Mother's Day: అమ్మను మించి దైవమున్నదా?

అమ్మ... అనంత ఆప్యాయతా సాగరం. తీర్చుకోలేని నిస్వార్థ త్యాగాల రుణం. అమ్మ లేకుంటే జన్మ లేదు. జీవితానికి వెలుగే లేదు. మాతృత్వం కోసం ఎన్నో కష్టాలు సహించి బిడ్డల్ని ప్రేమగా పెంచి పెద్దచేస్తుంది అమ్మ. అందుకే అమ్మను మించిన దైవం లేదు. తల్లిని మించిన ప్రేమమూర్తి కనిపించదు. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటూ... దైవం కన్నా ముందు అమ్మకే అత్యున్నత స్థానం కల్పించింది మన సంప్రదాయం....

Updated : 06 May 2021 06:46 IST

మే 9 అంతర్జాతీయ మాతృ దినోత్సవం

అమ్మ... అనంత ఆప్యాయతా సాగరం.
తీర్చుకోలేని నిస్వార్థ త్యాగాల రుణం.
అమ్మ లేకుంటే జన్మ లేదు. జీవితానికి వెలుగే లేదు.
మాతృత్వం కోసం ఎన్నో కష్టాలు సహించి
బిడ్డల్ని ప్రేమగా పెంచి పెద్దచేస్తుంది అమ్మ.
అందుకే అమ్మను మించిన దైవం లేదు.
తల్లిని మించిన ప్రేమమూర్తి కనిపించదు.

తల్లి, తండ్రి, గురువు, దైవం అంటూ... దైవం కన్నా ముందు అమ్మకే అత్యున్నత స్థానం కల్పించింది మన సంప్రదాయం. మాతృదేవోభవ అని అమ్మకే తొలి గౌరవం ఇచ్చాం. భగవంతుడు అన్ని చోట్లా ఉండే వీల్లేక తనకు బదులుగా అమ్మను సృష్టించాడని అంటారు.

‘భూమికన్నా బరువైనవారు ఎవరు?’ మహాభారతంలో యక్షుడి ప్రశ్నకు ధర్మరాజు సమాధానం... ‘తల్లి’.

వాత్సల్యం అమ్మ జీవ లక్షణం. వత్సం అంటే లేగదూడ. పుట్టగానే దూడ దేహమంతా మావి అలముకుని జుగుప్సాకరంగా ఉంటుంది. ఆ మకిలిని గోమాత నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. వత్సం మీద గోవు చూపించే ప్రేమనే వాత్సల్యం అంటారు. బిడ్డల విషయంలో అమ్మకు కూడా చీదర, చికాకు లాంటివి ఉండవు. ఆమెది పరిపూర్ణ ప్రేమ.
అమ్మదనమంటే బిడ్డకు జన్మ, తల్లికి పునర్జన్మ. కాన్పు కష్టాన్ని రైలు పట్టాల మీద నలిగే నాణెంతో పోల్చారు ఓ కవయిత్రి. కాబట్టే అమ్మదనానికి లోకం చేతులు జోడిస్తుంది. పేగు బంధానికి నమస్కరిస్తుంది.

బాల రాముడి కంట నీరు!

బాలరాముణ్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని తన పేరేంటని అడిగింది కౌసల్య. ఆ పేరు నోటికి తిరక్క చివరికి ‘అమ్మగాలు’ అన్నాడు - ‘ర’ అక్షరం పలకలేని రాముడు. నోరు తిరగలేదుగానీ, రాముడి కంట నీరు తిరిగింది. అమ్మ పేరు పలకలేనందుకు నొచ్చుకున్నాడు. బిడ్డ కంట్లో నీరు చూసి తల్లి మనసు తల్లడిల్లింది. ‘అవును నేను కౌసల్యను కాను. అమ్మనే’ అంటూ బిడ్డను గుండెలకు హత్తుకుంది కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ‘రామాయణ కల్పవృక్షం’లో. బిడ్డ ఏ విషయంలోనూ నొచ్చుకోకూడదని అమ్మ తాపత్రయపడుతుంది. చిన్నప్పుడు ముద్ద తినకుండా శ్రమ పెట్టినప్పుడే కాదు, పెద్దయ్యాక పెట్టకుండా దూరం చేసినా పన్నెత్తు మాట అనలేదు. అనదు. అమ్మంటే కొలతలకు అందని కారుణ్యం. అందుకే ‘అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరి తూచమంటే నేను ఒరిగేను అమ్మవైపు’ అన్నారు ప్రఖ్యాత కవి సి.నారాయణరెడ్డి.

బ్రహ్మకు సాయం!

‘ఆత్మావైపుత్ర నామాసి...’ వేదమంత్రాల్లో భర్త చేసే ఈ ప్రతిజ్ఞకు అర్థం.... ‘నేనే బిడ్డగా జన్మిస్తున్నాను’. అంటే, స్త్రీ తన భర్త మీద ఉన్న ప్రేమను ముద్ద చేసి తన కడుపులో బిడ్డగా రూపాన్నిస్తుంది. భర్త రూపం, గుణాలు తన బిడ్డకు రావాలనుకుంటుంది. దీన్నిబట్టి బ్రహ్మ చేసే పనికి అమ్మ సాయపడుతున్నట్టే కదా!

వాళ్లూ అమ్మలే!
జన్మనిచ్చిన తల్లి, మేనత్త, గురువుగారి భార్య, అన్న భార్య (వదిన), భార్య తల్లి (అత్తగారు)... వీరిని మాతృపంచకంగా పేర్కొంటారు. అందుకే అత్తమ్మ, వదినమ్మ... అని పిలుస్తాం. పరిచయం లేనివారి విషయంలోనూ నోటి వెంట వచ్చే మాట... అమ్మ.
తల్లే మిన్న
పది మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, వంద మంది ఆచార్యుల కన్నా ఒక తండ్రి, అలాంటి వెయ్యి మంది తండ్రుల కన్నా తల్లి మిన్న అంటారు. బిడ్డ ఈ లోకాన్ని తొలుత అమ్మ కళ్లతోనే అవగాహన చేసుకుంటుంది. బిడ్డ తొలి పలుకులకు అమ్మ ఆచార్యత్వం వహిస్తుంది. ఆరుసార్లు భూ మండల ప్రదక్షిణ, పదివేలసార్లు కాశీయాత్ర, వందసార్లు సముద్ర స్నానం చేసిన ఫలితం తల్లికి వందనం చేయడం వల్ల దొరుకుతుందని చెబుతారు పెద్దలు. అందుకే అమ్మతో సమానమైన దైవం, పూజ్యులు, బంధువులు, గురువులు లేరన్నది అక్షర సత్యం.    

- ఎర్రాప్రగడ రామకృష్ణ

ఆది శంకరుల ‘మాతృపంచకం’

ది శంకరుల తల్లి ఆర్యాంబ కాలడిలో మరణ శయ్యమీద ఉన్నారు. పుత్రుణ్ని ఆమె తలచుకున్న వెంటనే తల్లి దగ్గరికి వచ్చి ఆమెకు ఉత్తర క్రియలు చేశారు శంకరులు. ఆ సందర్భంలో ఆయన చెప్పిన అయిదు శ్లోకాలు మాతృ పంచకంగా ప్రసిద్ధి చెందాయి. ‘నువ్వు నా ముత్యానివి. రత్నానివి. నా కంటి వెలుగువి. కుమారా! నువ్వు చిరంజీవిగా వర్ధిల్లాలి అంటూ నన్ను ప్రేమగా పిలిచిన నీ నోటిలో ఈరోజు కేవలం ఇన్ని ముడి బియ్యపు గింజలు వేస్తున్నాను’ అని ఆవేదనాభరితులవుతారు శంకరులు. ‘అమ్మా! నన్ను కన్న సమయంలో ఎంతటి శూల వ్యధ అనుభవించావో కదా. మలంతో శయ్య మలినమైనా ఏడాది పాటు ఎలా సహించావో కదా? కొడుకు ఎంత గొప్పవాడైనా తల్లి రుణాన్ని తీర్చుకోగలడా?’ అంటూ మాతృ మూర్తికి అంజలి ఘటిస్తారు. తన ‘అపరాధ క్షమాపణ స్తోత్రం’లో ‘లోకంలో దుర్మార్గులైన కొడుకులు ఉంటారేమోగానీ, దుర్మార్గులైన తల్లులు ఉండరు’ అంటూ అమ్మ సహజ జీవ లక్షణాన్ని వివరిస్తారు శంకర భగవత్పాదులు. ఏ యుగంలో తల్లులకైనా వర్తించే మాట ఇది.

అమ్మా! వందనం

‘వాయు పురాణం’లో అమ్మ గొప్పదనం గురించి 16 శ్లోకాలున్నాయి. వీటిని మాతృషోడశిగా పేర్కొంటారు. ‘గర్భం ధరించటమే దుఃఖం. ఎగుడు దిగుడు నేల మీద నడవటం ఇంకా దుఃఖం. ఆ కష్టం కలిగించినందుకు, రాత్రి పగలు తేడా లేకుండా నీ స్తన్యం కోసం వేధించినందుకు, రాత్రిపూట మల మూత్రాలతో నీ పక్క తడిపి నీకు సుఖం లేకుండా చేసినందుకు ఈ మాతృపిండం సమర్పిస్తున్నాను’... ఇలా అమ్మ త్యాగానికి జోతలు పడతాయివి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని