సత్కర్మ ఏవ జయతే!

కర్మ సిద్ధాంతం హైందవ ధర్మంలో ప్రధాన విశ్వాసం. ఈ ప్రపంచంలో ప్రతి జీవీ జన్మించడానికి కారణం అంతకు ముందు జన్మలో చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితం పాపం. మంచి కర్మకి ఫలితం పుణ్యం. వాటిని అనుభవించటానికే ప్రతి జీవీ మళ్లీ మళ్లీ పుడుతుంటుందని హిందూ సనాతన ధర్మం చెబుతుంది. మనిషి కర్మలను ధర్మబద్ధం చేసి సత్కర్మాచరణతో తనను తాను ఉద్ధరించుకోవాలన్నదే కర్మ సిద్ధాంతం....

Published : 29 Apr 2021 00:34 IST

శ్రమ... ప్రతి మనిషి కర్తవ్యం.
కర్మ... జీవితంలో భాగం.
పని లేకుంటే ప్రగతి లేదు.
స్వేదం చిందకుంటే ప్రతిఫలం రాదు.
కష్టం చెయ్యకుంటే అభివృద్ధి సాధ్యమే కాదు.
అసలు... ఆ శ్రమ గొప్పదనం ఏంటి?
కర్మ ఎలా ఉండాలి?
పని చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటి?


శ్రమ అనే పదానికి నిఘంటువులు తపస్సు అనే అర్థం కూడా చెబుతున్నాయి. ఈ క్రమంలో ధర్మబద్ధ జీవనానికి చేసే కర్మ తపస్సులా ఉంటేనే అసలు లక్ష్యం సిద్ధిస్తుందన్నది పెద్దల మాట.

ర్మ సిద్ధాంతం హైందవ ధర్మంలో ప్రధాన విశ్వాసం. ఈ ప్రపంచంలో ప్రతి జీవీ జన్మించడానికి కారణం అంతకు ముందు జన్మలో చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితం పాపం. మంచి కర్మకి ఫలితం పుణ్యం. వాటిని అనుభవించటానికే ప్రతి జీవీ మళ్లీ మళ్లీ పుడుతుంటుందని హిందూ సనాతన ధర్మం చెబుతుంది. మనిషి కర్మలను ధర్మబద్ధం చేసి సత్కర్మాచరణతో తనను తాను ఉద్ధరించుకోవాలన్నదే కర్మ సిద్ధాంతం. కర్మ గురించి భగవద్గీత మరింత విపులంగా చెబుతుంది. ఇందులో కర్మసన్యాస యోగం, కర్మ యోగం అనే అధ్యాయాలున్నాయి.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన।
మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి।।

అర్జునా.. కర్మలు చెయ్యటంలోనే నీకు అధికారం ఉంది. కర్మ ఫలితాన్ని ఆశించటంలో లేదు. కర్మ ఫలాలకు కారకుడవు కావద్దు. కర్మలను మానటంలో ఆసక్తి చూపించొద్దన్నది దీని భావం. జీవులు కర్మ చెయ్యకుండా ఉండటం అసంభవం. ఈ శ్లోకం ప్రకారం కర్మ నిర్ణయాధికారం మనిషికే ఉంది కాబట్టి ఆ చేసేదేదో సత్కర్మలే చెయ్యాలని, పని చేశాక వచ్చే ఫలితం కోసం ఎదురుచూస్తూ ప్రస్తుత కర్మలు మానుకోవద్దని దీని అంతరార్థం. కార్మికం శారీరక, మానసిక శ్రమలతో కూడి ఉంటుంది. శ్రమైక జీవన సౌందర్యం అబ్బాలంటే ఆ కర్మకు ధార్మికత్వం తోడు కావలసిందే. మనిషి తాను చేసే కర్మలను సంస్కరించడం ద్వారా ఉన్నతిని సాధించవచ్చని దీని సారాంశం.
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ।
సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే।।

జయాపజయాల విషయం పక్కన పెట్టి, మమకారం విడిచిపెట్టి, కర్తవ్య నిర్వహణలో స్థిరంగా ఉండగలగాలి. ఇలాంటి సమత్వ బుద్ధినే యోగం అంటారు. అదే కర్మయోగం. అన్ని పరిస్థితులనీ ప్రశాంత చిత్తంతో సమానంగా స్వీకరించటం గొప్ప లక్షణం. కృషి మాత్రమే మన చేతుల్లో ఉంది, ఫలితం మన వశంలో లేదని అర్థం చేసుకున్నప్పుడు మన కర్తవ్య నిర్వహణ మీద మాత్రమే పూర్తి శ్రద్ధ ఉంటుంది. ఫలితాలు భగవంతుడికి వదిలాం కనుక మానసిక ప్రశాంతత లభిస్తుంది.  
‘కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేత్‌ సమాః’ అంటుంది ఈశావాస్యోపనిషత్తు. విహిత కర్మల వల్ల ముక్తిని పొందవచ్చన్నది దీని అర్థం. విహిత కర్మ అంటే, చెయ్యాల్సిన పని చెయ్యటం. ముందు చెయ్యాల్సిన పనిని పక్కన పెట్టి అనవసరపు పనివైపు చూడటం వల్ల కాలహరణం జరుగుతుంది. తర్వాత ఆదుర్దా, చివరకు ఆ పనికి సరైన ఫలితం రాక నిరాశతో కుంగిపోవాల్సి వస్తుంది. వాటికి ఆస్కారం లేకుండా చెయ్యాల్సిన పని మీదే దృష్టిపెట్టాలి.
‘ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్ని బోధత’ అని కఠోపనిషత్తు పేర్కొంటోంది. దీన్ని స్వామి వివేకానంద తరచూ ప్రస్తావిస్తూంటారు. ‘లేవండి! మీలో ఉన్న ఆత్మశక్తిని వ్యక్తం చేసేందుకు జ్ఞానవంతులు కండి. గమ్యం చేరే వరకు విశ్రమించకండి’ అన్నది ఈ ఉపనిషత్‌ వాక్య సారం. మనిషి ఎన్నో ఘనకార్యాలు తన శక్తితోనే సాధిస్తున్నాడు. తనలోనే దివ్యశక్తి ఉందని గమనించినప్పుడు అత్యుత్తమ కార్యాలు సాధించగలడని చెబుతుందిది.  

- మల్లు, చైతన్య

శ్రమించండి

‘శ్రమలోనే సౌందర్యం, ఆనందం ఉంది. ప్రాణం ఉన్నంత వరకు పని చేయండి. తుప్పుపట్టిన ఇనుప ముక్కలా అంతరించిపోవటం కన్నా, శ్రమలో అరిగిపోయే పనిముట్టులా పనికి అంకితం అవ్వండి. క్షుద్ర కీటకంలా చనిపోవటం కన్నా, కార్యరంగంలో కొవ్వొత్తిలా కరిగిపోవటం ఉత్తమం. ఆ కర్మ నిస్వార్థం, పరోపకారం కోసం అయితే మీ జీవితాలు ధన్యం’

- స్వామి వివేకానంద


‘కర్మాచరణలో కూడా మధ్యేమార్గాన్ని అనుసరించండి. తీవ్రంగా పనులు చేయటమూ మంచిది కాదు. అలా అని కర్మలు ఆచరించకుండా ఇతరులపై ఆధారపడటమూ పాపమే. ఆధ్యాత్మికత అంటే శ్రమ నుంచి పలాయనం కాదు’

- గౌతమబుద్ధుడు


‘భగవంతుడు నీకు నిర్దేశించిన కర్మల్ని విధిగా నిర్వర్తించే తీరాలి. ఆత్మవిచారణ అంటే ప్రాపంచికంగా ఇతరులపై ఆధార పడటం కాదు. నీ శరీరంపై నీకు శ్రద్ధ ఉన్నంత వరకు దేహానికి సంబంధించిన కర్మల్ని కౌశలంగా నిర్వర్తించాల్సిందే’

- రమణ మహర్షి


శ్రమలు మన మేలు కోసమే. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను నేర్పుతాయి. ఆ నిరీక్షణే మన విశ్వాసం. లోకాన్ని జయించే విజయం మన విశ్వాసం.

- క్రీస్తు వాణి


కాయకమే కైలాసం. శ్రమను మించిన సౌందర్యం లేదు. పనిని మించిన దైవం లేదు, కష్టాన్ని మించిన భక్తిలేదు.

- బసవేశ్వరుడు


అన్నింటికంటే అత్యుత్తమ సంపాదన ఏది?’ అని కొందరు ముహమ్మద్‌ ప్రవక్త (స)ను అడిగారు. ‘స్వ హస్తాలతో సంపాదించిన దానికంటే ఉత్తమమైంది మరొకటి లేదు’ అని అన్నారాయన. ఒకసారి ప్రవక్త (స) సహచరుడి చేతులు కట్టెలు కొట్టి బొబ్బలెక్కాయి. అతని రెండు చేతులు పట్టుకుని ముద్దాడి, ఇలాంటి కష్టజీవులంటే అల్లాహ్‌కు ఎంతో ఇష్టమని అన్నారు ప్రవక్త (స).


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని