనివేదనం... జటాయువు
సీతామాతను రావణుడి బారి నుంచి విడిపించేందుకు శాయశక్తులా కృషి చేసి అసువులు బాశాడు జటాయువు. ఆత్మ నివేదనతో ఆ రాఘవుడిని కూడా కంటతడి పెట్టించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని